Telugu Global
WOMEN

అవివాహిత స్త్రీలు ... సరోగసి ప్రయోజనాన్ని ఎందుకు పొందకూడదు?కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు

సరోగసి విధానంలో బిడ్డను పొందడానికి అవివాహితలు, ఒంటరి మహిళలు ఎందుకు అర్హులు కారు? అంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చట్టబద్ధంగా సరోగసీ ద్వారా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఒంటరి, అవివాహిత స్త్రీలకు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని కోర్టు కేంద్రాన్ని కోరింది.

అవివాహిత స్త్రీలు ... సరోగసి ప్రయోజనాన్ని ఎందుకు పొందకూడదు?కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
X

సరోగసి విధానంలో బిడ్డను పొందడానికి అవివాహితలు, ఒంటరి మహిళలు ఎందుకు అర్హులు కారు? అంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చట్టబద్ధంగా సరోగసీ ద్వారా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఒంటరి, అవివాహిత స్త్రీలకు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని కోర్టు కేంద్రాన్ని కోరింది.

ఢిల్లీ హైకోర్టు ... సరోగసి పద్ధతిలో బిడ్డను పొందాలని ఆశిస్తున్న 44 సంవత్సరాల ఒంటరి అవివాహిత మహిళ కేసుని విచారిస్తున్న సమయంలో ఈ విమర్శలు చేసింది. సరోగసి చట్టంలో సెక్షన్ 2 (1) (ఎస్) ని ఆమె ఛాలెంజ్ చేస్తూ కేసు వేసింది. ఈ సెక్షన్ ప్రకారం తనవంటి ఒంటరి, అవివాహిత మహిళలు సరోగసి విధానంలో బిడ్డను పొందే అర్హత లేదు. విడాకులు పొందిన లేదా భర్త మరణించిన ఒంటరి మహిళలకు మాత్రమే తన అండాలను వినియోగించుకుని సరోగసి పద్ధతిలో పిల్లలను పొందే అవకాశం ఉంది. తన పిటీషన్లో ఆమె చట్టంలోని ఈ వివక్షని ఎత్తిచూపింది.

ఈ కేసుని విచారించిన కోర్టు ... సరోగసి (రెగ్యులేషన్) చట్టం 2021 ప్రకారం... బిడ్డకోసం సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్న స్త్రీని ... భర్తని కోల్పోయిన లేదా విడాకులు పొందిన మహిళ... అనే భావంతో మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం గురించి ప్రశ్నిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ సారధ్యంలోని ధర్మాసనం ఈ అంశంపై మాట్లాడుతూ సరోగసి విధానంలో బిడ్డను పొందేందుకు వివాహ అర్హతతో సంబంధం ఏమిటని ప్రశ్నించింది. వివాహితులైనప్పటికీ విడాకులు పొందిన లేదా భర్త మరణించిన స్త్రీలకు సైతం వైవాహిక జీవితం ఉండదు... మరి వారు అర్హులైనప్పుడు ఒంటరి, అవివాహిత స్త్రీల పట్ల వివక్ష ఎందుకని ధర్మాసనం అడిగింది. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ అంశంపై తాను మార్గనిర్దేశకాలను కోరతానని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ తరపున ఆమె కోర్టుకి హాజరయ్యారు.

ఈ కేసుని వాదించిన మహిళ తరపు న్యాయవాది... భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న స్త్రీలు తమ అండం ద్వారా మాత్రమే సరోగసి పద్ధతిని వినియోగించుకోవాలనే అంశాన్ని సైతం ఎత్తి చూపారు. తమ పిటీషనర్ గురించి చెబుతూ... ‘ఆ మహిళ వివాహం చేసుకోలేదు... ఇప్పుడు ఆమె తనకంటూ ఓ బిడ్డ కావాలని కోరుకుంటోంది. అయితే వయసురీత్యా ఆమె అండాలు బిడ్డకు జన్మనిచ్చేందుకు ఉపయోగకరంగా లేవు కనుక వైద్యుల సూచన మేరకు మరో స్త్రీ అండం ద్వారా సరోగసి పద్ధతిలో బిడ్డను పొందాలని ఆశిస్తున్నది. అయితే తన బిడ్డ జన్యుపరంగా తన కుటుంబానికి చెందినదిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె సోదరుడి స్పెర్మ్ ని సరోగసి కోసం వినియోగించుకోవాలని అనుకుంటున్నది’ అంటూ కోర్టుకి వెల్లడించారు.

తన పిటీషన్ ద్వారా అద్దెగర్భంతో సంతానం పొందడానికి అడ్డు వస్తున్న సరోగసి చట్టం 2021లోని నిబంధనలను ప్రశ్నించిన మహిళ... అండం పునరుత్పత్తికి అనువుగా ఉండటానికి, మహిళల వివాహ స్థితికి ఏ మాత్రం సంబంధం లేదని, ప్రభుత్వం పౌరుల పునరుత్పత్తికి సంబంధించిన హక్కులను నియంత్రించలేదని...కూడా తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఒంటరి, అవివాహిత స్త్రీలపై సరోగసి విషయంలో విధించిన నిబంధనలు చాలా నిర్హేతుకంగా, అన్యాయంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఇవి విరుద్ధమని, ఆర్టికల్ 14 లోని సమానత్వ హక్కుకి, ఆర్టికల్ 21 లోని జీవించే హక్కుకి ఆ నిబంధనలు ఆటంకాలుగా ఉన్నాయని పిటీషనర్ తన పిటీషన్ లో వెల్లడించారు.

సరోగసిలో బిడ్డని పొందాలంటే సదరు మహిళ వయసు 35నుండి 45 మధ్యలో ఉండాలనే నిబంధనపైన కూడా ఆమె తన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వయో పరిమితిని మెదడుతో ఆలోచించకుండా విధించారని, ఒక జంట సరోగసికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నపుడు స్త్రీ వయసు 23-50 సంవత్సరాల మధ్యలో ఉండటం సమంజసం అని కూడా ఆమె తమ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు తిరిగి అక్టోబరు 31న కోర్టు విచారణకు రానుంది.

First Published:  17 Oct 2023 3:57 PM GMT
Next Story