Telugu Global
Travel

అతనికి నష్టపరిహారంగా యాభైలక్షలు చెల్లించండి.... ట్రావెల్ ఏజన్సీలకు ఫోరం ఆదేశం

రెండు ప్రముఖ ట్రావెల్ ఏజన్సీలు ఢిల్లీకి చెందిన యోగేష్ సైగల్ అనే వ్యక్తికి యాభై లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. థామస్ కుక్, రెడ్ యాపిల్ ట్రావెల్ అనే ట్రావెల్ ఏజన్సీలు నష్టపరిహారం చెల్లించాల్సిన సంస్థలు

అతనికి నష్టపరిహారంగా యాభైలక్షలు చెల్లించండి.... ట్రావెల్ ఏజన్సీలకు ఫోరం ఆదేశం
X

అతనికి నష్టపరిహారంగా యాభైలక్షలు చెల్లించండి.... ట్రావెల్ ఏజన్సీలకు ఫోరం ఆదేశం

రెండు ప్రముఖ ట్రావెల్ ఏజన్సీలు ఢిల్లీకి చెందిన యోగేష్ సైగల్ అనే వ్యక్తికి యాభై లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. థామస్ కుక్, రెడ్ యాపిల్ ట్రావెల్ అనే ట్రావెల్ ఏజన్సీలు నష్టపరిహారం చెల్లించాల్సిన సంస్థలు. యోగేష్ కుటుంబం రెడ్ యాపిల్ కి చెందిన కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో యోగేష్ భార్య, కొడుకు, మామగారు మరణించారు. డిసెంబరు 2019లో వారు శ్రీలంకలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యోగేష్ కి శ్రీలంకలో తిరిగేందుకు ... థామస్ కుక్ అనే ట్రావెల్ ఏజన్సీ... రెడ్ యాపిల్ ట్రావెల్ చేత వాహనాన్ని ఏర్పాటు చేయించింది.

యోగేష్ భార్య కను ప్రియ సైగల్ గతంలో ఎన్ డిటీవీలో జర్నలిస్ట్ గా న్యూస్ యాంకర్ గా పనిచేశారు. ఆమెతో పాటు కుమారుడు శ్రేయా సైగల్, ఆమె తండ్రి ప్రముఖ హిందీ సాహితీవేత్త అయిన గంగా ప్రసాద్ విమల్... ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. యోగేష్ కి, ఆయన కుమార్తె ఐశ్వర్యా సైగల్ కి తీవ్ర గాయాలయ్యాయి. కొలొంబోలో వారు ప్రయాణిస్తున్న కారు, కంటైనర్ ట్రక్ ని ఢీకొట్టటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 67 ఏళ్ల వయసున్న డ్రైవర్ కూడా మరణించాడు.

యోగేష్ ... వినియోగదారుల వివాదాలను పరిష్కరించే ఫోరం లో కేసు వేయగా దాదాపు నాలుగేళ్ల తరువాత ఆయనకు నష్టపరిహారం చెల్లించేలా ఫోరం నుండి ఆదేశాలు వచ్చాయి. ట్రావెల్ కంపెనీల నిర్లక్ష్యం, సామర్ధ్య లోపాల వల్లనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నియామకంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ట్రావెల్ కంపెనీ తన బాధ్యతలనుండి తప్పించుకోలేదని ఫోరం పేర్కొంది.

ట్రావెల్ కంపెనీల నిర్లక్ష్యం, సేవలు అందించడంలో సామర్ధ్య లోపం, నాణ్యతలేని వ్యాపార విధానాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు తదితర అంశాలను పేర్కొంటూ న్యాయపరమైన ఖర్చులను కూడా ఇప్పించాల్సిందిగా కోరుతూ యోగేష్ ఫోరంకి వెళ్లారు. 8.99కోట్ల రూపాయలు తమకు నష్ట పరిహారంగా ఇప్పించాలని ఆయన కోరారు.

ప్రమాదంలో తీవ్రగాయాల పాలవటం వలన శ్రీలంకలో చికిత్స తీసుకుంటూ ఢిల్లీలో జరిగిన తన భార్య, కుమారుల అంత్యక్రియలకు కూడా తాను హాజరు కాలేకపోయానని, తన కూతురు, భర్తని కోల్పోయిన తన అత్తగారు శారీరకంగా, మానసికంగా సమస్యల బారిన పడ్డారని, తన కుమార్తె ఆ చేదు ఘటన వలన తీవ్రమైన మానసిక వేదనని అనుభవిస్తోందని, తాను ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

యోగేష్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఫోరం మూడునెలలలోగా ఆయనకు యాభైలక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ట్రావెల్ ఏజన్సీలను ఆదేశించింది. సమయం దాటితే అదనంగా పదిలక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

First Published:  24 Aug 2023 5:45 AM GMT
Next Story