Telugu Global
WOMEN

రుతుక్రమం దేవుడి శాపం... 12 శాతం బాలికల అవగాహన ఇదే...

ఈ సమాచార విప్లవ యుగంలో ఇప్పటికీ మనదేశంలో చాలామంది అమ్మాయిలకు తమకు నెలసరి ఎందుకు వస్తుందో తెలియదు.

రుతుక్రమం దేవుడి శాపం... 12 శాతం బాలికల అవగాహన ఇదే...
X

ఈ సమాచార విప్లవ యుగంలో ఇప్పటికీ మనదేశంలో చాలామంది అమ్మాయిలకు తమకు నెలసరి ఎందుకు వస్తుందో తెలియదు. చైల్డ్ రైట్స్ అండ్ యు అనే స్వచ్ఛంద సంస్థ ఈ అంశంపై ఓ సర్వే నిర్వహించింది. 10 నుండి 17 ఏళ్ల మధ్య వయసున్న నాలుగువేలమంది బాలికలను... పీరియడ్ షేమ్ అనే ప్రచారోద్యమంలో భాగంగా.... ‘అమ్మాయిలు నెలసరిని ఎలా చూస్తున్నారు, ఆ సమయంలో వారు ఎలా ఉంటున్నారు... ఈ అంశంపట్ల వారికున్న అవగాహన ఏమిటి’ అనే అంశాలపై ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 38 జిల్లాల్లోని బాలికలను ప్రశ్నించి సర్వే నిర్వహించారు. గత ఏడాది సర్వే నిర్వహించగా... ఈ మే 28న వరల్డ్ మెన్ స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా సర్వే ఫలితాలను వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం కోసం రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచడంలో భాగంగా ఈ సర్వేని నిర్వహించారు.

ఈ సర్వేకోసం 66.1 శాతం మంది అమ్మాయిలను పట్టణ ప్రాంతాలనుండి, 30.2 శాతం మంది అమ్మాయిలను గ్రామీణ ప్రాంతాలనుండి 3.7శాతం మంది బాలికలను పట్టణాల్లో స్లమ్ ప్రాంతాలనుండి ఎంపిక చేశారు. వీరిలో 77.8 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటుండగా 22.2 శాతం మంది ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్నవారు.

రుతుక్రమం వెనుక కారణం ఏమిటంటే...

సర్వే ప్రకారం 84 శాతం మంది అమ్మాయిలకు నెలసరి ఎందుకు వస్తుంది... అనే విషయంలో అవగాహన ఉంది. అది తమ శరీరంలో జరిగే జీవప్రక్రియ అని వారు చెప్పారు. 11.3శాతం మంది బాలికలకు రుతుస్రావంకి సంబంధించిన అవగాహన లేదు. వీరు ఈ విషయాన్ని దేవుడిచ్చిన శాపమని, లేదా ఏదైనా వ్యాధి కారణంగా అలా జరుగుతుందని చెప్పారు. 4.6శాతం మంది తమకు దీని గురించి ఏమాత్రం తెలియదని చెప్పుకొచ్చారు.

షాపునుండి ప్యాడ్స్ కొనాలంటే ఇబ్బందే...

సమాజం ఈ విషయాన్ని సిగ్గుపడే అంశంగా, పైకి చెప్పకూడని విషయంగా భావిస్తున్నదని 61.4శాతం మంది అమ్మాయిలు తెలిపారు. చాలామంది బాలికలను శానిటరీ నేప్ కిన్స్ అందుబాటులో లేవని సర్వేలో తేలింది. 44.5 శాతం మంది ఈ సమయంలో తాము ఇంట్లో తయారుచేసిన నేప్ కిన్స్ ని లేదా బట్టని వాడుతున్నట్టుగా పేర్కొన్నారు. షాపులనుండి ప్యాడ్స్ ని కొని తెచ్చుకోవడానికి ఇబ్బంది మొహమాటం, వాటిని వాడాక పారేయటంలో సమస్యలు, అవి అన్ని చోట్ల అందుబాటులో లేకపోవటం, వాటి గురించి తెలియకపోవటం... ఈ కారణాల వలన చాలామంది అమ్మాయిలు ప్యాడ్స్ వాడటం లేదని తెలుస్తోంది.

ఎలా తెలుసుకున్నామంటే...

తమ తల్లిద్వారా తాము నెలసరి గురించి తెలుసుకున్నామని 27.7శాతం మంది బాలికలు తెలిపారు. 22.8శాతం మంది తమ స్నేహితుల ద్వారా తమకీ విషయంలో అవగాహన కలిగిందని చెప్పారు. 15.9 శాతం మందికి తమకంటే పెద్దదైన సోదరి ద్వారా నెలసరి విషయాలు తెలిస్తే... 8.8 శాతం మందికి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ అంశంపై అవగాహన కలిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికీ మనదేశంలో రుతుక్రమం విషయంలో పూర్తి స్థాయి అవగాహన, దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేవని, శానిటరీ నేప్ కిన్స్ ని కొనటంలో, వాడటంలో, వాడినవి పడేయటంలో సమస్యలున్నాయని, అవి బాలికలందరికీ అందుబాటులో లేవని సర్వే వెల్లడించిది.

First Published:  30 May 2023 7:08 PM GMT
Next Story