జగన్‌కు సంచార నాయకుల గుణపాఠం!

ఆపదలోనే అయినవారు ఎవరు? కాని వారు ఎవరు? అన్నది నిర్థారణ అవుతుందంటారు. ఇప్పుడు జగన్‌ది కూడా ఇదే పరిస్థితి. 2014  ఎన్నికల్లో జగన్‌ను చూసే 67 మంది ఎమ్మెల్యేలను వైసీపీ తరపున గెలిపించిన విషయం కాదనలేని నిజం. అయితే ఇప్పుడు వారిలో కొందరు ఎమ్మెల్యేలు డబ్బుల కోసమో, మరో లబ్ది కోసమో గోడదూకి టీడీపీలోకి దూరిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే అలా వెళ్తున్న వారిలో చాలా మంది పూర్వాశ్రమంలో టీడీపీ వాసనలు ఉన్నవారే. భూమానాగిరెడ్డి, భూమా […]

Advertisement
Update: 2016-04-22 22:31 GMT

ఆపదలోనే అయినవారు ఎవరు? కాని వారు ఎవరు? అన్నది నిర్థారణ అవుతుందంటారు. ఇప్పుడు జగన్‌ది కూడా ఇదే పరిస్థితి. 2014 ఎన్నికల్లో జగన్‌ను చూసే 67 మంది ఎమ్మెల్యేలను వైసీపీ తరపున గెలిపించిన విషయం కాదనలేని నిజం. అయితే ఇప్పుడు వారిలో కొందరు ఎమ్మెల్యేలు డబ్బుల కోసమో, మరో లబ్ది కోసమో గోడదూకి టీడీపీలోకి దూరిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే అలా వెళ్తున్న వారిలో చాలా మంది పూర్వాశ్రమంలో టీడీపీ వాసనలు ఉన్నవారే.

భూమానాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, జ్యోతుల నెహ్రు, పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్, తాజాగా పార్టీ వీడేందుకు సిద్ధమైన కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషా ఇలా ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలందరూ ఒకప్పుడు టీడీపీ వారే. కేవలం మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుస్తామన్న నమ్మకం లేక జగన్ పంచన చేరారు. తీరా చూస్తే బాబు చేసిన జిమ్మిక్కుల దెబ్బకు జనం టీడీపీకే ఓటేశారు. ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చిఉంటే ఫిరాయింపు బ్యాచ్‌ వైసీపీలోనే ఉండేది కాబోలు. కానీ ఏ అధికారం కోసమైతే జగన్‌ పంచన చేరారో… ఆ అధికారం దక్కకపోయే సరికి మళ్లీ టీడీపీ వైపు మళ్లారు.

పాత పరిచయాలు, సిగ్గులేని తనం వంటివన్నీ ఇలాంటి నాయకులకు బాగా కలిసి వచ్చాయి. అందుకే తిరిగి టీడీపీలో చేరిపోతున్నారు. అయితే ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలదే కాదు సగం తప్పు జగన్‌ది కూడా ఉందనే చెప్పాలి. టీడీపీపై యుద్ధం చేసే ముందు తన సైన్యంలో కరుడుగట్టిన టీడీపీ వ్యతిరేకులను కాకుండా… అప్పటి వరకు చంద్రబాబుకు సేవ చేసిన వారిని చేర్చుకోవడమే పొరపాటు. జన్మనిచ్చిన టీడీపీకే వెన్నుపోటు పొడిచిన నేతలు… రేపుపొద్దున తేడా వస్తే తనకు అలాంటి మోసమే ఎందుకు చేయరని ఆలోచించుకుని ఉండాల్సింది.

ఇలా టీడీపీ వాసనలు ఉన్న వారికన్నా బై బర్త్ యాంటీ టీడీపీగా బతికిన కాంగ్రెస్‌ నేతలను తీసుకుని ఉన్నా ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదేమో. కాంగ్రెస్‌ నుంచి కొందరు సీనియర్లు పార్టీలో చేరేందుకు ప్రయత్నించినా అప్పట్లో జగన్‌ అంగీకరించలేదని చెబుతుంటారు. బహుశా సీనియర్ల కంటే జూనియర్లు అయితే హ్యాండిల్ చేయడం, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లేందుకు ఈజీగా ఉంటుందని జగన్ భావించి ఉండవచ్చు. అందుకే కొత్తగా వచ్చిన వారిని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. కానీ సదరు జూనియర్లు టీడీపీ నుంచి వచ్చే 30, 40 కోట్ల ఆఫర్లు చూసి అన్నీ అమ్ముకునేందుకు సిద్ధపడిపోతున్నారు. పార్టీలు మారుతూ సంచరించే నాయకుల విషయంలో ఇకముందైనా వైసీపీ జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది. అలా అనీ అందరినీ అదే గాటన కట్టలేం. టీడీపీ నుంచి వచ్చి కూడా వైసీపీ కోసం ఎంతదూరమైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న నేతలు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఎక్కువసార్లు పార్టీలు మారే నేతల క్యారెక్టర్ ను అంత ఎక్కువగానే శంకించి పరిశీలించాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News