Telugu Global
International

విహారికి అమ్మే నాన్న- పృథ్వీ షాకి నాన్నే అమ్మ!

18 ఏళ్ల వయసులోనే పృథ్వీ షా కు టెస్ట్ క్యాప్ 24 ఏళ్ల వయసులో హనుమ విహారీ టెస్ట్ అరంగేట్రం ప్రతిభావంతులైన క్రికెటర్ల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు రంగం ఏదైనా విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ మహిళ, ప్రతి మహిళ వెనుక ఓ పురుషుడు ఉండటం సహజమే. అయితే …బాల్యంలోనే తల్లిని, తండ్రిని కోల్పోయినా…. జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఉన్నత స్థితికి చేరిన కుర్రాళ్ళు మనకు అతితక్కువమంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారికే మకుటాయమానంగా కనిపించే టీమిండియా […]

విహారికి అమ్మే నాన్న- పృథ్వీ షాకి నాన్నే అమ్మ!
X
  • 18 ఏళ్ల వయసులోనే పృథ్వీ షా కు టెస్ట్ క్యాప్
  • 24 ఏళ్ల వయసులో హనుమ విహారీ టెస్ట్ అరంగేట్రం
  • ప్రతిభావంతులైన క్రికెటర్ల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు

రంగం ఏదైనా విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ మహిళ, ప్రతి మహిళ వెనుక ఓ పురుషుడు ఉండటం సహజమే. అయితే …బాల్యంలోనే తల్లిని, తండ్రిని కోల్పోయినా…. జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఉన్నత స్థితికి చేరిన కుర్రాళ్ళు మనకు అతితక్కువమంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారికే మకుటాయమానంగా కనిపించే టీమిండియా యువఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీల పై స్పెషల్ స్టోరీ…

విధి విలాసం….

పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో నూనూగు మీసాల కుర్రాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. విధివిలాసంతో తల్లిప్రేమకు దూరమైనా… తండ్రి వాత్సల్యం లేకపోయినా… ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ… తమ కుటుంబానికే కాదు… దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.

చిరుప్రాయంలోనే టెస్ట్ క్యాప్ లు….

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ జట్టులో.. చోటు సంపాదించాలంటే కనీసం మూడు పదుల వయసుదాటాలని…తగిన అనుభవం ఉండితీరాలనుకొనే రోజులు పోయాయి. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనుకొనే రోజులు వచ్చాయి.

ముంబై థండర్ పృథ్వీ షా 18 ఏళ్ల చిరుప్రాయంలోను, ఆంధ్ర వండర్ హనుమ విహారీ 24 ఏళ్ల ప్రాయంలోనూ టెస్ట్ క్యాప్ లు అందుకోడమే కాదు…అరంగేట్రం మ్యాచ్ ల్లోనూ అంచనాలకు మించి రాణించి వారేవ్వా… అనిపించుకొన్నారు.

తల్లిదండ్రుల త్యాగాలు

సాధారణంగా ప్రతిభావంతుడైన.. ఓ టెస్ట్ క్రికెటర్ తయారు కావాలంటే కుటుంబసభ్యుల, ప్రధానంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగం ఉండితీరాలి. అయితే… టీమిండియా లిటిల్ ఓపెనర్ పృథ్వీ షా వెనుక అమ్మలాంటి నాన్న త్యాగం, హనుమ విహారీ వెనుక నాన్నలాంటి అమ్మ ప్రోత్సాహం కనిపిస్తాయి.

క్రికెట్లో ఇప్పుడు ఎంతో పోటీ పెరిగింది. అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగాలంటే…అసాధారణ ప్రతిభతో పాటు…అత్యుత్తమ శిక్షణ, నిరంతర సాధన ఎంతో అవసరం.. వీటికితోడు తల్లిదండ్రుల అండదండలు పుష్కలంగా ఉండి తీరాలి.

రాజ్ కోట టెస్ట్ ద్వారా…అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించడమే కాదు…మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్న ముంబై కమ్ టీమిండియా యువఓపెనర్ పృథ్వీ షా, ఇంగ్లండ్ తో ముగిసిన పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ ఆఖరి మ్యాచ్ ద్వారా టెస్ట్ క్యాప్ అందుకొన్న హనుమ విహారీ వెనుక…తండ్రి…తల్లి ప్రోత్సాహం, తపన, త్యాగం మాత్రమే మనకు కనిపిస్తాయి.

కాకినాడ కుర్రోడు….

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జన్మించి… క్రికెటర్ గా హైదరాబాద్ లో ఎదిగిన ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారీ వెనుక…కేవలం తల్లి విజయలక్ష్మి ప్రోత్సాహం, త్యాగం, నిరంతర తపన మాత్రమే ఉన్నాయి.

భారత యువ మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారి….24 ఏళ్ల వయసులోనే భారత టెస్టు జట్టులో చోటు సంపాదించిన మూడో ఆంధ్ర క్రికెటర్.

ఇంగ్లండ్ తో ముగిసిన పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ ఆఖరి మ్యాచ్ ద్వారా…విహారీ అనూహ్యంగా టెస్ట్ క్యాప్ అందుకొన్నాడు. లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరిటెస్ట్ నిజంగా… విహారికి కత్తిమీద సాము లాంటిదే. ఇంగ్లండ్ బౌలర్ల స్వింగ్ పరీక్షను విజయవంతంగా ఎదుర్కొని…తన తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ లోనే…విహారీ ఫైటింగ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటుకొన్నాడు.

అంతేకాదు…ఆఫ్ స్పిన్నర్ గానూ మూడు ప్రధాన వికెట్లు సైతం పడగొట్టి…తనలో ఓ ఆల్ రౌండర్ కూడా ఉన్నాడని చెప్పకనే చెప్పాడు.

తల్లి త్యాగానికి ఫలితం….

హనుమ విహారీ టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టడంతో అతని తల్లి ఆనందానికి అంతేలేదు. తన జీవిత లక్ష్యం నెరవేరినంతగా సంబరపడిపోయింది.

ఎనిమిదేళ్ల వయసు నుంచే తండ్రి ప్రోత్సాహంతో విహారీ క్రికెట్ బ్యాట్ పట్టి…శిక్షణ తీసుకొంటూ వచ్చాడు. అయితే 12 ఏళ్ల వయసులోనే విహారీ తండ్రి హఠాన్మరణంతో ఒంటరివాడయ్యాడు.

అయినా…తల్లి విజయలక్ష్మి..తండ్రిపాత్రను పోషిస్తూ విహారీకి అండగా నిలిచింది. ఏ లోటూ లేకుండా అండగా నిలిచింది. జాన్ మనోజ్, శ్రీధర్ లాంటి శిక్షకుల పర్యవేక్షణలో విహారీ ప్రతిభావంతుడైన క్రికెటర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నాడు.

దేశవాళీ రంజీ ట్రోఫీతో పాటు… ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా నిలకడగా రాణించడం ద్వారా… సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా టెస్ట్ క్యాప్ సైతం అందుకొని మురిసిపోయాడు.

తల్లి విజయలక్ష్మి త్యాగాలకు ప్రతిఫలంగా తనకు టెస్ట్ క్యాప్ అందినట్లుగా పొంగిపోతున్నాడు.

ముంబై థండర్ పృథ్వీ షా…

ఇక… ముంబై చిచ్చరపిడుగు పృథ్వీ షా కథే వేరు. నాలుగేళ్ల చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతుడు పృథ్వీ షా.

బాల్యంలోనే తల్లిని కోల్పోయిన పృథ్వీ షాకు…తండ్రి పంకజ్ షానే తల్లిగా మారి…ఏ లోటు లేకుండా పెంచుతూ వచ్చాడు. రెండో పెళ్లికి దూరంగా ఉండటమే కాదు…కొడుకే లోకంగా జీవించిన పంకజ్ చివరకు…తన వ్యాపారాన్ని సైతం విడిచిపెట్టాడు.

ముంబై మహానగరంలో…కుమారుడు పృథ్వీ శిక్షణ కోసం రోజుకు 150 కిలోమీటర్ల రైలు ప్రయాణం చేసి మరీ ప్రోత్సహించాడు. 12 ఏళ్ల వయసు నుంచే అలవోకగా పరుగులు, సెంచరీలు సాధించిన పృథ్వీ షా ప్రతిభకు తగిన గుర్తింపు…ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉపకార వేతనం రూపంలో దక్కింది.

జూనియర్ స్థాయిలోనే….

అత్యున్నత ప్రమాణాలకు మరో పేరైన ముంబై క్రికెట్లో…పృథ్వీ షా…అండర్-14, అండర్ -16, అండర్ 19 విభాగాలలో అసాధారణంగా రాణించడం ద్వారా….పిల్లడు కాదు పిడుగు అనిపించుకొన్నాడు.

న్యూజిలాండ్ వేదికగా ముగిసిన అండర్ -19 ప్రపంచకప్ లో భారతజట్టుకు పృథ్వీ షా నాయకత్వం వహించడమే కాదు…తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. భారత జూనియర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ శిక్షణలో పృథ్వీ షా రాటు దేలడం ద్వారా…. సీనియర్ క్రికెట్ కు గురిపెట్టాడు.

ముంబై రంజీ జట్టులో సభ్యుడిగా తొలిమ్యాచ్ లోనే సెంచరీ సాధించడమే కాదు… దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్ లో సైతం మూడంక్కెల స్కోరు సాధించాడు.

ఇంగ్లండ్ టూర్ కు ఎంపికైన భారత టెస్ట్ జట్టు ఆఖరి రెండుమ్యాచ్ లకు సైతం హనుమ విహారితో కలసి పృథ్వీ షా ఎంపికయ్యాడు.

రాజకోట రాజా పృథ్వీ షా

ఇంగ్లండ్ టూర్లో ..టెస్ట్ అవకాశం రాకపోయినా…తనవంతు కోసం ఎదురుచూసిన పృథ్వీ షాను…వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ద్వారా…సెలెక్టర్లు కరుణించారు. రాజ్ కోట టెస్ట్ మ్యాచ్ తుదిజట్టులో…. 18 ఏళ్ల షాకు చోటు కల్పించారు.

టీనేజ్ వయసులోనే టెస్ట్ క్యాప్ సంపాదించిన పృథ్వీ షా అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడి ఏకంగా 134 పరుగుల స్కోరుతో సంచలనం సృష్టించాడు.

ఎనిమిది దశాబ్దాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో…ఓపెనర్ గా అతిపిన్న వయసులోనే టెస్ట్ మ్యాచ్ తొలిబంతిని ఎదుర్కొన్న ఆటగాడిగా…అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన ఓపెనర్ గా పృథ్వీ షా చరిత్ర సృష్టించాడు.

సెంచరీ నాన్నకే అంకితం….

తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తండ్రి పంకజ్ షాకే…తన తొలి టెస్ట్ శతకాన్ని అంకితమిస్తున్నట్లు పృథ్వీ ప్రకటించాడు. చివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం పృథ్వీ షానే అందుకొన్నాడు.

అరంగేట్రం టెస్టులోనే హనుమ విహారి.. హాఫ్ సెంచరీతో పాటు మూడువికెట్లు పడగొట్టినా….పృథ్వీ షా 134 పరుగులతో స్ట్రోక్ ఫుల్ సెంచరీ సాధించినా…ఈ ఇద్దరి యువ ఆటగాళ్ల ఘనత వెనుక నాన్న లాంటి అమ్మ, అమ్మ లాంటి నాన్న ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

హనుమ విహారీ తల్లి విజయలక్ష్మిని, పృథ్వీ తండ్రి పంకజ్ షాను నేటితరం అమ్మానాన్నలు చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

తండ్రి లేకపోయినా తల్లే తండ్రిలా, తల్లి లేకపోయినా తండ్రే తల్లిగా మారితే… అంతులేని త్యాగంతో స్ఫూర్తిగా నిలిస్తే…ఓ హనుమ విహారీ…ఓ పృథ్వీ షా తయారు కాగలరని ప్రత్యేకంగా చెప్పాలా మరి.

First Published:  7 Oct 2018 6:35 AM GMT
Next Story