తహసీల్దార్ దారుణ హత్య... కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవ దహనం

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. ఒక మహిళా తహసీల్దార్‌ను సురేష్ అనే వ్యక్తి కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే తహసీల్దార్ అగ్నికీలలకు ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయారెడ్డి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. ఈ మండలం కొత్తగా ఏర్పడిన దగ్గర నుంచి ఆమే తహశీల్దారుగా ఉన్నారు. ఇవాళ మధ్యహ్నం భోజన విరామ సమయంలో జనసందోహం ఎక్కువగా లేరు. అదే సమయంలో పెట్రోల్ బాటిల్‌తో […]

Advertisement
Update: 2019-11-04 11:21 GMT

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. ఒక మహిళా తహసీల్దార్‌ను సురేష్ అనే వ్యక్తి కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే తహసీల్దార్ అగ్నికీలలకు ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయారెడ్డి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. ఈ మండలం కొత్తగా ఏర్పడిన దగ్గర నుంచి ఆమే తహశీల్దారుగా ఉన్నారు. ఇవాళ మధ్యహ్నం భోజన విరామ సమయంలో జనసందోహం ఎక్కువగా లేరు. అదే సమయంలో పెట్రోల్ బాటిల్‌తో ఆమె ఛాంబర్‌లోకి ప్రవేశించి.. ఆమెతో 30 నిమిషాల పాటు భూవివాదం విషయమై గొడవపడి ఆమెపై పెట్రోల్ కుమ్మరించి నిప్పంటించాడు. ఆ మంటల్లో విజయారెడ్డి కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హయత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

కాగా, విజయారెడ్డిని సజీవదహనం చేసిన దుండగుడు ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో అతను కూడా అక్కడి నుంచి బయటకు పరుగు తీసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు.

అసలు విజయారెడ్డిపై ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియరాలేదు. సంఘటన వివరాలు తెలుసుకొని పోలీసులు రెవెన్యూ కార్యాలయాన్ని తమ ఆధీనంలోని తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ సన్ ప్రీత్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరోవైపు తహసీల్దార్‌పై జరిగిన ఘాతుకానికి నిరసనగా రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. వెంటనే నిందితుడిని పట్టుకొని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిందితుడు గౌరెల్లికి చెందిన సురేష్ అని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News