Telugu Global
WOMEN

గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపటం న్యాయమా? శిశువు ప్రాణమా... తల్లి అబార్షన్ హక్కా.. ఏది ముఖ్యం?

ఇరవై ఆరు వారాల వయసున్న గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపేసి అబార్షన్ చేయడమా, లేదా శిశువుని బ్రతికించి తల్లి అడుగుతున్న అబార్షన్ ని తిరస్కరించడమా... అనే మీమాంస సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఎదురైంది.

గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపటం న్యాయమా? శిశువు ప్రాణమా... తల్లి అబార్షన్ హక్కా.. ఏది ముఖ్యం?
X

గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపటం న్యాయమా? శిశువు ప్రాణమా... తల్లి అబార్షన్ హక్కా.. ఏది ముఖ్యం?

ఇరవై ఆరు వారాల వయసున్న గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపేసి అబార్షన్ చేయడమా, లేదా శిశువుని బ్రతికించి తల్లి అడుగుతున్న అబార్షన్ ని తిరస్కరించడమా... అనే మీమాంస సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఎదురైంది. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చినప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు కలిసి తల్లి అబార్షన్ హక్కుకి అనుగుణంగానే తీర్పునిచ్చారు. అయితే శిశువు ఆరోగ్యపరిస్థితి గురించిన ఎయిమ్స్ వైద్య నివేదికతో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. చివరికి... శిశువు జీవించే హక్కుని హరించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ఈ కేసుకి తుది పరిష్కారం ఇంకా లభించలేదు. తల్లి అబార్షన్ హక్కుకి, గర్భస్థ శిశువు జీవించే హక్కుకి మధ్య కేసు ఊగిసలాడుతోంది. కన్నతల్లి బిడ్డని వద్దనుకుంటే కోర్టులు కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. అనేక మలుపులు తిరిగి సోమవారానికి వాయిదా పడిన ఈ కేసు గురించిన వివరాలు.

సాధారణంగా కడుపులోని బిడ్డ వయసు 24 వారాల లోపు ఉంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావం చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ కేసు విషయంలో గర్భస్థ శిశువు వయసు 26 వారాలు కావటంతో కోర్టు అనుమతి కావాల్సివచ్చింది. ఈ కేసు ఈ నెల తొమ్మిదిన సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు విచారణకు రాగా న్యాయమూర్తులు అబార్షన్ కి అనుమతినిచ్చారు. అయితే గర్భస్థ శిశువు తొలగింపు విషయంలో స్పష్టత కోరుతూ ఎయిమ్స్ హాస్పటల్ నుండి మెయిల్ రావటంతో న్యాయమూర్తులు మరోసారి ఈ కేసువిషయమై చర్చించేందుకు ఈ నెల పదకొండున సమావేశం కావాల్సివచ్చింది. కేంద్రపభుత్వం కూడా ఈ కేసు విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా రీకాల్ అప్లికేషన్ దాఖలు చేసింది. జస్టిస్ కోహ్లి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ అప్లికేషన్ విచారణకు ఆమోదం తెలుపగా జస్టిస్ నాగరత్న దానిని తోసిపుచ్చారు.

ఎయిమ్స్ మెడికల్ బోర్డుకి చెందిన డాక్టరు కోర్టుకి పంపిన ఈమెయిల్ లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గర్భాన్ని తొలగిస్తే బిడ్డ జీవించి ఉండే అవకాశం ఉందని, అయితే ఆ బిడ్డ శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపాలా? లేదా శిశువుని ప్రాణంతోనే ఉంచి గర్భాన్ని తొలగించాలా? అని ప్రశ్నిస్తూ ఎయిమ్స్ మెయిల్ పంపింది. అయితే శిశువుని ప్రాణంతో ఉంచినా పలురకాల అనారోగ్యాలతో ఆ బిడ్డ పెరగాల్సి ఉంటుందని ఎయిమ్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ నుండి వచ్చిన మెయిల్ ని కోర్టుకి సమర్పించిన ప్రభుత్వ న్యాయవాది అడిషినల్ సొలిసిటర్ జర్నల్ ఐశ్వర్య భాటి గర్భస్థ శిశువు ప్రాణాలతో ఉండాలనే దిశగా తన ప్రయత్నాలు చేశారు.

అబార్షన్ కోరిన మహిళ తనకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని, తన ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, తాను ఈ బిడ్డకు జన్మనిస్తే ఇప్పటికే ఉన్న ఇద్దరు పిల్లలను సరిగ్గా చూసుకోలేనని, తన మానసిక స్థితి సరిగ్గా లేదని కోర్టుకి తెలపగా తొలుత న్యాయమూర్తులు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఎయిమ్స్ నివేదికతో న్యాయమూర్తుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఇద్దరు మహిళా న్యాయమూర్తులు, అబార్షన్ కోరిన తల్లి, ఎయిమ్స్ నివేదికని కోర్టుకి సమర్పించిన ప్రభుత్వ న్యాయవాది ఐశ్వర్య భాటి... ఈ నలుగురు మహిళల మానసిక భావోద్వేగాలు సైతం ఈ కేసు విషయంలో ప్రముఖ పాత్రని పోషిస్తున్నాయి.

ఎయిమ్స్ ఇచ్చిన నివేదికని ఉదహరిస్తూ జస్టిస్ హిమా కోహ్లీ ‘ఆరోగ్యంగా ఉన్న శిశువు గుండెని ఆపేయమని ఏ కోర్టు ఆదేశిస్తుంది’ అని ప్రశ్నించారు. బిడ్డ పరిస్థితిపై తమకు పూర్తి వివరాలు ఇవ్వనందుకు ఆమె ఎయిమ్స్ ని తప్పుపట్టారు. ఎయిమ్స్ సరిగ్గా వివరాలు ఇవ్వకపోవటం వలన తాము అబార్షన్ విషయంలో మహిళల హక్కుకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి తీర్పునిచ్చామని ఆమె అన్నారు. అయితే జస్టిస్ నాగరత్న మాత్రం తమ తీర్పుని పూర్తిగా సమర్ధించుకున్నారు. ఈమె 2027లో భారత ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఈ కేసు విషయంలో పిటీషినర్ నిర్ణయాన్ని కోర్టు గౌరవించాలని, కోర్టు పిటీషినర్ నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా మరొక నిర్ణయం చేయదని ఆమె అన్నారు. తాము తీర్పు ఇచ్చిన కేసుని రీకాల్ కోరుతూ ఐశ్వర్య భాటీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించడాన్ని ఆమె తప్పు పట్టారు. అయితే ఈ కేసు రీకాల్ విషయంలో ఐశ్వర్య భాటీ మొదట జస్టిస్ హిమ కోహ్లీని సంప్రదించగా ఆమె భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ని అభ్యర్థించాల్సిందిగా సూచించారు. ఆ విధంగా ఈ కేసు విషయంలో మొదటి నుండీ భాటీ... జస్టిస్ నాగరత్న తీర్పుని వ్యతిరేకిస్తూ వచ్చారు.

చివరికి తమ అభిప్రాయాల్లో ఉన్న తేడాని తెలియజేస్తూ జస్టిస్ హిమకోహ్లీ బెంచ్ ఈ అంశాన్ని జస్టిస్ చంద్రచూడ్ దృష్టికి తీసుకుని వెళ్లి, పిటీషనర్ అభ్యర్థనను పరిశీలించేందుకు మరొక బెంచ్ ని నియమించేలా చూడాలని కోరింది.

ఈ క్రమంలో శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఈ విషయంలో తాజా నివేదికని ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ ని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ సారధ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం... బిడ్డకు ఏమైనా అసాధారణమైన లక్షణాలున్నాయా, తల్లి తీసుకున్న మందుల ప్రభావం కడుపులోని బిడ్డపై ఉందా? తల్లి శారీరక మానసిక స్థితి ఎలా ఉంది? లాంటి వివరాలను ఇవ్వమని ఆదేశించింది. పిటీషనర్ కు ఇద్దరు పిల్లలుండగా రెండవ బిడ్డ వయసు సంవత్సరం. కాగా ఆమె ప్రసవం తరువాత వచ్చే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో బాధపడుతోంది.

ప్రభుత్వ న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటీ తాము పిటీషనర్ ని అబార్షన్ ఆలోచనని విరమించుకునేలా చేయలేకపోయామని బెంచ్ కి తెలిపారు. పుట్టిన బిడ్డ బాధ్యతని పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పినా ఆమె ఒప్పుకోవటం లేదన్నారు.

బుధవారం ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తగా, గురువారం సుప్రీంకోర్టు మహిళా పిటీషనర్ ను తన నిర్ణయం విషయంలో మరోసారి ఆలోచించమని కోరింది. అయితే ఆమె తన నిర్ణయంలో ఎలాంటి మార్పు చేసుకోలేదు. అబార్షన్ కేసుల విషయంలో గర్భస్థ శిశువుల హక్కులను నిర్లక్ష్యం చేయలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వఅభ్యర్థనను ఆమోదిం చడంతో మరోసారి కేసు విచారణకు ఏర్పడిన ధర్మాసనం ఇది. ఈ బెంచ్ ముందు ప్రభుత్వ న్యాయవాది ఐశ్వర్య భాటి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ .. సదరు మహిళకు కౌన్సెలింగ్ ఇప్పించాలని, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లో తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు మేలు చేసేది కాదని పేర్కొన్నారు.

ఆ మహిళ తన కడుపులోని శిశువు గుండె స్పందనని ఆపేయమంటున్నదా... అని కోర్టు ఆమె తరపు న్యాయవాది రాహుల్ శర్మని అడిగినప్పుడు ఆమె అలా కోరుకోవటం లేదని, అయితే తక్షణం తనకు అబార్షన్ చేయాలని, అందుకు ఏం చేయాలో అది చేయమని అడుగుతోందని తెలిపారు. అయితే శిశువు ప్రాణం తీయటం ఇష్టంలేకపోయినా ఇప్పటికిప్పుడు ప్రసవం చేయమని అడుగుతున్న ఆమె అభ్యర్థనని మన్నిస్తే... శిశువు లోపాలతో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ ఫలితాలను భరించేకంటే మరికొన్నివారాలపాటు వేచి ఉండటం మంచిది కదా అని కోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

First Published:  14 Oct 2023 9:33 AM GMT
Next Story