Telugu Global
WOMEN

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా... ప్రసూతి ప్రయోజనాలు అందాలి

గత కొన్నేళ్లుగా దేశంలోని వివిధ కోర్టులు ప్రసూతి సెలవు, దానితాలూకూ ప్రయోజనాలు అన్నింటినీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే మహిళలకు కూడా వర్తింపచేయాలని పలు తీర్పుల్లో నొక్కి చెబుతున్నాయి.

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా... ప్రసూతి ప్రయోజనాలు అందాలి
X

గత కొన్నేళ్లుగా దేశంలోని వివిధ కోర్టులు ప్రసూతి సెలవు, దానితాలూకూ ప్రయోజనాలు అన్నింటినీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే మహిళలకు కూడా వర్తింపచేయాలని పలు తీర్పుల్లో నొక్కి చెబుతున్నాయి. మన దేశంలో మొత్తం గ్రాడ్యుయేట్స్ లో 45 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే వారిలో పదిశాతం మంది మాత్రమే దీర్ఘకాలిక ఉద్యోగాలు చేస్తున్నారు. అంతర్జాతీయ శ్రామిక సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ పురుషుల సంఖ్యలో 50.9శాతం తేడా ఉంది.

మనదేశంలో శ్రామిక శక్తిలో 71శాతం మంది మగవారు ఉండగా 19.2 శాతం మంది మహిళలు ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఎక్కువ మంది ప్రసవ సమయంలో ఉద్యోగాలను వదిలేస్తున్నారు. వారికి ప్రసూతి సెలవు ఇతర సదుపాయాలు లేకపోవటమే ఇందుకు కారణం. మనదేశంలో 70 నుండి 80శాతం వరకు కుటుంబ సంరక్షణ బాధ్యతలను స్త్రీలు నిర్వహిస్తుండగా అంతే శాతం మంది మగవారు దేశ శ్రామిక శక్తిలో ఉన్నారు.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టులు... ఏ తరహా ఉద్యోగంలో ఉన్నా ... స్త్రీలకు ప్రసవ సంబంధమైన ప్రయోజనాలు అందాలని తీర్పులు ఇస్తున్నాయి.

తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మరొక ఉత్తర్వుల్లో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ప్రసవ సంబంధమైన సదుపాయాలు మహిళకు ఇచ్చే గుర్తింపు, గౌరవంలో భాగాలని, అవి ఆమెకు ఇచ్చి తీరాలని కోర్టు తెలిపింది. బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్న స్త్రీలందరినీ ప్రకృతి ఒకేరకంగా చూస్తుందని, అందులో వివక్ష ఉండదని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తనకు మెటర్నిటీ లీవ్ ఇచ్చేందుకు తిరస్కరించగా ఓ మహిళా న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె రెగ్యులర్ ఉద్యోగిని కాకపోవటంతో మెటర్నిటీ సెలవు మంజూరు కాలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా తాత్కాలిక పద్ధతుల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ప్రసూతి సెలవులు ఇచ్చి తీరాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆమె లీవుకి అర్హురాలు కాదని వాదించగా కోర్టు ఆ వాదనని తిరస్కరించింది. ఆమె అసాధారణమైనది, అనుచితమైనదేమీ అడగటం లేదని మహిళలకున్న ప్రసవ సంబంధమైన హక్కులను కాదనటం అంటే వారికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను తిరస్కరించడమే అవుతుందని కోర్టు తెలిపింది.

ఇండియన్ మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 1961 ప్రకారం మహిళలు తమ మొదటి రెండవ బిడ్డలకు జన్మనిచ్చిన సందర్భంలో ఆరునెలలు లేదా 26 వారాలపాటు వేతనంతో కూడిన సెలవు పొందడానికి అర్హులు. ఈ విషయంలో ఎలాంటి వివక్షని చూపకూడదు. 2017లో పార్లమెంటులో ఆమోదం పొందిన మెటర్నిటీ బెనిఫిట్ సవరణ బిల్లు ప్రకారం అంతకుముందున్న 12 వారాల సెలవుని 26వారాలకు పెంచారు.

ప్రసూతి సెలవులో ఉన్నపుడు ఉద్యోగిని ఉద్యోగ ఒప్పంద గడుపు ముగిసినా కూడా ఆమెకు ప్రసూతి ప్రయోజనాలు అందాలని గతవారం ఓ వైద్యురాలి విషయంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రసూతి సెలవులో ఉండగా ఆమె కాంట్రాక్ట్ ఒప్పందం ముగిసిపోవటంతో ఆమెకు రావాల్సిన మేటర్నిటీ బెనిఫిట్స్ ని ఆమె పనిచేస్తున్న సంస్ధ నిలిపి వేయగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. రెండేళ్లక్రితం ఇలాగే కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న మహిళ ప్రసూతి సెలవుని కోరగా ఆమెని ఉద్యోగం నుండి తొలగించిన సందర్భంలో కర్ణాటక ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది.

ఇరవై శాతం కంటే తక్కువ మంది మహిళలు వేతనంతో కూడిన పనుల్లో ఉన్నారని, దేశంలో మహిళా శ్రామిక శక్తి రానురాను తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు... ఉద్యోగాలను కల్పించే యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలు, సంక్షేమ సంస్థలతో కలిసి పనిచేసి స్త్రీలు పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని చైల్డ్ కేర్ సదుపాయం, ప్రసవం తరువాత తిరిగి ఉద్యోగంలో చేరేలా స్త్రీలకు కౌన్సెలింగ్ వంటివి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  27 Aug 2023 1:30 AM GMT
Next Story