Telugu Global
WOMEN

మహిళా ఖైదీల ఉపాధి కోసం పెట్రోలు బంకులు

దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా మహిళా ఖైదీలే నిర్వహించే పెట్రోల్ బంక్ ని చెన్నైలో ప్రారంభించారు.

మహిళా ఖైదీల ఉపాధి కోసం పెట్రోలు బంకులు
X

దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా మహిళా ఖైదీలే నిర్వహించే పెట్రోల్ బంక్ ని చెన్నైలో ప్రారంభించారు. జైల్లో శిక్షని అనుభవిస్తున్న మహిళా ఖైదీలు నిర్వహించే ఈ రిటైల్ ఔట్ లెట్ ని ఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ అని పిలుస్తున్నారు. చెన్నైలోని పుజల్ ప్రాంతంలోని అంబట్టూర్ రోడ్డులో ఉన్న మహిళల ప్రత్యేక జైలుకి సమీపంలో దీనిని ప్రారంభించారు.

ఈ పెట్రోలు బంకులో 30మంది మహిళా ఖైదీలు ఉద్యోగులుగా పనిచేస్తారు. వీరికి నెలకు ఆరువేల రూపాయలను వేతనంగా ఇస్తారు. పుజల్ మహిళల ప్రత్యేక జైల్లో శిక్షని అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు ఇది పునరావాసంగా పనిచేస్తుందని, వారు తిరిగి సమాజంతో కలిసి నడిచేందుకు, చెడుని వదిలి మంచిగా మారేందుకు దోహదం చేస్తుందని జైళ్లు, కరెక్షనల్ సర్వీసుల డిజీపి అమరేష్ పూజారి తెలిపారు. మహిళా ఖైదీలు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ పెట్రోలు బంకులో పనిచేయటం వలన వారు విడుదల అయిన తరువాత ఉపాధి పొందటం తేలికవుతుందని ఆయన అన్నారు. వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయని, వారు తాము పొందే వేతనాన్ని తమ కుటుంబాలకోసం ఖర్చు చేసుకోవచ్చని, లేదా భవిష్యత్తుకోసం దాచుకోవచ్చని అమరేష్ తెలిపారు.

మహిళా ఖైదీలు ఈ ఉద్యోగం వలన ఒంటరిగా ఉండటం తగ్గి సమాజంలో నలుగురితో కలిసిమెలసి ఉంటారని, వారి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుందని, ఉద్యోగానికి అర్హత సాధించాలనే లక్ష్యంతో కూడా మంచి ప్రవర్తనతో ఉంటారని జైళ్ల అధికారులు భావిస్తున్నారు. తమిళనాడు జైళ్ల శాఖ ఇప్పటికే సంస్కరణలు, పునరావాసంలో భాగంగా ప్రిజన్ బజార్ ని నిర్వహిస్తోంది. ఇక్కడ ఖైదీలు తయారుచేసిన షూలు, రెయిన్ కోట్లు, రెడీమేడ్ దుస్తులు, హస్తకళల ద్వారా రూపొందిన కళాకృతులు, నోట్ పుస్తకాలు, కంపోస్టు ఎరువు, బేకరీ ఉత్పత్తులు, వారు పండించిన కూరగాయలు వంటివాటిని ఫ్రీడం అనే బ్రాండ్ పేరుతో అమ్ముతున్నారు.

తమిళనాడులో జైళ్లశాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కలిసి మరికొన్ని ఇలాంటి పెట్రోల్ బంకులను ప్రారంభించి నిర్వహిస్తున్నాయి. అవన్నీ ఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ అనే పేరుతో బాగా నడుస్తున్నాయి. అయితే దేశంలోనే పూర్తిగా మహిళా ఖైదీల నిర్వహణలో నడిచే మొట్టమొదటి పెట్రోలు బంకు మాత్రం ఇదేనని తెలుస్తోంది.

First Published:  13 Aug 2023 3:05 PM GMT
Next Story