Telugu Global
Travel

హెల్దీగా మారేందుకు ఈ టూర్స్‌ వెళ్లొచ్చు!

సరదాగా ఎంజాయ్ చేయడం కోసం టూర్‌‌కి వెళ్లడం మామూలే. అలా కాకుండా ఆరోగ్యం కోసం ఒక టూర్ వేస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచనతో ఓ కొత్త టూరిజం ట్రెండ్ వచ్చింది.

హెల్దీగా మారేందుకు ఈ టూర్స్‌ వెళ్లొచ్చు!
X

సరదాగా ఎంజాయ్ చేయడం కోసం టూర్‌‌కి వెళ్లడం మామూలే. అలా కాకుండా ఆరోగ్యం కోసం ఒక టూర్ వేస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచనతో ఓ కొత్త టూరిజం ట్రెండ్ వచ్చింది. అదే ‘వెల్‌నెస్ టూరిజం’. క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావడమే ఈ టూర్స్ కాన్సెప్ట్. అంటే టూర్‌‌కి వెళ్లి ఎంజాయ్ చేయడంతో పాటు, వస్తూ వస్తూ ఆరోగ్యాన్ని వెంట తెచ్చుకోవడమన్న మాట.

వెల్‌నెస్ టూర్స్‌ని ‘ఆరోగ్య యాత్రలు’ అని కూడా అంటారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల కాలంలో వెల్‌నెస్ టూరిస్టుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మనదేశం.. వెల్‌నెస్ టూరిజంకి బెస్ట్ స్పాట్‌గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది వెల్‌నెస్‌ కోసం ఇండియాకి వస్తున్నారు. మనదేశంలో ఉన్న యోగా, నేచురోపతి, రెజువెనేషన్ ట్రీట్‌మెంట్స్ ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. స్టీవ్ జాబ్స్, ఆర్ఫన్ విన్‌ఫ్రే, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లాంటివాళ్లు కూడా వెల్‌నెస్ ట్రిప్ కోసం ఇండియాకు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వెల్‌నెస్ టూరిజం మనదేశంలో ఎంత ఫేమస్సో. మరి మనదేశంలో ఉన్న వెల్‌నెస్ టూర్స్ గురించి తెలుసుకుందామా!

కేరళ

కేరళ అంటే ముందు గుర్తొచ్చేది ఆయుర్వేదం. కేరళ అందాలతో పాటు, అక్కడ మాత్రమే ఉండే ప్రాచీన ఆయుర్వేద కేంద్రాలు కూడా చాలా ఫేమస్. ఏటా దేశవిదేశాల నుంచి ఎంతో మంది వైద్యం కోసం కేరళలోని విలేజెస్‌కు వస్తుంటారు. కేవలం అనారోగ్య సమస్యలున్న వాళ్లే కాకుండా, మామూలు వాళ్లు కూడా మానసిక ప్రశాంతత కోసం ఇక్కడుండే ప్రకృతి కేంద్రాలకు వస్తుంటారు. కేరళలోని కోవళం, కొట్టాయం, కొల్లాం, వార్కల ప్రాంతాల్లోని ఆయుర్వేదశాలలు, వెల్‌నెస్‌ రిసార్టులు ఎక్కువగా ఉంటాయి. కోవళంకు దగ్గర్లో ఉన్న సోమతీరం వెల్‌నెస్ టూరిజంకు బెస్ట్ ప్లేస్.

ఉత్తరాఖండ్‌

ఉత్తరాఖండ్ మొత్తం ఎక్కువగా మంచు పర్వతాలతోనే కప్పబడి ఉంటుంది. ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలకు, నదులకు పుట్టినిల్లు. అయితే ఇప్పుడిప్పుడే ఉత్తరాఖండ్ వెల్‌నెస్ టూరిజం కేంద్రంగా కూడా డవలప్ అవుతుంది. పుణ్య క్షేత్రాలతో పాటు బౌద్ధ ఆశ్రమాలు, మెడిటేషన్ కేంద్రాలు కూడా పెరుగడంతో మెంటల్ వెల్‌నెస్ కోసం వచ్చే టూరిస్టులను ఉత్తరాఖండ్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉండే ‘ఆనంద రిసార్ట్’ ఇండియాలోనే ఫేమస్. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ రిసార్ట్స్‌లో పేరుకు తగ్గట్టే ఎంతో మానసిక ఆనందం దొరుకుతుంది. చుట్టూ పచ్చదనం, దూరంగా కనిపించే హిమాలయాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులను టెన్షన్స్ నుంచి దూరం చేస్తాయి. ఇక్కడ రకరకాల థెరపీలు అందుబాటులో ఉంటాయి.

కరుణధామ్

తమిళనాడులో కొడైకెనాల్‌కు దగ్గర్లో ఉండే ‘కరుణ ధామ్‌’కు వెళ్తే మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా తిరిగి రావొచ్చు. కొడైకెనాల్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండే కరుణ ధామ్ దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రతి రోజూ పొద్దున, సాయంత్రం యోగా క్లాసులు నిర్వహిస్తారు. దాంతో పాటే సేంద్రియ వ్యవసాయం, మొక్కలు నాటడం, తోట పనులు లాంటివి కూడా చేయిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్లంతా కలిసి పెర్సనాలిటీ డెవలప్‌మెంట్, మైండ్ ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ గురించి చర్చించుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నన్ని రోజులు ప్రకృతితో మమేకం అయిపోతారు.

పూణె

మహారాష్ట్రలోని పుణే కూడా వెల్‌నెస్‌ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న ‘ఆత్మంతన్‌’ కేంద్రం వెల్‌నెస్‌ టూరిస్టులకు సంప్రదాయ ఆయుర్వేద, ప్రకృతి చికిత్సలతో పాటు వెస్టర్న్ ట్రీట్‌మెంట్స్ అయిన మసాజ్‌, హమామ్‌ బాత్‌, హైడ్రోథెరపీ, బాడీ పాలిష్‌, ఆక్యుప్రెషర్ వంటి డిఫరెంట్ ట్రీట్‌మెంట్స్‌ని కూడా అందిస్తోంది. ఇంకా ఇక్కడ బ్యూటీ ట్రీట్‌మెంట్లు, కండరాలు, కీళ్ల నొప్పులకు చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.

గోకర్ణ

గోవాకు దగ్గర్లో ఉండే గోకర్ణలో మెడిటేషన్, వ్యాయామాల క్లాసెస్ జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చే విదేశీ టూరిస్టులు స్థానికుల ఇంట్లో విడిది చేస్తారు. గోకర్ణ ఒక మినీ కల్చరల్ హబ్. ఇక్కడ నివసించే కుటుంబాలు ఇప్పటికి ప్రాచీన సంప్రాదాయాలనే పాటిస్తాయి. రోజూ మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేస్తూ అక్కడికి వచ్చిన టూరిస్టులకు కూడా వాటిని నేర్పిస్తుంటారు. టూరిస్టులకు మనదేశ సాంప్రదాయ వంటలను రుచి చూపిస్తారు. గోకర్ణలో ప్రతి ఇంట్లో విదేశీయులు కనిపిస్తారు. ఆ ఇంట్లో ఒకరిగా కలిసిపోతారు.

మెహ్‌సానా

గుజరాత్‌లోని మెహ్‌సానా మనదేశంలోని బెస్ట్ హెరిటేజ్ సిటీల్లో ఒకటి. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న మోహ్‌సానా ఇప్పుడు వెల్‌నెస్ టూరిస్టులకు కూడా కేంద్రంగా మారింది. ఇక్కడుండే ‘నింబా నేచర్‌ క్యూర్‌ సెంటర్‌’ సరికొత్త ప్రకృతి విధానాలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. నేచురల్ విధానాలతో బ్యూటీ, ఒబెసిటీ, ఒత్తిడి లాంటి వాటికోసం ప్రత్యేకంగా థెరపీలు అందిస్తుంది. వైబ్రో మసాజ్, అయాన్‌ డీటాక్స్, మడ్‌ బాత్, స్పైన్‌ బాత్, డైట్‌ థెరపీ వంటి చికిత్సలు ఇక్కడ పాపులర్.

First Published:  2 Jan 2024 1:09 PM GMT
Next Story