Telugu Global
WOMEN

ద్రవిడ పాలన... ఆలయ అర్చకులుగా స్త్రీలు

తమిళనాడులో దేవాలయాల్లో మగవారితో సమానంగా మహిళలను సైతం అర్చకులుగా నియమించడంలో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కె స్టాలిన్ ఈ మేరకు ప్రకటన చేశారు.

ద్రవిడ పాలన... ఆలయ అర్చకులుగా స్త్రీలు
X

 ద్రవిడ పాలన... ఆలయ అర్చకులుగా స్త్రీలు

తమిళనాడులో దేవాలయాల్లో మగవారితో సమానంగా మహిళలను సైతం అర్చకులుగా నియమించడంలో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కె స్టాలిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మహిళలు పైలట్లుగా, వ్యోమగాములుగా విజయాలు సాధిస్తున్నా వారు అర్చకులుగా పనిచేయకూడదనే నిషేధం సరికాదని, స్త్రీ దేవతల ఆలయాల్లో సైతం వారు పనిచేయటం అపవిత్రమని భావిస్తున్నారని, ద్రవిడ పాలనా విధానంలో ఈ వివక్ష సాగదని స్టాలిన్ అన్నారు. మహిళలు ఆలయాల్లో పూజారులుగా పనిచేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని, చివరికి మార్పు మొదలైందని ఆయన అన్నారు.

తమిళనాడులో ద్రవిడపాలనలో భాగంగా సంఘ సంస్కర్త తంథై పెరియార్ మనసుని ముల్లులా బాధించిన ఈ అంశాన్ని పరిష్కరించామని, గుళ్లలో అన్ని కులాల వారిని, స్త్రీలను అర్చకులుగా నియమిస్తున్నామని, స్త్రీలు గర్భగుడిలోకి ప్రవేశించి సమగ్రత, సమానత్వాలు మేళవించిన నూతన శకానికి నాంది పలుకుతున్నారని స్టాలిన్ అన్నారు. రాష్టప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం నిర్వహిస్తున్న అర్చకార్ శిక్షణా సంస్థలో అర్చకులు కాదలచుకున్న ఇతర కులాల వ్యక్తులకు, మహిళలకు శిక్షణనిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి సంస్థలను ఆరింటిని నడుపుతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రీరంగంలోని శిక్షణా సంస్థలో ముగ్గురు మహిళలు తమ శిక్షణని పూర్తి చేసుకున్నారు. వారి పేర్లు కృష్ణవేణి, ఎస్. రమ్య, ఎన్. రంజిత. వీరిలో కృష్ణవేణి లెక్కల్లో గ్రాడ్యుయేషన్ చేయగా రమ్య ఎమ్ ఎస్ సి, రంజిత బిఎస్ సి చదువుకున్నారు. రమ్య తనకు శిక్షణ మొదట్లో కష్టంగా అనిపించినట్టుగా చెప్పింది. కృష్ణవేణి దైవ సేవ చేయాలని ఇందులో చేరినట్టుగా తెలిపింది. వీరిద్దరు బంధువులవుతారు. కుటుంబ సభ్యులు వీరిని ప్రోత్సహించారు. రంజిత తన ఆసక్తితోనే ఇందులో చేరింది. ఈ ముగ్గురు సంవత్సరం పాటు శిక్షణ తీసుకుని కోర్పుని పూర్తి చేసి ప్రభుత్వం నుండి సర్టిఫికేట్లు అందుకున్నారు. శిక్షణా కాలంలో వీరికి మూడువేల రూపాయలు స్టైఫండ్ గా ఇచ్చారు. వీరు త్వరలో రాష్ట్రంలోని ఆలయాల్లో సహ అర్చకులుగా విధుల్లో చేరనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో మహిళలు అర్చకులుగా పనిచేస్తున్నారు. శిక్షణ తీసుకున్న స్త్రీలను ఆలయాల్లో అర్చకులుగా నియమించుకోవచ్చని 2021 వ సంవత్సరంలోనే హిందూమత వ్యవహారాలు, ధర్మాదాయ శాఖా మంత్రి పి కె శేఖర్ బాబు తెలిపారు. ఆలయాల్లోకి ఇతర కులాల వారికి అనుమతి లేకపోవటం అనేది తన గుండెకు ముల్లులా గుచ్చుకుని బాధిస్తోందని సంఘ సంస్కర్త పెరియార్ ఇ వి రామస్వామి ఒక సందర్భంలో చెప్పారు. అన్ని కులాల వారిని, మహిళలను అర్చకులుగా నియమించడం ద్వారా.... తంథై పెరియార్ గుండెని ముల్లులా వేధించిన బాధని తొలగించామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఫాదర్ ఆఫ్ ది ద్రవిడియన్ మూమెంట్ గా ఖ్యాతి తెచ్చుకున్న ఈరోడ్ వెంకటప్ప రామస్వామి నాస్తిక వాది, సంఘ సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవం, ద్రావిడ ఉద్యమాలకు ఆద్యులు. ఈయన 1973లో మరణించారు.

First Published:  15 Sep 2023 12:38 PM GMT
Next Story