Telugu Global
WOMEN

అంబానీలకంటే పెద్ద ఇల్లు ఆమెది..

భారతదేశంలోనే ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఎవరిది అంటే .... వెంటనే మనకు ముఖేష్ అంబానీ గుర్తొస్తాడు కదా.. నిజమే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇల్లు యాంటిలియా దేశంలోకెల్లా ఖరీదైనదే. అయితే అంబానీల ఇంటికంటే విశాలమైన ఇల్లు గుజరాత్ లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయివేట్ నివాసాల్లో ఒకటి.

అంబానీలకంటే పెద్ద ఇల్లు ఆమెది..
X

భారతదేశంలోనే ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఎవరిది అంటే .... వెంటనే మనకు ముఖేష్ అంబానీ గుర్తొస్తాడు కదా.. నిజమే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇల్లు యాంటిలియా దేశంలోకెల్లా ఖరీదైనదే. అయితే అంబానీల ఇంటికంటే విశాలమైన ఇల్లు గుజరాత్ లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయివేట్ నివాసాల్లో ఒకటి. బరోడాకు చెందిన గైక్వాడ్ లు దీని యజమానులు. గైక్వాడ్ లు ఒకప్పుడు బరోడాని పాలించారు. బరోడాకు ఇప్పటి పేరు వడోదర. స్థానిక ప్రజలు ఇప్పటికీ రాజకుటుంబాన్ని ఎంతో గౌరవిస్తుంటారు. ప్రస్తుతతరంలో హెచ్ ఆర్ హెచ్ సమర్జిత్ గైక్వాడ్ ఆ కుటుంబ యజమాని. ఈయన మాజీ క్రికెటర్. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం క్రికెట్ లో అడ్మినిస్ట్రేటర్ హోదాలో ఉన్నారు. సమర్జిత్ సింగ్ గైక్వాడ్ భార్య రాధికా రాజే గైక్వాడ్. లక్ష్మీవిలాస్ ప్యాలెస్, ఇంకా దాని యజమానురాలు రాధికా రాజె గైక్వాడ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు...


ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. అయితే లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే ముఖేష్ నివాసం విస్తీర్ణంలో మాత్రం చిన్నదే. విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ని 1890లో మహారాజా సయాజీరావు గైక్వాడ్ నిర్మించారు. ఇది 3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే 500 ఎకరాలు. ఇందులో మొత్తం 176 గదులున్నాయి. ఈ భవనం లండన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. దీని నిర్మాణానికి 12 ఏళ్ల కాలం పట్టింది. అప్పట్లో దీనిని కట్టడానికి 1,80,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు ఖర్చయింది. ఈ ప్యాలస్ లో గోల్ఫ్ కోర్సు సైతం ఉంది. ప్రపంచంలోనే అత్యధికస్థాయిలో అద్దాలతో నిర్మితమైన భవనంగా కూడా దీనికి గుర్తింపు ఉంది. ఇందులో మహారాజా ఫతేసింగ్ మ్యూజియం కూడా ఉంది. రాజు... భవనంలో ఉన్నపుడు ఎరుపు రంగు లైట్ వెలుగుతూ ఉండే ఆచారం తొలిరోజుతో మొదలై ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ ప్యాలెస్ ని టూరిస్టులు రూ.150 ఎంట్రీ ఫీజుతో సందర్శించే అవకాశం ఉంది. మ్యూజియం కూడా చూడాలంటే అదనంగా రూ.60రూ. చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈ ఇంటి యజమానురాలు రాధికా గైక్వాడ్ గురించి...

ఈమె 1978 జులై 19న జన్మించారు. గుజరాత్ లోని వాంకనెర్ ప్రాంతపు రాజకుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి పేరు డాక్టర్ ఎమ్ కె రంజిత్ సింగ్ ఝాలా. ఈయన ఐఎఎస్ అధికారి అవడానికి తన రాజరికపు గుర్తింపుని వదిలేశారు.

రాధికకు చదవటం, రచనలు చేయటం చాలా ఇష్టం. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజిలో ఇండియన్ హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. సమర్జిత్ సింగ్ ని వివాహం చేసుకోకముందు రాధిక కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. 2002లో ఆమె వివాహం జరిగింది. ఫోర్బ్ మేగజైన్ రాధిక రాజేని భారత రాజవంశ స్త్రీలలోకెల్లా సౌందర్యవతిగా పేర్కొంది. రాజకుటుంబంలో జన్మించినా తన జీవితంలో కూడా ఒత్తిళ్లు సమస్యలున్నాయని ఆమె ఓ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపినట్టుగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే స్టోరీ టెల్లింగ్ వేదిక పేర్కొంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో తన తండ్రికి అక్కడకు పోస్టింగ్ ఇచ్చారని, తాము భోపాల్ కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉన్నా తన తండ్రి ప్రజలను అక్కడినుండి తరలించే విషయంలో ధైర్యంగా పనిచేశారని ఆమె తెలిపారు.


ఆమె పేర్కొన్న మరిన్ని వివరాలివి... ‘మా తల్లి మమ్మల్ని ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేలా పెంచారు. స్కూలుకి కూడా నేను పబ్లిక్ బసుల్లో వెళ్లేదాన్ని. పెళ్లితరువాత నా భర్త కూడా నా వ్యక్తిత్వాన్ని నిర్ణయాలను గౌరవించారు. వివాహం తరువాత నా మనసుకి నచ్చిన పని ఏమిటనేది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. మా ప్యాలెస్ గోడలకు రవివర్మ గీసిన చిత్రాలు ఉండేవి. ఆ పెయింటింగుల్లోని వస్త్రాల స్ఫూర్తితో అలాంటి వాటిని ఇప్పుడు ఎందుకు తయారుచేయకూడదు... అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనని ఆచరణలోకి తెచ్చాను. నేను మా అత్తగారు కలిసి స్థానిక నేతపనివారితో ఆ తరహా వస్త్రాల రూపకల్పన చేశాము. మేము కూడా వారితో పాటు కలిసి పనిచేశాం. మేము తయారుచేసిన చీరలు ఎగ్జిబిషన్లలో బాగా అమ్ముడుపోయాయి ’ అంటూ తన పోస్టులో తెలిపారామె.

రాధిక ఎప్పుడూ రాజరికపు అంతస్తుల్లో జీవించాలని అనుకోలేదు. కరోనా సమయంలో ఆమె తన సోదరితో కలిసి గ్రామాలకు వెళ్లి అక్కడ పనులు కోల్పోయిన చేతివృత్తుల వారికి అండగా నిలిచారు. 700 కుటుంబాలను ఆదుకున్నామని ఆమె తెలిపారు. ప్రజలు తమని రాణులుగా మేలిముసుగుల్లో ఉంటారని ఊహించినా తనకు అలా ఉండటం ఇష్టం లేదంటారామె. తాను పాత సంప్రదాయాల సంకెళ్లను తెంచుకుని తనదైన పరిధులను ఏర్పరచుకున్నట్టుగా రాధిక చెబుతుంటారు. తన కూతుళ్లకు కూడా ఆమె అదే చెబుతుంటారట. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని మనసుకి నచ్చినట్టు జీవించేలా తన కూతుళ్లను ప్రోత్సహిస్తున్నానని, ఈ విషయంలో పశ్చాత్తాపం వద్దని వారికి చెబుతుంటానని రాధిక గైక్వాడ్ అంటున్నారు. ప్రస్తుతం ఆమె ప్యాలెస్ లోని విలువైన ఆస్తులను డిజిటలైజ్ చేసే పనిలో ఉన్నారు.

First Published:  20 Oct 2023 8:40 AM GMT
Next Story