Telugu Global
WOMEN

చూపులేని మహిళలు... స్పర్శతో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు

రితికా మౌర్య చూపులేని యువతి. కానీ ఆమె తోటి స్త్రీలకు ఆరోగ్యపరంగా అండగా నిలిచే కెరీర్ లో ఉంది.

చూపులేని మహిళలు... స్పర్శతో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు
X

చూపులేని మహిళలు... స్పర్శతో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు

రితికా మౌర్య చూపులేని యువతి. కానీ ఆమె తోటి స్త్రీలకు ఆరోగ్యపరంగా అండగా నిలిచే కెరీర్ లో ఉంది. 23 ఏళ్ల రితిక మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ అనే కోర్సులో శిక్షణ పొందింది. బెంగళూరులో ఉన్న దివ్యాంగుల హక్కులకు సంబంధించిన సంస్థ ఎనేబుల్ ఇండియా అంథులైన స్త్రీలకు మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ కోర్సులో భాగంగా రొమ్ము క్యాన్సర్ ని చేతి స్పర్శతో పరీక్షించడంలో శిక్షణనిస్తోంది. దీంతో అంధులైన అమ్మాయిలు తమ స్పర్శతో ఇతర స్త్రీల రొమ్ముల్లో గడ్డలు గాని, మార్పులు కానీ ఉన్నాయా...అనేది పరిశీలించగలుగుతున్నారు.

రితికా మౌర్య తన వృత్తిని ఎంతో ఇష్టంతో చేస్తోంది. పరీక్ష కోసం వచ్చిన మహిళల చేతులు పట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. క్యాన్సర్ భయంతో తనవద్దకు వచ్చే మహిళలకు ధైర్యం చెప్పి వాళ్ల ఆందోళనని తగ్గిస్తుంది. తమకు చూపు లేకపోవటం వలన వారు మరింత సౌకర్యవంతంగా తమచేత పరీక్షలు చేయించుకుంటున్నారని ఆమె తెలిపింది.

అంధులకు ఈ తరహా శిక్షణనిచ్చే ఈ కార్యక్రమాన్ని జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ హాఫ్ మాన్ ప్రారంభించారు. ‘ డిస్కవరింగ్ హ్యాండ్స్ ’ పేరుతో మొదలైన ఈ ప్రోగ్రామ్ 2017 లో భారతదేశానికి వచ్చింది. తరువాత దీనిని కొలంబియా, మెక్సికో, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లలో కూడా ప్రారంభించారు. ఈ విధుల్లో ఉన్న మహిళలకు బ్రెయిలీ లిపితో అంకెలు ఉన్న టేప్ లను ఇస్తున్నారు. వాటి సహాయంతో పరీక్షకు వచ్చిన స్త్రీల బ్రెస్ట్ లో ప్రతి సెంటీమీటరు భాగాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఈ పరీక్షకు ముప్పయి నుండి నలభై నిముషాల సమయం పడుతుంది. తరువాత వీరు తమ పరిశీలన వివరాలను వైద్యులకు అందజేస్తారు. వైద్యులు ఆపైన చేయాల్సిన పరీక్షలను నిర్ణయిస్తారు.

మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ లు ఆరు నుండి ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న గడ్డలను సైతం గుర్తిస్తారని హాఫ్ మాన్ తెలిపారు. వైద్యులు ఎంత కచ్ఛితంగా బ్రెస్ట్ లోని గడ్డలను గుర్తించగలుగుతున్నారో అంత కచ్ఛితంగానూ వీరు కూడా వాటిని గుర్తిస్తున్నారని తెలుస్తోంది. 2017నుండి 18మంది అంధులైన అమ్మాయిలు మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ లుగా బెంగళూరు, ఢిల్లీలనుండి శిక్షణ పొందగా వారిలో ఆరుగురు క్యాన్సర్ హాస్పటల్స్ లో పనిచేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణంగా ఎక్కువగా నిర్దారితమవుతున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. మహిళల్లో క్యాన్సర్ మరణాల్లో ఎక్కువశాతం ఈ వ్యాధి వల్లనే జరుగుతున్నాయి. 60శాతం కేసులు మూడవ లేదా నాల్గవ దశలో బయటపడటం వలన కూడా మరణాలు పెరుగుతున్నాయి. మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ ల వలన ఈ పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. వీరు పట్టణాలు, గ్రామాల్లో మహిళలు పనిచేసే ప్రదేశాలకు వెళ్లి రొమ్ము క్యాన్సర్ ని తొలిదశలో గ్రహించే పరీక్షలు చేస్తున్నారు. మమ్మోగ్రామ్, అల్ట్రా సౌండ్ మిషన్లు వెళ్లలేని ప్రదేశాలకు ఎమ్ టి ఇ లు వెళ్లగలగటం వలన క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో మరింత ప్రయోజనం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

ఇంతకుముందు తనకు ఎలాంటి నైపుణ్యాలు లేవనే బాధ ఉండేదని కానీ ఇప్పుడది లేదని రితిక మౌర్య అంటోంది. తను తీసుకున్న శిక్షణ వలన తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ తనలో ఒక ప్రత్యేకత ఉన్నదనే ధైర్యం ఆత్మవిశ్వాసం కలుగుతున్నాయని ఆమె చెబుతోంది. గత ఏడాది మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ శిక్షణ తీసుకున్న అంధులైన యువతులు బెంగళూరుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొట్టికల్లు ఫాల్స్ కి ట్రెక్కింగ్ చేశారు. ఎనేబుల్ ఇండియా వారికి తెల్లని కర్రని ఇవ్వటంతో పాటు తమకుతాముగా బయట తిరిగే శిక్షణను సైతం ఇస్తోంది. రితిక తను శిక్షణ తీసుకుంటున్న స్వచ్ఛంద సంస్థనుండి తను నివాసం ఉంటున్న ప్రదేశానికి ఎవరి సహాయం లేకుండా వెళ్లగలుగుతోంది. తనని తాను నిరూపించుకోవాలనే ఆమె కోరిక తీరటంతో పాటు ఆమె నిర్వర్తిస్తున్న విధులతో ఎంతోమందికి ఆరోగ్యపరమైన లాభం చేకూరటం ఎంతో హర్షించదగిన విషయం.

First Published:  9 Jun 2023 11:42 AM GMT
Next Story