Telugu Global
WOMEN

క్యాలరీలు ఖర్చు చేసే సింపుల్ టెక్నిక్స్!

మనదేశంలో సగానికిపైగా మహిళలు శరీరానికి అసలు పనే చెప్పట్లేదని ఇటీవల చేసిన ఓ స్టడీలో వెల్లడైంది. పురుషులు సగటున రోజుకి 476 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మహిళలు రోజుకి కేవలం 374 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తున్నారట.

క్యాలరీలు ఖర్చు చేసే సింపుల్ టెక్నిక్స్!
X

మనదేశంలో సగానికిపైగా మహిళలు శరీరానికి అసలు పనే చెప్పట్లేదని ఇటీవల చేసిన ఓ స్టడీలో వెల్లడైంది. పురుషులు సగటున రోజుకి 476 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మహిళలు రోజుకి కేవలం 374 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తున్నారట. అసలు క్యాలరీలు ఖర్చు చేయడానికి ఏం చేయాలి? వర్కవుట్స్ చేయకుండా కూడా క్యాలరీలు కరిగించొచ్చా? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలరీలు ఖర్చు చేయడానికి వ్యాయామం సరైన మార్గం. త్రెడ్‌మిల్, రన్నింగ్‌, సైక్లింగ్‌ వంటి ఎక్సర్‌సైజ్‌ల వల్ల క్యాలరీలు బాగానే ఖర్చవుతాయి. రోజూ ఒక గంట పాటు జాగింగ్‌ చేస్తే 400 క్యాలరీల దాకా ఖర్చవుతాయి. ఒక గంట పాటు హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌ చేస్తే రోజుకు 500 నుంచి 1000 క్యాలరీల వరకు కరిగించొచ్చు. అయితే వ్యాయామం చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అలాంటి వాళ్లు కనీసం నడక అయినా అలవాటు చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఆఫీసు దగ్గర్లో ఉంటే రోజూ నడుచుకుంటూ వెళ్లడం, ఇంట్లో మెట్లు ఎక్కిదిగడం లాంటివి చేసినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల 50- నుంచి 100 క్యాలరీల వరకూ శక్తి ఖర్చు అవుతుంది.

ఈ రోజుల్లో చాలామంది ఆఫీస్‌లోనే ఎక్కువ టైం గడుపుతున్నారు. ఆఫీసులో కదలకుండా గంటల తరబడి కూర్చొనే ఉండాల్సి వస్తోంది. అలా ఉండటం వల్ల అసలు క్యాలరీలు ఖర్చయ్యే అవకాశం ఉండదు. మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతారు. అలా కాకుండా పని చేసే సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఓ సారి కూర్చొన్న చోటనే అటూఇటూ కదలడం, చేతులు కాళ్లను స్ట్రెచ్ చేయడం వంటివి చేస్తే శరీరంలో కొద్దిపాటి క్యాలరీలు ఖర్చవటంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఇంటి పనులతో..

ఇక ఇంట్లో ఉండే మహిళలు మార్కెట్‌కెళ్లి కూరగాయలు తీసుకురావడం, వాటిని కట్‌ చేయడం లాంటివి చేయడం వల్ల 100 క్యాలరీల దాకా ఖర్చు అవుతాయి. అలాగే గదిని సర్దుకోవడం, గదిలో ఉండే పుస్తకాలను, బట్టలను, అలంకరణ వస్తువులను శుభ్రం చేయడం వంటివి చేయటం వల్ల మరో 100 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటిని బయటకు తీసుకెళ్ళడం ద్వారా సులభంగా ఒక గంటకు 200 క్యాలరీలను కరిగించుకోవచ్చు. అలాగే ఐదు నిముషాలు బిగ్గరగా నవ్వడం వల్ల కూడా దాదాపు 40 క్యాలరీలు ఖర్చు అవుతాయట. ఇలా ఇంట్లో ఉంటూ కూడా ఏదో ఒక శారీరక శ్రమ చేస్తూ క్యాలరీలు కరిగించుకోవచ్చు. ఈ రోజుల్లో వస్తున్న ఒబెసిటీ, డయాబెటిస్, బీపీ వంటి చాలా సమస్యలకు శారీరక శ్రమ లేకపోవడమే ముఖ్య కారణం.

క్యాలరీ ఇన్‌టేక్

ఇకపోతే క్యాలరీలు ఖర్చు చేయడమే కాదు, క్యాలరీ ఇన్‌టేక్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ వల్ల శరీరానికి అవసరం లేని అదనపు క్యాలరీలు వచ్చి చేరతాయి. వీటివల్ల డయాబెటిస్, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి. ఎక్కువ తింటూ తగినంత వ్యాయామం చేయకపోయినా లేదా వ్యాయామం చేస్తూ అనారోగ్యకరమైన ఆహారం తిన్నా.. రెండూ ఒకటే. కాబట్టి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.

First Published:  3 Nov 2023 12:01 PM GMT
Next Story