2030 కల్లా మరణాలు, విపత్తులు 50 శాతం పెరిగే అవకాశం ఉంది " ఐక్యరాజ్యసమితి

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు గతంలో కంటే వేగంగా జరుగుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించకపోవడంతో… వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పులే ఈ విపత్తులకు కారణమని.. వీటి బారిన పడే వారి సంఖ్య అసమానంగా పెరిగిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ విభాగం ‘స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ రిపోర్ట్ 2020 : ముందస్తు హెచ్చరికల నుంచి ముందస్తు చర్యల వైపు’ అనే పేరుతో రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గత […]

Advertisement
Update: 2020-10-14 04:54 GMT

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు గతంలో కంటే వేగంగా జరుగుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించకపోవడంతో… వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పులే ఈ విపత్తులకు కారణమని.. వీటి బారిన పడే వారి సంఖ్య అసమానంగా పెరిగిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొన్నది.

ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ విభాగం ‘స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ రిపోర్ట్ 2020 : ముందస్తు హెచ్చరికల నుంచి ముందస్తు చర్యల వైపు’ అనే పేరుతో రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా గత 50 ఏండ్లుగా 11 వేల విపత్తులు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ వాతావరణం, వరదలు, నీటి ద్వారా ఏర్పడిన విపత్తులే. వీటి వల్ల దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.6 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. ఒక్క 2018లోనే తుఫానులు, వరదలు, కరువు, అడవుల దహనాల వల్ల 108 మిలియన్ ప్రజలు ప్రభావితమయ్యారు. వీరికి ఆయా ప్రభుత్వాలు మనవతా దృక్పదంతో సహాయం అందించాల్సి వచ్చింది. కాగా, 2030 కల్లా ఈ సంఖ్య 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని… ప్రతీ ఏడాది 20 బిలియన్ డాలర్ల మేర నష్టం కలుగుతుందని నివేదికలో అంచనా వేసింది.

1970 నుంచి 2019 మధ్య 79 శాతం విపత్తులు వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన విపత్తులేనని.. నీటి ద్వారా ఏర్పడిన విపత్తులదే ప్రధాన పాత్ర అని నివేదిక తేల్చింది. ఈ విపత్తుల కారణంగా 56 శాతం మరణాలు సంభవించగా.. 75 శాతం ఆర్థిక నష్టాలు కలిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో (2010-2019) వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన విపత్తులు, నీటి ద్వారా జరిగిన విపత్తులు 9 శాతం మేర పెరిగాయి. అంతకుముందు దశాబ్దంతో పోల్చుకుంటే 14 శాతం మేర విపత్తులు పెరిగాయని నివేదికలో వెల్లడించారు.

చిన్న ద్వీపాలతో కూడిన దేశాలు, అత్యంత వెనుకబడిన దేశాలే ఈ విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుస్తున్నది. 1970 నుంచి చిన్న దీవుల సమూహ దేశాలు 153 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. ఆయా దేశాల్లో 13.7 బిలియన్ డాలర్ల మేర జీడీపీ కూడా నష్టపోయారు. అంతే కాకుండా 1.4 మిలియన్ మరణాలు (మొత్తం మరణాల్లో 70 శాతం) కేవలం విపత్తుల వల్లే సంభవించాయి.

ఇండియాలో మిడతల దాడులు

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో ఇండియాలో మిడతల దాడుల గురించి కూడా పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో పవన్ తుఫాను తర్వాత ఆఫ్రికాలో ఎడారి మిడతల సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఆ ప్రాంతం ఎడారి మిడతల కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా నష్టపోయింది. కెన్యాలో అయితే గత 70 ఏళ్లలో ఇలాంటి మిడతల దాడులు సంభవించలేదు. ఆఫ్రికా ప్రాంతంలో పుట్టిన మిడతలే ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ దేశాల మీద కూడా దండెత్తాయని నివేదికలో పేర్కొంది.

కాగా ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి తగినన్ని సౌకర్యలు ఆఫ్రికా దేశాల్లో లేవని నివేదికలో పేర్కొన్నది. విపత్తులకు సంబంధించిన వార్తలను ప్రజలకు త్వరితగతిన చేర్చడానిక అవసరమైన వ్యవస్థలు పలు దేశాల్లో ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నాయని.. అందువల్ల ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు నివేదకలో తేల్చింది.

ఈ నివేదికకు ముందు మాట రాసిన ప్రపంచ వాతావరణ సంఘం సెక్రటరీ జనరల్ పెటేరీ తాలస్ పలు విషయాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకోవడానికి మరికొన్ని ఏళ్లు పడుతుందన్నారు. అదే సమయంలో వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే విపత్తులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. దీనివల్ల మానవుల జీవితాలకే కాకుండా పర్యావరణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సమాజానికి రాబోయే కాలంలో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

Similar News