ప్రహ్లాదుడు (For Children)

     ప్రహ్లాదుడు “ప్రహ్లాదుడు” కన్నా “భక్త ప్రహ్లాదుడుగా”గానే ప్రసిద్ధుడు. భక్తి అతని ఇంటి పేరయి పోయింది. భక్తికి నిర్వచనంగా పుట్టి భక్తితో పెరిగి భక్తి వలన కష్టాలను పడి – కష్టాలను దాటి భక్తితో తరించిన పాత్రే ప్రహ్లాదుడు.             లీలావతి హిరణ్యకశిపుల సంతానమే ప్రహ్లాదుడు. రాక్షసరాజుగా – శ్రీవారికి విరోధిగా – హిరణ్యకశిపుడు మనకు తెలుసు. అలాంటి హరి ద్వేషి కడుపున పుట్టి కడుపునిండా హరిభక్తి పెట్టుకున్న ప్రహ్లాదుని కథంతా అతని బాల్యానికి సంబంధించిందే […]

Advertisement
Update: 2015-05-09 13:19 GMT

ప్రహ్లాదుడు “ప్రహ్లాదుడు” కన్నా “భక్త ప్రహ్లాదుడుగా”గానే ప్రసిద్ధుడు. భక్తి అతని ఇంటి పేరయి పోయింది. భక్తికి నిర్వచనంగా పుట్టి భక్తితో పెరిగి భక్తి వలన కష్టాలను పడి – కష్టాలను దాటి భక్తితో తరించిన పాత్రే ప్రహ్లాదుడు.

లీలావతి హిరణ్యకశిపుల సంతానమే ప్రహ్లాదుడు. రాక్షసరాజుగా – శ్రీవారికి విరోధిగా – హిరణ్యకశిపుడు మనకు తెలుసు. అలాంటి హరి ద్వేషి కడుపున పుట్టి కడుపునిండా హరిభక్తి పెట్టుకున్న ప్రహ్లాదుని కథంతా అతని బాల్యానికి సంబంధించిందే ఎక్కువ. తరువాత కథ తక్కువ.

హిరణ్యాక్షుని మరణానంతరం హిరణ్యకశిపుడు మందర పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నాడని తెలిసిన దేవతలరాజు ఇంద్రుడు భయపడ్డాడు. ఇదే అదనుగా రాక్షసుల మీద యుద్ధం చేసి తరిమేసాడు. ఆపైన లీలావతిని తీసుకు వెళ్ళి బంధించాడు ఇంద్రుడు. నారదుడు తగదన్నాడు. గర్భవతి అన్నాడు. విడిచిపెట్టమన్నాడు. కడుపున వున్న శిశువును చంపి ఆమెను విడిచిపెడతానన్నాడు ఇంద్రుడు. రాక్షస వారసత్వంలేకుండా చేస్తానన్నాడు. నీకాభయం అక్కర్లేదని చెప్పి లీలావతిని నారదుడు తనతో తీసుకుపోయాడు. ఆదరించాడు. “నారాయణ… నారాయణ” అనే నారద మంత్రం ప్రహ్లాదుడి చెవిన అమ్మ కడుపున ఉండగానే పడింది. తత్వం వంట బట్టింది. అందుకనే పుట్టుకతోనే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడయ్యాడు.

తపస్సు పూర్తిచేసి మృత్యువు రాకుండా వరం కూడా పొందిన హిరణ్యకశిపునకు పుత్రోత్సాహం కలగక పోగా మనో వ్యాకులత మిగిలింది. తన శత్రువైన శ్రీహరి పేరును పదేపదే ప్రహ్లాదుడు జపించడం శరణుకోరాలని అనడం శరాఘాతంలా తగిలింది. శుక్రాచార్యుని కుమారులైన చండా మార్కులను పిలిచి విద్యాబుద్దులను నేర్పించమని ప్రహ్లాదుని అప్పగించాడు. హిరణ్యకశిపుని ఆశ నెరవేరలేదు. విష్ణునామం విడవలేదు. కొడుకని నయానాభయానా అన్నిరకములుగా చెప్పి చూసాడు. గురువులకే పాఠాలు చెప్పి తోటి శిష్యులను సయితం తనవైపుకి తిప్పుకున్న ప్రహ్లాదున్ని చూసి తమకులంలో చెడపుట్టావని తిట్టాడు హిరణ్యకశిపుడు. హరి నామాన్ని ఉచ్చరించకుండా ఉండడంకోసం ప్రహ్లాదున్ని కొడుకని చూడకుండా అనేక చిత్రహింసలు పెట్టించాడు. కొండలపై నుండి తోయించాడు. బండరాళ్ళనెత్తించాడు. ఏనుగులతో తొక్కించాడు. విషసర్పాలతో కాటు వేయించాడు. సముద్రంలో విసిరేయించాడు. విసిగి వేసారిన హిరణ్యకశిపుడు “ఏడిరా నీహరి?” అని ప్రశ్నిస్తే “ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు చూసిన అందందే గలడు” అని చెప్పాడు ప్రహ్లాదుడు. “అయితే ఈ స్థంబంలో ఉన్నాడా? హిరణ్యకశిపుడు ఎదురుగా ఉన్న స్థంభాన్ని చూపించి అడిగాడు. అంతటా నిండివున్నాడనడంతో – స్థంభాన్ని గదాయుధంతో కొట్టడం – ఉగ్ర నరసింహుడైన శ్రీహరి వచ్చి – శాపానికి లొంగని రీతిలో హిరణ్యకశిపుని సంహరించడం – ఇదంతా మీకు తెలిసిన కథే!

ప్రహ్లాదుడు పెద్దవాడై దేవిని పెళ్ళాడాడు. ఆయుష్మంతుడు, శిబి, విరోచనుడు, వికుంభుడు – నలుగురు కుమారులను కన్నాడు. విరోచనుని పుత్రుడే బలి. తదనంతరకాలంలో బలి చక్రవర్తి “విష్ణు వెంత? విష్ణువుని గెలవగలిగిన వారు మనలో లేరా?” అనడంతో ప్రహ్లాదుడికి కోపం వచ్చిందని, విష్ణుమూర్తి చేతనే అణగదొక్క బడతావని శపించాడనీ అంటారు! భక్తితో దీక్షతో శరణుకోరి బానిసగా మారి భగవంతుణ్ని బందీ చేసుకోవచ్చని భావించాడు ప్రహ్లాదుడు.

– బమ్మిడి జగదీశ్వరరావు

Advertisement

Similar News