జపాన్ లో... ఆందోళన రేపుతున్న సెలబ్రిటీల ఆత్మహత్యలు !

కరోనా అనేది ఒకే పదంగా వినబడుతున్నా… అది ఒకే సమస్య కాదు… అది తెచ్చిపెడుతున్న కష్టనష్టాలు మరెన్నో. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. జపాన్ లోని ఒక పరిస్థితి అందుకు నిదర్శనంగా ఉంది. జపాన్ లో మే నెలనుండి నలుగురు సెలబ్రిటీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కిందటి ఆదివారం 40 ఏళ్ల నటి యుకో టకూచీ టోక్యోలోని తన ఇంట్లో ప్రాణాలు తీసుకుంది. నటిగా అవార్డులు సాధించిన ప్రతిభావంతురాలు ఆమె. యుకో కి ముందు […]

Advertisement
Update: 2020-09-30 03:55 GMT

కరోనా అనేది ఒకే పదంగా వినబడుతున్నా… అది ఒకే సమస్య కాదు… అది తెచ్చిపెడుతున్న కష్టనష్టాలు మరెన్నో. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. జపాన్ లోని ఒక పరిస్థితి అందుకు నిదర్శనంగా ఉంది. జపాన్ లో మే నెలనుండి నలుగురు సెలబ్రిటీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

కిందటి ఆదివారం 40 ఏళ్ల నటి యుకో టకూచీ టోక్యోలోని తన ఇంట్లో ప్రాణాలు తీసుకుంది. నటిగా అవార్డులు సాధించిన ప్రతిభావంతురాలు ఆమె. యుకో కి ముందు ఈ నెల 14న 36 ఏళ్ల టీవీ నటి సీ అసినా సైతం టోక్యోలోని తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది. ముప్పయ్యేళ్ల నటుడు, గాయకుడు హరుమా మియురా టోక్యోలోని తన ఇంట్లో జులై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మే నెలలోనే 22 ఏళ్ల ప్రొఫెషనల్ రెజ్లర్, రియాలిటీ టీవీ స్టార్ హనా కిమురా మరణించింది. ఆమెది కూడా ఆత్మహత్యగా భావిస్తున్నారు. అంతకుముందు సోషల్ మీడియాలో ఆమెపై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. వరుసగా సెలబ్రిటీలు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో జపాన్ లో ఈ విషయం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్కడి ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా భావించి స్పందించింది. ఎవరికైనా ఏమైనా మానసిక సమస్యలు ఉన్నా, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వచ్చి నిపుణుల సహాయం తీసుకోవాలని కోరింది. సెలబ్రిటీలే కాదు… సాధారణ వ్యక్తుల ఆత్మహత్యలు సైతం ఈ మధ్యకాలంలో మరింత పెరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక్క ఆగస్టు నెలలోనే 1,849 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే రోజుకి సగటున అరవై మంది. కోవిడ్ 19 కారణంగా పెరుగుతున్న ఆందోళన, భయాలు ఇందుకు కారణమని జపాన్ ప్రజారోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

ఇప్పుడే కాదు… ఇంతకుముందు కూడా జపాన్ లో ఆత్మహత్యల సమస్య ఉంది. అభివద్ధి చెందిన దేశాల్లో ఆత్మహత్యల విషయంలో జపాన్ ఐదవ స్థానంలో ఉంది. పనిపరమైన ఒత్తిడి, ఒంటరితనం ఈ రెండు కారణాల వల్లనే జపాన్ లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన జపాన్ లో మనుషులు సైతం యంత్రాల్లా మారిపోయి ఒత్తిడికి గురవుతున్నారనడానికి అక్కడి ఆత్మహత్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Advertisement

Similar News