Telugu Global
WOMEN

పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

అందరూ పీరియడ్స్ గా వ్యవహరించే ఈ విషయం గురించి ఆడవాళ్లే తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
X

ప్రతి మహిళ జీవితంలో బాల్యాన్ని దాటించే ఒక దశ నుండి వృద్ధాప్యానికి మార్గంగా నిలిచే దశ వరకు ఒక నిరంతర ప్రక్రియగా సాగే విషయం ఋతుక్రమం. మొదటిసారి ఋతుక్రమం మొదలయినప్పటి నుండి మెనోపాజ్ ద్వారా అది ఆగిపోయేవరకు నెల నెలా బయటకు పోయే ఓ రుధిర ప్రవాహం మహిళల్లో సాగుతూ ఉంటుంది. అయితే కాలం ఎంత అభివృద్ధి చెందినా ఈ నెలసరి, రక్తస్రావం అనే మాటలు, వాటికి సంబంధించిన విషయాలు ఎక్కడ వినబడినా అక్కడ చెప్పలేనంత నిశ్శబ్దం చోటుచేసుకుంటుంది. నెలసరి, రక్తస్రావం అనేవి బయటకు మాట్లాడకూడని విషయాలు అనే ధోరణి అందరిలో ఉండటమే దీనికి కారణం.

అందరూ పీరియడ్స్ గా వ్యవహరించే ఈ విషయం గురించి ఆడవాళ్లే తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే చర్మసంబంధ సమస్యలను పరిష్కరించుకోవడం నుండి వాడే పాడ్స్ లేదా టాంపాన్ ల వరకు అన్నిటి గురించి మంచి అవగాహన ఉంటే ఆ రోజులు కూడా ఒత్తిడి లేకుండా గడిచిపోతాయంటున్నారు మహిళా సమస్యల గురించి అవగాహన కల్పించే నిపుణులు.

◆ యుక్తవయస్సు అమ్మాయిలున్న సాధారణ, దిగువ కుటుంబాలలో పీరియడ్స్ విషయంలో కొన్ని కట్టుబాట్లు, అపోహలు ఉంటాయి. అవి ఆడపిల్లల శారీరక సమస్యలకు కారణం అవుతాయి.

◆ పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత, పీరియడ్స్ గురించి అవగాహన లేకపోతే ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఖర్ఘర్ లోని మదర్‌హుడ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సురభి సిద్ధార్థ చెప్పారు.

◆ ప్రతి 4-6 గంటలకు ఒకసారి పాడ్ లేదా టాంపాన్ ను మార్చుకోవడం వల్ల యోని ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. ఎక్కువసేపు వాటిని అలాగే ఉంచుకోవడం వల్ల చర్మం కమిలిపోవడం, దద్దుర్లు రావడం, మంటగా అనిపించడం వంటి అసౌకర్యాలు ఏర్పడతాయి.

◆ పాడ్ ను మార్చుకున్న ప్రతిసారి యోని ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బాక్టీరియా లోపలికి చొచ్చుకువెళ్లే అవకాశం ఉంటుంది. అది కాస్తా మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

◆ యోని శుభ్రత కోసం సాధారణంగా స్నానం కోసం ఉపయోగించే సోప్ లు, షాంపూలు వంటి రసాయన ఉత్పత్తులు వాడకూడదు. సహజంగానే యోని శుభ్రతకు అనువైన వ్యవస్థ శరీరంలో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఏమీ వాడకూడదు.

◆ పాడ్స్ లేదా టాంపాన్ లను మార్చుకున్న తరువాత వాటిని సరైన రీతిలో చుట్టి చెత్తబుట్టలో వేయాలి. చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోకూడదు.

◆ శుభ్రత ఎంత ముఖ్యమో అతి శుభ్రత అంత అనర్థదాయకం. అతిగా యోని ప్రాంతాన్ని కడగడం, రుద్దడం, పీరియడ్స్ సమయంలో వాణిజ్య ఉత్పత్తులు వాడటంవల్ల బాక్టీరియా పెరుగుదలకు అవకాశం ఎక్కువ అవుతుంది.

◆ ఇప్పటికాలంలో పీరియడ్స్ కోసం వాడే ఉత్పత్తులు కూడా చాలా మార్పులు చెందుతున్నాయి. ఒకప్పుడు కాటన్ క్లాత్ లు వాడేవారు, తరువాత పాడ్స్ వచ్చాయి, వాటికి పోటీగా టాంపాన్ లు వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇప్పుడు సిలికాన్ మెన్స్త్రువల్ కప్స్ కూడా వచ్చేసాయి.

◆సిలికాన్ మెన్స్త్రువల్ కప్స్ వాడటంలో ఎలాంటి అసౌకర్యం లేకపోతే అవి ఎంతో ఆరోగ్యకరం అంటున్నారు గైనిక్ డాక్టర్లు. వాటి వల్ల శుభ్రత మాత్రమే కాకుండా ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటాయని. ఆర్థిక స్థాయి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని. ఒక కప్ సుమారు రెండు సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

◆ పిరుయడ్స్ ఎంత సున్నితమైన విషయమో, అంతకంటే ఎక్కువ అవగాహన పెంచుకోవాల్సిన అంశం.

ఈ విషయంలో సిగ్గు, భయాలను వదిలి కాస్త ఫ్రీగా ఆలోచిస్తే స్ర్తీలకు నెలనెలా వచ్చే ఈ పిరియడ్స్ సమస్యలనుంచి సులువుగా దాటగలిగే ఎన్నో మార్గాలు తెలుసుకునే వీలుంటుంది. ఇందులో వచ్చే అనారోగ్య సమస్యలను కుటుంబంలో వారితో పంచుకోవడం, వారికి తమ పరిస్థితిని తెలియపరచడం చేయాలి. డాక్టర్ వరకూ వెళ్ళే ముందు మీ ఆరోగ్య స్థితిని ఇంట్లో వారితో చర్చించడం ఎంతైనా అవసరం.

First Published:  16 July 2022 3:30 AM GMT
Next Story