Telugu Global
WOMEN

రైతు బిడ్డలతో పెళ్లికి అందమైన అమ్మాయిలు ఇష్టపడరు

మహారాష్ట్ర ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

రైతు బిడ్డలతో పెళ్లికి అందమైన అమ్మాయిలు ఇష్టపడరు
X

రైతు బిడ్డలను పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిలు ఇష్టపడరని మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్ చేశారు. రైతు సమస్యలపై మహారాష్ట్రలోని వరూడ్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవేంద్ర మహదేవరావ్‌ భుయార్‌ అనే యువ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే యువతులను మూడు కేటగిరీలుగా విభజించారు. మూడో కేటగిరి అమ్మాయిలతోనే రైతు బిడ్డలు సరి పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. అందంగా ఉండే యువతులు రైతు బిడ్డలతో పాటు తనలాంటి వాళ్లను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరని అన్నారు. వాళ్లు మంచి ఉద్యోగం ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోవడానికే ఇష్ట పడుతారని తెలిపారు. ఓ మోస్తారు అందంగా ఉండేవాళ్లు స్వయం ఉపాధితో సంపాదించుకునే వారిని ఇష్టపడుతారని, ఇక మూడో కేటగిరి యువతులకే రైతు బిడ్డలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారని తెలిపారు. రైతు దంపతులకు పుట్టే పిల్లలు కూడా అంత అందంగా ఉండరని కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా వరూడ్‌ - మోర్షీ నియోజకవర్గం నుంచి స్వాభిమాని పక్ష పార్టీ తరపున భుయార్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను మహిళలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూయర్‌ మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

First Published:  2 Oct 2024 5:23 PM GMT
Next Story