Telugu Global
WOMEN

చెత్తని సేకరిస్తూ ... పేదరికాన్ని ఓడించారు

పనికిరానిదని బయటపారబోసే చెత్త... తమ జీవన ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆ మహిళలు కలలో కూడా ఊహించలేదు. కేరళలో చెత్తని సేకరించే స్త్రీల విజయగాథ ఇది.

చెత్తని సేకరిస్తూ ... పేదరికాన్ని ఓడించారు
X

పనికిరానిదని బయటపారబోసే చెత్త... తమ జీవన ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆ మహిళలు కలలో కూడా ఊహించలేదు. కేరళలో చెత్తని సేకరించే స్త్రీల విజయగాథ ఇది.

కేరళలోని మలప్పురంకి చెందిన దివ్య తన గ్రామం నుండి చెత్తని సేకరిస్తుంటుంది. ఆమె చెత్త సేకరించిన ఇళ్లనుండి ఛార్జిని వసూలు చేయటం ద్వారా, ఇంకా తాను సేకరించిన చెత్తని రీసైక్లింగ్ కోసం అమ్మటం ద్వారానూ నెలకు 30వేల రూపాయల వరకు సంపాదిస్తోంది. ముఖ్యంగా వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటి మహిళలకు ఎక్కువ సంపాదన తెచ్చిపెడుతున్నాయి. కేరళలోని కీఝత్తూర్ గ్రామంలో ఉన్న పన్నెండుమంది హరిత కర్మ సేన సభ్యుల్లో దివ్య ఒకరు. రాష్ట్రంలో వేలమంది మహిళలు ఇలాగే ఇళ్లనుండి చెత్తని సేకరిస్తూ, అమ్ముతూ నెలకు ముప్పయి నుండి యాభై వేల వరకు సంపాదిస్తున్నారు.

ముప్పయి సంవత్సరాల రేవతి స్కూలు టీచరుగా పనిచేసేది. ఆమె నెల సంపాదన ఐదువేలు ఉండేది. తాత్కాలిక పద్ధతిలో టీచరుగా పనిచేసే ఆమెకు రెగ్యులర్ జాబ్ అందని ద్రాక్షగా మారింది. సంవత్సరం క్రితం రేవతి తన ఉద్యోగాన్ని వదిలేసి హరిత కర్మ సేనలో చేరింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన రేవతి ప్రస్తుతం నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తోంది. త్రిష్యూర్ లోని నెన్మనిక్కారా పంచాయత్ లో రెండు వార్డులనుండి ఆమె చెత్తని సేకరిస్తుంటుంది. రేవతి దివ్యలాంటి మహిళలు సుమారు 34వేలమంది కేరళ క్లీనింగ్ ఆర్మీగా పనిచేస్తూ... అటు తాము నివసిస్తున్న రాష్ట్రంలో స్వచ్ఛతని, ఇటు తమ జీవితాల్లో సాధికారతను సాధిస్తున్నారు.

స్థానిక స్వపరిపాలనా సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే ఈ మహిళలు ఇంటింటికీ వెళ్లి చెత్తని సేకరిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2015 ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలు వేస్ట్ మేనేజ్ మెంట్ నిర్వహణ పనులను చేయాల్సి ఉంటుంది. ఈ సంస్థల ఆధ్వర్యంలో హరిత కర్మ సేన స్త్రీలు చెత్త సేకరణ చేస్తున్నారు. కేరళలో చెత్త సేకరణకు ఇంటికి యాభై రూపాయలు, వ్యాపార సంస్థలకు నూరు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు వ్యర్థాల నిర్వహణని రాష్ట్రంలో పేదరిక నిర్మూలన మిషన్ లో భాగం చేసామని పేదరిక నిర్మూలనలో అదే పెద్ద పాత్రని పోషిస్తున్నదని కేరళ స్థానిక స్వపరిపాలనా శాఖా మంత్రి ఎమ్ బి రాజేష్ అంటున్నారు. ఈ మహిళలు చెత్తని సేకరించే శ్రామికులు మాత్రమే కాదని, వ్యర్థ పదార్థాల నిర్వహణలో పారిశ్రామిక వేత్తలని చెబుతున్నారాయన.

స్థిరమైన ఆదాయం రావటం వలన ఈ మహిళల జీవితాలు మెరుగయ్యాయి. వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏర్పడింది. స్థానిక స్వపరి పాలనా సంస్థలు చెత్తని సేకరించే మహిళలకు డ్రైవింగ్ లైసెన్సు అందేలా చేస్తున్నాయి. చెత్తని సేకరించే వాహనాలను స్థానిక సంస్థలు కొంటున్నాయి.

చెత్త సేకరణ, దానిని విడగొట్టి రీ సైక్లింగ్ కి పంపే విషయంలో హరిత కర్మ సేన సభ్యుల మధ్య పోటీ ఉంటుందని, ఎవరు ఎక్కువ సేకరిస్తే వారు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని కీఝత్తూర్ పంచాయితీ సెక్రటరీ ఎస్ రాజేష్ కుమార్ తెలిపారు. ఇదే ఊరుకి చెందిన తొప్పిల్ విజయ తనకు దొరికిన ఈ అవకాశంతో తన సొంతింటి కల నిజమైందని తెలిపింది. ఈమెకు మొదట నెలకు మూడువేల రూపాయల ఆదాయం వస్తుండగా ప్రస్తుతం 28 వేల వరకు తన సంపాదన ఉంది. తమ పనిని వారు చెత్త సేకరణగా కాకుండా వ్యాపారంగా భావిస్తున్నారు. ఈ పనిలో భాగంగా తాము భిన్న రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుస్తున్నామని దాంతో తమ సామాజిక జీవితంలో కూడా మంచి మార్పులు వస్తున్నాయని ఈ మహిళలు చెబుతున్నారు.


సేన ఎలా పనిచేస్తుంది....

మొత్తం 34,851 మంది సభ్యులు 1,034 స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. వీరు నెలకు 50వేల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంది. అయితే నెలకు పది లేదా పదిహేను రోజులపాటు మాత్రమే పనిచేస్తే వారి సంపాదన నెలకు నాలుగు వేలకు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఇద్దరు మహిళలు వంతుల వారీగా తమ ప్రాంతంలో చెత్తని సేకరిస్తుంటారు. 750 ఇళ్లనుండి చెత్తని సేకరించి నూరుశాతం డబ్బు వసూలయితే ఒక్కొక్కరికి 37,500 రూ.లు నెలవారీ ఆదాయంగా లభిస్తుంది. ఇదే కాకుండా వారు సేకరించిన చెత్త ద్వారా వచ్చే పలురకాల సామగ్రిని అమ్మటం వలన కూడా సంపాదన ఉంటుంది. నెలలో మొదటి మూడు వారాల్లో వీరు తమకు రావాల్సిన డబ్బుని వసూలు చేస్తుంటారు. చెత్తని సేకరించే ఇళ్ల వద్ద కనిపించే క్యూ ఆర్ కోడ్ ని వీరు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా వినియోగించడం వలన స్థానిక సంస్థల అధికారులు... మహిళలు కవర్ చేసే ఇళ్లు, వారు వసూలు చేసే డబ్బు తాలూకూ వివరాలను పర్యవేక్షిస్తుంటారు.

First Published:  8 Nov 2023 1:30 AM GMT
Next Story