ఆదాల కోరిక తీరినట్లేనా?

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అవకాశం కనబడలేదు. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఎంపీకి కోటంరెడ్డి వివాదంతో రొట్టె విరిగి నేతిలో పడ్డట్లైంది.

Advertisement
Update: 2023-02-03 04:35 GMT

ఆదాల ప్రభాకరరెడ్డి కోరిక ఇంతకాలానికి తీరినట్లయ్యింది. ఆర్థిక‌, అంగబలాల్లో అత్యంత పటిష్టంగా ఉండే వ్యక్తులే ఇప్పుడు రాజకీయాలకు కావాల్సింది. ఇవి రెండింటితో పాటు వివాదరహితుడైన ఆదాలకు కోరిన నియోజకవర్గంలో టికెట్ దక్కటం పెద్ద కష్టమేమీకాదు. కానీ చాలాకాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీచేసి గెలవాలనే కోరిక మాత్రం అందని ద్రాక్షలా మారింది. అలాంటి కోరిక రాబోయే ఎన్నికల రూపంలో తీరబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆదాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆదాలకు ఆర్థిక‌, అంగబలాలకు ఎలాంటి కొదవలేదు. 1999లో అల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి నుండి గెలిచారు. అయితే ఆయన దృష్టంతా నెల్లూరు నియోజకవర్గం మీదే ఉండేదట. కానీ అందుకు అవకాశం మాత్రం దక్కలేదు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది. వెంటనే ఇక్కడి నుండి పోటీ చేయాలని అనుకుంటే అదీ సాధ్యం కాలేదు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆనం వివేకానందరెడ్డి పోటీ చేశారు. దాంతో కాంగ్రెస్‌లో లాభంలేదని అనుకుని టీడీపీలోకి మారిపోయారు. అయితే 2014లో పొత్తులో భాగంగా బీజేపీ తరపున సన్నపురెడ్డి సురేష్ పోటీచేయగా, 2019లో అబ్దుల్ అజీజ్ పోటీచేసి ఓడిపోయారు. రెండుసార్లు వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధరరెడ్డే గెలిచారు.

నిజానికి 2019లో టీడీపీ తరపున ఆదాలే పోటీ చేయాల్సింది. చంద్రబాబునాయుడు రూరల్ అభ్యర్థిగా ఆదాలనే ప్రకటించారు. రెండు రోజులు ప్రచారం కూడా చేసిన ఆదాల ఉన్నట్లుండి మాయమైపోయారు. రెండు రోజుల తర్వాత ప్రత్యక్షమైన ఆదాల వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. టీడీపీ గెలవదనే నిర్దారణకు వచ్చిన ఆదాల చివరి నిమిషంలో పార్టీ మారిపోయి ఎంపీగా పోటీచేసి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అవకాశం కనబడలేదు. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఎంపీకి కోటంరెడ్డి వివాదంతో రొట్టె విరిగి నేతిలో పడ్డట్లైంది. స్పీడుగా జరిగిపోయిన పరిణామాల్లో ఆదాల రూరల్ నియోజకవర్గం అభ్యర్థ‌యిపోయారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News