అందుకే ఆడవారిలో డ్రగ్ రియాక్షన్లు ఎక్కువ!

ఔషధాలను తయారుచేసిన తరువాత అవి ఎలా పనిచేస్తున్నాయి.. అనారోగ్యాలను తగ్గించడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు క్లినికల్ డ్రగ్ ట్రైల్స్ ని నిర్వహిస్తుంటారు. అయితే మందులను పరీక్షించేటప్పుడు చాలావరకు మగవారినే ప్రామాణికంగా తీసుకుంటూ వారిపైనే ప్రయోగించి చూడటం వలన… అవి మహిళలకు అవసరానికి మించినవిగా మారుతున్నాయని బయాలజీ ఆఫ్ సెక్స్ డిఫరెన్స్ స్ అనే జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది. పుట్టుకతోనే ఆడా మగా శరీర నిర్మాణంలో కానీ జీవరసాయనాల విషయంలో కానీ […]

Advertisement
Update: 2020-08-13 08:03 GMT

ఔషధాలను తయారుచేసిన తరువాత అవి ఎలా పనిచేస్తున్నాయి.. అనారోగ్యాలను తగ్గించడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు క్లినికల్ డ్రగ్ ట్రైల్స్ ని నిర్వహిస్తుంటారు.

అయితే మందులను పరీక్షించేటప్పుడు చాలావరకు మగవారినే ప్రామాణికంగా తీసుకుంటూ వారిపైనే ప్రయోగించి చూడటం వలన… అవి మహిళలకు అవసరానికి మించినవిగా మారుతున్నాయని బయాలజీ ఆఫ్ సెక్స్ డిఫరెన్స్ స్ అనే జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది.

పుట్టుకతోనే ఆడా మగా శరీర నిర్మాణంలో కానీ జీవరసాయనాల విషయంలో కానీ తేడాలు ఉంటాయి. ఒక్క పునరుత్పత్తి సామర్ధ్యం విషయంలోనే కాకుండా మెటబాలిజం, రోగనిరోధక శక్తి, హార్మోన్లను స్రవించే గ్రంథులు… ఇలా అనేక విషయాల్లో స్త్రీల శరీరం మగవారి శరీరానికి భిన్నంగా ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న మందులేవీ ఈ తేడాలను పరిగణనలోకి తీసుకుని తయారవుతున్నవి కావు.

అసలు మహిళలకు పురుషులకు వేరు వేరు ఔషధాలు లేవన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔషధాల్లో చాలావరకు మగవారిపై క్లినికల్ ట్రయల్స్ చేసి ఆమోదించినవేనని…. దీని వలన మహిళలు అనవసరంగా ఎక్కువ మందులు తీసుకుంటున్నారని, దాంతో వారిలో మగవారిలో కంటే డ్రగ్ రియాక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని బయాలజీ ఆఫ్ సెక్స్ డిఫరెన్స్ స్ జర్నల్ లో ప్రచురించిన ఆర్టికల్ వెల్లడించింది.

అధ్యయనం కోసం అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించిన 86 మందులను తీసుకున్నారు. వీటిని స్త్రీ పురుషులు ఇరువురు వాడినప్పుడు మహిళల్లో మగవారిలో కంటే అధికంగా రియాక్షన్లు రావటం గమనించారు. డిప్రెషన్ కి వాడే యాంటీ డిప్రెసెంట్స్, నొప్పులకు, మూర్ఛలకు, గుండెవ్యాధులకు వాడే మందులపై… స్త్రీ పురుషులపై ఔషధాలు పనిచేసే తీరు గురించిన అధ్యయనం నిర్వహించగా వికారం తలనొప్పి ఆందోళన భ్రాంతులు ఆలోచనా శక్తి లోపించడం లాంటివి మహిళల్లో మగవారిలోకంటే ఎక్కువగా కనిపించాయి.

ఔషధాల పనితీరుని తెలుసుకునేందుకు మనుషులపై పరీక్షించి చూసే క్లినికల్ ట్రైల్స్ దశలో… మహిళలను కూడా ఎక్కువ సంఖ్యలో చేర్చాల్సి ఉందని ఈ అధ్యయనం స్పష్టంగా చెబుతోంది. ఔషధాల క్లినికల్ ట్రైల్స్ లో… స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అనే అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవటం వలన మహిళలు అనవసరంగానూ, అధిక మోతాదులోనూ ఔషధాలు తీసుకోకుండా నివారించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News