Telugu Global
WOMEN

మహిళలు – కెరీర్‌ డిజైనర్‌లు

మహిళ కెరీర్‌ ప్రస్థానం విస్తరిస్తోంది. డిగ్రీ పట్టా సాధించడం, టెన్‌ టూ ఫైవ్‌ జాబ్‌లో సెటిల్‌ అవ్వడం... అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లి పోయింది. 'ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలిస్తాం' అంటున్నారు.

మహిళలు – కెరీర్‌ డిజైనర్‌లు
X

మహిళ కెరీర్‌ ప్రస్థానం విస్తరిస్తోంది. డిగ్రీ పట్టా సాధించడం, టెన్‌ టూ ఫైవ్‌ జాబ్‌లో సెటిల్‌ అవ్వడం... అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లి పోయింది. 'ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలిస్తాం' అంటున్నారు. పెద్ద కంపెనీల్లో ఉన్నత హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన పులికుంట కాత్యాయిని కూడా తనకంటూ కొత్త పంథాను మలుచుకున్నారు. తనకిష్టమైన కెరీర్‌ని అందంగా అద్దుకున్నారు. హైదరాబాద్‌లో తనకంటూ ఓ చిన్న క్రియేటివ్‌ కింగ్‌డమ్‌ను సృష్టించుకున్నారు.

ప్రభుత్వ సహకారం ఉంది

''చెన్నైలో ఎంబీయే చదివాను. ఐఐటీలో ఉద్యోగం చేశాను. బిర్లా ఫార్మా, జండు ఫార్మా... ఇలా పెద్ద పెద్ద కంపెనీల్లో హెచ్‌ ఆర్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశాను. హైదరాబాద్‌లో టాటా కంపెనీలోనూ చేశాను. ఇరవై ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత బాగా విసుగు వచ్చింది. క్రియేటివిటీకి ఏ మాత్రం అవకాశం ఉండని ఉద్యోగాలవి. నాకంటూ సొంత గుర్తింపు ఉండని కెరీర్‌. నాకేదో వెలితిగా ఉండేది. పిల్లలు కూడా పెద్దయ్యారు. ఇక నాకంటూ సొంతంగా నాకు నచ్చినట్లు కెరీర్‌ని మలుచుకోవాలనుకున్నాను. అంతే మహిళల కోసం ప్రభుత్వం నుంచి ఎన్ని అవకాశాలున్నాయో శోధించాను. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ద్వారా చిన్న పరిశ్రమల రంగంలో ఎన్‌రోల్‌ అయ్యాను. హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో త్రిష ట్రెండ్స్‌ పేరుతో నాకు నచ్చినట్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తున్నాను.

ఇండియా టూ యూఎస్‌

మీకు గుర్తుందా ఓ ఇరవై– ముప్పై ఏళ్ల కిందట ఎన్‌ఆర్‌ఐలు ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ల బంధువులు యూఎస్‌ నుంచి బెడ్‌షీట్‌లు తెప్పించుకునేవారు. ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్‌ చేసిన డిజైనర్‌ బెడ్‌షీట్‌లను యూఎస్‌కి పంపిస్తున్నాను. మీ ఇంటి ఫొటో ఇస్తే... కర్టెన్‌లు, బెడ్‌ షీట్‌లు, టేబుల్‌ క్లాత్, హ్యాండ్‌ టవల్స్‌ ఒకే థీమ్‌తో చేయించి ఇవ్వడం నా ప్రత్యేకత. మీ ఇంట్లో తలుపులు, సోఫా, డైనింగ్‌ టేబుల్, టీవీ, ఫ్రిజ్‌లను దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేస్తాం. అవి మీకు కస్టమైజ్‌డ్‌ అన్నమాట.

చీరలు, డ్రస్‌ల మీద డిజైన్‌లయితే మన దేశంలోని అన్ని ప్రదేశాల్లో విహరించినట్లే ఉంటుంది. కశ్మీర్‌ హ్యాండీక్రాఫ్ట్స్, మన తెలుగు కలంకారీ, ఒడిశా సంబల్‌పురి ఇకత్, మన పోచంపల్లి ఇకత్, రాజస్థానీ అజ్రక్, గుజరాతీ వర్లి ప్రింట్స్, శిల్పాల మీద చెక్కిన నగిషీల డిజైన్‌లు... ఇలా ప్రతిదీ సేకరించాను. దేశం నలుమూలలా డెవలప్‌ అయిన ఫ్యాషన్‌ డిజైన్లన్నీ నా యూనిట్‌లో కనిపిస్తాయి. అందుకే యూఎస్‌లో అంత క్రేజ్‌. నేను పరిశ్రమ నిర్వహణలో స్థిరపడిన తర్వాత మహిళాపారిశ్రామిక వేత్తల సంఘం కోవె లో సభ్యురాలినయ్యాను. మరికొంత మంది మహిళలకు ప్రభుత్వ పరమైన అనుమతులు తెచ్చుకోవడంలో సహాయం చేస్తున్నాను. ఈ కెరీర్‌లో నేను ఏం చేయాలనుకుంటే దానిని ఆచరణలో పెట్టగలుగుతున్నాను''.

– పులికుంట కాత్యాయిని,

త్రిష ట్రెండ్స్, సైనిక్‌పురి, హైదరాబాద్‌

First Published:  20 Dec 2022 3:48 AM GMT
Next Story