Telugu Global
WOMEN

సర్జరీల్లో మగవైద్యుల కంటే మహిళా డాక్టర్లే భేష్

రిస్క్ తో కూడిన సర్జరీలను స్త్రీలే సమర్థ‌వంతంగా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మనదేశంలో గణాంకాల సేకరణ సాధ్యం కాకపోవటం వలన ఇలాంటి అధ్యయనాలను ఇక్కడ నిర్వహించలేకపోతున్నారు.

సర్జరీల్లో మగవైద్యుల కంటే మహిళా డాక్టర్లే భేష్
X

శస్త్రచికిత్సల విషయంలో పురుష వైద్యులకంటే మహిళా వైద్యులే మరింత సమర్థులని, వారే ఎక్కువ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని రెండు ప్రపంచ స్థాయి అధ్యయనాల్లో వెల్లడైంది. అమెరికా, కెనడాల్లో ఒక అధ్యయనాన్ని, స్వీడన్ లో మరొక అధ్యయనాన్ని నిర్వహించారు. అమెరికా, కెనడాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు 2007 నుంచి 2019 వరకు ఒంటారియాలో సాధారణ ఆపరేషన్లు చేయించుకున్న పది లక్షల మందిని ప్రశ్నించి సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. మహిళా సర్జన్ల చేత ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఆపరేషన్ లో సమస్యలు తలెత్తటం, తిరిగి హాస్పటల్ లో చేరాల్సి రావటం, మరణం బారిన పడటం.. లాంటివి తక్కువగా సంభవించినట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురిస్తున్న జామా నెట్ వర్క్ జర్నల్ లో ఈ వివరాలను ప్రచురించారు.

స్వీడన్ లో నిర్వహించిన అధ్యయనంలో 13 ఏళ్లపాటు జరిగిన గాల్ బ్లాడ్ తొలగింపు ఆపరేషన్ల ఫలితాలను పరిశీలించారు. తమ తోటి పురుష సర్జన్లతో పోల్చినపుడు మహిళా సర్జన్లు మంచి ఫలితాలను సాధించినట్టుగా ఈ అధ్యయనంలో కూడా తేలింది. ఇంతకుముందు జపాన్ లో నిర్వహించిన అధ్యయనంలోనూ దాదాపు ఇదేవిషయం వెల్లడైంది. స్త్రీ పురుష వైద్యులు నిర్వహించిన సర్జరీల్లో సమస్యలు, మరణాల విషయంలో తేడా కనిపించలేదని, అయితే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి మహిళా సర్జన్లే ఎక్కువగా చికిత్ప చేస్తున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. దీనిని బట్టి రిస్క్ తో కూడిన సర్జరీలను స్త్రీలే సమర్థ‌వంతంగా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మనదేశంలో గణాంకాల సేకరణ సాధ్యం కాకపోవటం వలన ఇలాంటి అధ్యయనాలను ఇక్కడ నిర్వహించలేకపోతున్నారు. అయితే మనదేశంలో కొత్తగా వైద్యరంగంలోకి వస్తున్న అమ్మాయిలు సర్జరీ ని ఎంపిక చేసుకుంటున్నారని మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారు చెబుతున్నారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది..

వైద్య రంగంలోకి వస్తున్న స్త్రీల సంఖ్య పెరుగుతున్నా శస్త్ర చికిత్సా రంగంలో మాత్రం వారి సంఖ్య తక్కువగానే ఉంది. సెప్టెంబర్ 2022 న ప్రచురితమైన ఇండియన్ జర్నల్.. కొలోరెక్టల్ సర్జరీ అందిస్తున్న వివరాల ప్రకారం అమెరికాలో 1855లోనే మొట్టమొదటి మహిళా సర్జన్ ఈ రంగంలోకి వచ్చినా.. ఇప్పటికీ అక్కడ ఉన్న మహిళా సర్జర్లు 22శాతం మాత్రమే. ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలో మొత్తం సభ్యుల సంఖ్య 32,000 కాగా అందులో మహిళల సంఖ్య 4,160. అంటే 12.5శాతం. అయితే గత ఐదేళ్ల కాలంలో మహిళా సర్జన్ల సంఖ్య రెట్టింపు అయ్యిందని ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, భోపాల్ లోని గాంధీ మెడికల్ కాలేజిలో సర్జరీ ప్రొఫెసర్ అయిన సంజయ్ జైన్ అన్నారు.

ఆటంకాలున్నా...

మహిళా సర్జన్లు ఎంతగా తమ ప్రతిభని చాటుతున్నా వారు గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యం, కాస్మొటాలజీ, దంతవైద్యం, డెర్మటాలజీల్లోనే ఎక్కువగా పనిచేస్తున్నారు. కార్డియో, న్యూరో, క్యాన్సర్, ట్రాన్స్ ప్లాంట్ రంగాల్లో మహిళా సర్జన్లు చాలా తక్కువగా కనబడుతున్నారు. మగవైద్యులే క్లిష్టమైన ఆపరేషన్లు చేయగలరనే సామాజిక అభిప్రాయం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. అంతేకాకుండా.. శస్త్రచికిత్సని ఎంపిక చేసుకుంటే ఎక్కువ పనిగంటలు పనిచేయాల్సి రావటం, ఉద్యోగపరమైన ఒత్తిడి అధికంగా ఉండటం, తోటి మగ వైద్యుల వ్యతిరేకత, కుటుంబ బాధ్యతలకు సమయం ఇవ్వలేకపోవటం లాంటి సమస్యలు.. మహిళలకు ఆటంకాలుగా మారుతున్నాయి. అయినా సరే స్త్రీలు ఈ రంగంలో నిలదొక్కుకుని రాణించడానికి శ్రమించడం, మగ సర్జన్ల కంటే సమర్థులని పేరు తెచ్చుకోవటం అభినందించాల్సిన విషయం.

*

First Published:  5 Sep 2023 1:48 AM GMT
Next Story