కృతజ్ఞత (Devotional)

ఒక యువకుడు రాజు దగ్గరికి వెళ్ళి “రాజుగారూ! నేను ఒకరోజు మీ అంతఃపురంలో అతిథిగా ఉండాలనుకుంటున్నాను. అనుమతించండి” అన్నాడు. రాజు అతని కోరికను మన్నించి అంతఃపురంలో ఒక గదిలో సకల సదుపాయాల్ని అమర్చి అక్కడ ఉండమన్నాడు.             ఆ యువకుడు సామాన్యుడు. అతని కోరిక అసామాన్యమయింది. తన ఆలోచనతో తన కోరికకు అతను సమన్వయాన్ని పొందలేకపోయాడు. అతని జీవన విధానానికి అంతఃపుర జీవనానికి అనుసంధానం కుదర్లేదు. అంతఃపుర మర్యాదలు, క్రమశిక్షణ అతనికి అంతుబట్టలేదు. వాటిని అతను జీర్ణించుకోలేకపోయాడు. […]

Advertisement
Update: 2015-06-07 13:01 GMT

ఒక యువకుడు రాజు దగ్గరికి వెళ్ళి “రాజుగారూ! నేను ఒకరోజు మీ అంతఃపురంలో అతిథిగా ఉండాలనుకుంటున్నాను. అనుమతించండి” అన్నాడు. రాజు అతని కోరికను మన్నించి అంతఃపురంలో ఒక గదిలో సకల సదుపాయాల్ని అమర్చి అక్కడ ఉండమన్నాడు.

ఆ యువకుడు సామాన్యుడు. అతని కోరిక అసామాన్యమయింది. తన ఆలోచనతో తన కోరికకు అతను సమన్వయాన్ని పొందలేకపోయాడు. అతని జీవన విధానానికి అంతఃపుర జీవనానికి అనుసంధానం కుదర్లేదు. అంతఃపుర మర్యాదలు, క్రమశిక్షణ అతనికి అంతుబట్టలేదు. వాటిని అతను జీర్ణించుకోలేకపోయాడు.

పైగా ఎన్నివున్నా రాజు అంతటివాడు తనలాంటి మామూలు మనిషి కోరికను మన్నించాడు. కనీసం ఆ కృతజ్ఞత ప్రకటించాలన్న ఇంగితం లేకపోయింది. ఇష్టా ఇష్టాల్ని పక్కనపెట్టి మౌనంగా ఉండడం కూడా చేతకాలేదు. ఒకసారి పిలిస్తే సేవకుడు వేరేపనిలో ఉండి వెంటనే బదులివ్వలేదు. మరొక సేవకుడు నీళ్ళు అడిగితే ఒక నిముషం ఆలస్యంగా తీసుకొచ్చాడు.

ఆరోజు గడిచిపోయింది. ఆ యువకుడు గోరంతలు కొండంతలు చేసి రాజుతో వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు. పైగా ఆ గది అంత అనుకూలంగా లేదని అన్నాడు.

అతని మాటల్తో ఆగ్రహించిన రాజు వెంటనే అతన్ని అంతఃపురం బయటికి తరమండి. ఇక్కడ వుండగలిగే అర్హత అతనికి లేదు అని సేవకుల్ని ఆజ్ఞాపించాడు.

ఆ అవమానాన్ని పొందిన యువకుడు సరాసరి ఒక సూఫీ గురువు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. సూఫీ గురువు కొన్నాళ్ళు తన దగ్గర ఉండమన్నాడు. కొన్నాళ్ళు గడిచాకా సూఫీ గురువు ఆ యువకుణ్ణి తీసుకుని రాజు దగ్గరకు వెళ్లి మీ రాజమందిరంలో కొన్నాళ్ళు ఉండడానికి అనుమతించండి అన్నాడు. రాజు సంతోషంగా అంగీకరించాడు. సూఫీ గురువుకు సకల సదుపాయాలు అమర్చాడు. కొన్నాళ్ళు గడిచాయి.

సూఫీ గురువు యువకుడితో కలిసి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. రాజు “గురువు గారూ! మీకు ఎలా గడిచింది. మీకేమైనా ఇబ్బంది కలిగిందా?” అన్నాడు. గురువు “రాజా! మీ ఆతిథ్యం ఈ జన్మలో మరచిపోలేనిది. మీరు కల్పించిన అనుకూలం అదృష్టవంతులకు కానీ జరగనిది. ఇన్ని సౌకర్యాల్ని కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు” అని చెప్పాడు. రాజు సేవకులతో గురువుగారిని జాగ్రత్తగా ఇంటి దాకా సాగనంపండి అన్నాడు.

గురువు యువకుడితో ఇంటికి వెళ్ళాక యువకుణ్ణి చూసి “జరిగిందంతా చూశావు కదా! జీవితానికి సంబంధించిన రహస్యమదే. ఆ రహస్యం ఏమిటంటే కృతజ్ఞత, కృతజ్ఞత లోపాలు వెతకదు. సంతృప్తిని వ్యక్తపరుస్తుంది” అన్నాడు.

మనం ఈ అనంత సృష్టిలో భాగాలం. మానవుని పట్ల మనం కృతజ్ఞత ప్రకటించాలి. మనకీ జన్మనిచ్చిన ప్రకృతిపట్ల మనం తలవంచాలి. మన పరవశాన్ని, పరమానందాన్ని వ్యక్తపరచాలి. అది హృదయాంతరాళాల నుండి రావాలి. అప్పుడు ప్రకృతి మనల్ని చల్లగా చూస్తుంది. ఆనందంతో ఆలింగనం చేసుకుంటుంది. మనం అడిగినవేకాదు, అడగనివి కూడా ఇస్తుంది.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News