వాడు దేవుడి రథాన్ని తగలబెట్టాడు.... మీడియా మంటలు రేపుతోంది....

నెల్లూరు జిల్లా కొండబిడ్రగుంట గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన రథాన్ని రాత్రి ఒక వ్యక్తి తగలబెట్టాడు. ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ ఛానల్‌ లో దానికి సంబంధించిన వార్త ఇస్తూ… ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల వల్ల ఒక వర్గం వారు ఆ రథాన్ని తగలబెట్టారని ప్రసారం చేశారు. మరో మీడియా సంస్థ తగలబెట్టింది ఒక ముస్లిం అని…. జగన్‌ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణలేకుండా పోయిందన్న కలరింగ్‌ ఇచ్చారు. ఇట్లాగే […]

Advertisement
Update: 2020-02-14 05:49 GMT

నెల్లూరు జిల్లా కొండబిడ్రగుంట గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన రథాన్ని రాత్రి ఒక వ్యక్తి తగలబెట్టాడు. ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ ఛానల్‌ లో దానికి సంబంధించిన వార్త ఇస్తూ… ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల వల్ల ఒక వర్గం వారు ఆ రథాన్ని తగలబెట్టారని ప్రసారం చేశారు.

మరో మీడియా సంస్థ తగలబెట్టింది ఒక ముస్లిం అని…. జగన్‌ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణలేకుండా పోయిందన్న కలరింగ్‌ ఇచ్చారు. ఇట్లాగే చిలవలపలవులుగా మిగతా వార్తా సంస్థలు కూడా కథనాలు ఇచ్చాయి.

నిజానికి ఆ రథాన్ని తగలబెట్టిన వ్యక్తి ఒక హిందువు. గిరిజనుడు. ఎరుకల కులానికి చెందినవాడు. అతను ముస్లిం కాదు. అన్నింటికన్నా ముఖ్యవిశేషం ఏమిటంటే అతను మతిస్థిమితం లేని వ్యక్తి. ఎన్నో ఏళ్ళుగా పిచ్చోడిలాగా ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. ఎవ్వరూ అతన్ని పట్టించుకోరు. ఎప్పుడైనా అతను చిన్న పిల్లలకు కానీ, ఇతరులకు కానీ ఇబ్బంది కలిగిస్తే అతనిని తిట్టడమో లేక ఒక దెబ్బ వేయడమో చేస్తుంటారు గ్రామస్తులు.

ఆ వ్యక్తి ఎంతటి పిచ్చోడు అంటే కొద్దిరోజుల క్రితం వాళ్ళింట్లో ఎద్దుల మీద ఆ వ్యక్తికి కోపం వచ్చింది. వెంటనే వాడు ఆ ఎద్దులను తీసుకెళ్ళి రైలు పట్టాల మీద కట్టేశాడు. రైలు వచ్చి వాటిని కొట్టేసింది. అవి చనిపోయాయి. అలాంటి పిచ్చోడు రాత్రి వెంకటేశ్వర స్వామి రథం దగ్గరకు వెళ్ళాడు. రథం చుట్టూతా తాటాకులతో పూర్తిగా రథాన్ని కుట్టేసి ఉన్నారు. బీడీ వెలిగించుకోబోయి ప్రమాదం జరిగిందా? లేక కావాలనే ఆ తాటాకులను తగలబెట్టాడా? తెలియదు. కానీ మొత్తం మీద అతని వల్ల తాటాకులు తగలబడి కొయ్యరథం మొత్తం తగలబడి బూడిదయ్యింది.

అది తెలిసి గ్రామస్తులంతా ఒకవైపు దేవుడి రథం కాలిపోయిందని బాధపడుతుంటే…. మరోవైపు ఈ మీడియా పైత్యం వల్ల మరింత ఎక్కువ బాధపడుతున్నారు గ్రామస్తులు. ఎప్పుడూ ఆ గ్రామంలో పెద్దగా తగాదాలు లేవు. గ్రూపులు అసలే లేవు. ఇలా తగలబెట్టుకునే సంస్కృతీ లేదు. ఊరుమొత్తం మీద ఒకటో రెండో ముస్లిం కుటుంబాలు. మత కలహాలు లేవు…. కానీ మీడియా వార్తలు చూసి తలలు పట్టుకుంటున్నారు ఆ గ్రామస్తులు.

Tags:    
Advertisement

Similar News