Telugu Global
WOMEN

బాలికపై అత్యాచారం కేసు... హాస్పటల్ ప్రాంగణంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నిద్ర

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ నగరంలోని ఓ హాస్పటల్ ప్రాంగణంలో నేలపైన నిద్రించారు. ఓ ప్రభుత్వ అధికారి చేత అత్యాచారానికి గురయిన బాలిక హాస్పటల్ లో ఉండగా పోలీసులు బాలికని ఆమె తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో స్వాతి ఆ పనిచేశారు. పోలీసులు గూండాయిజం చేస్తున్నారని ఆమె ఆరోపించారు

బాలికపై అత్యాచారం కేసు... హాస్పటల్ ప్రాంగణంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నిద్ర
X

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ నగరంలోని ఓ హాస్పటల్ ప్రాంగణంలో నేలపైన నిద్రించారు. ఓ ప్రభుత్వ అధికారి చేత అత్యాచారానికి గురయిన బాలిక హాస్పటల్ లో ఉండగా పోలీసులు బాలికని ఆమె తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో స్వాతి ఆ పనిచేశారు. పోలీసులు గూండాయిజం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అత్యాచారానికి గురయిన 17ఏళ్ల బాలికను ఆమె తల్లిని కలిసేందుకు తనకు ఎందుకు అనుమతినివ్వటం లేదని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని, తననుండి వారు ఏం దాచాలని చూస్తున్నారో తెలియటం లేదని స్వాతి అన్నారు.

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ చైర్ పర్సన్ ని బాలికని చూసేందుకు అనుమతించినట్టుగా తనకు తెలిసిందని, మరి తననెందుకు అనుమతించడం లేదని ఆమె ప్రశ్నించారు. బాధితురాలికి అన్నివిధాలుగా సాయం, సరైన వైద్యం అందుతున్నాయా లేదా అనేది తనకు తెలియాలని స్వాతి కోరారు.

ఓ సీనియర్ పోలీస్ అధికారి చెబుతున్న దాని ప్రకారం... ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరక్టర్ గా ఉన్న ప్రమోదయ్ ఖాఖా బాలికపై నవంబర్ 2020 నుండి జనవరి 2021 వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నిందితుడి ఇంట్లోనే ఉంటుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. బాలికకు సదరు నిందితుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆమె అతడిని మామ అని పిలుస్తుందని తెలుస్తోంది. బాలిక తండ్రి అక్టోబరు 2020లో మరణించాడు. నిందితుడి భార్య సీమారాణి బాలికకు అబార్షన్ అవడానికి పిల్స్ ని కూడా ఇచ్చిందని ఆధారాలు చెబుతున్నాయి.

జనవరి 2021లో బాలిక తన తల్లితో కలిసి తన ఇంటికి చేరింది. ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురవుతూ ప్యానిక్ అటాక్ లు వస్తుండగా తల్లి కుమార్తెని ఆగస్టు నెలలో హాస్పటల్లో చేర్చింది. తరువాత ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. బాలిక ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది. పోలీసులు ఖాఖాని అతడి భార్యని సోమవారం అరెస్టు చేశారు.

ఢిల్లీ మహిళా కమిషన్ నిందితుడి అరెస్టు తాలూకూ వివరాలతో ఎఫ్ ఐ ఆర్ కాపీని తమకు ఇవ్వాలని ఢిల్లీ పోలీస్ శాఖని కోరింది. నిందితుడిపైన ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో కూడా తెలపాలని, గతంలో ఆ అధికారిపైన వచ్చిన ఫిర్యాదులు, వాటికి పోలీసులు తీసుకున్న చర్యలను కూడా వివరించాలని, బుధవారంలోగా ఈ అంశాలపై నివేదికలు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను, నగరపాలక సంస్థను ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది.

ఇదిలా ఉండగా ఖాఖాను సస్సెండ్ చేస్తూ, ఆ ఉత్తర్వులు వెంటనే అమలు అయ్యేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిందితుడిని సస్పెండ్ చేయమని ఆదేశించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన కాలంలో నిందితుడు ముందస్తు అనుమతి లేకుండా డిపార్ట్ మెంట్ క్వార్టర్స్ ని వదిలి వెళ్లడానికి అనుమతి లేదు.

First Published:  23 Aug 2023 4:00 AM GMT
Next Story