Telugu Global
Travel

ఈ టూరిస్ట్ ప్లేసులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంది!

మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాల అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఎప్పటికీ అలాగే ఉంటాయని చెప్పలేం. కాలం గడిచే కొద్దీ మెల్లగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ టూరిస్ట్ ప్లేసులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంది!
X

మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాల అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఎప్పటికీ అలాగే ఉంటాయని చెప్పలేం. కాలం గడిచే కొద్దీ మెల్లగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సిటీలు పెరగడం, పర్యావరణం కాలుష్యం లాంటి కారణాల వల్ల కొన్ని అందమైన ప్రదేశాలు అంతం అయ్యే చివరి దశలో ఉన్నాయి.

అందమైన ప్రదేశాలు ఎప్పుడైనా చూడొచ్చు కానీ అరుదైన ప్రదేశాలను మాత్రం వీలైనంత త్వరగా చూసేయాలి. ఎందుకంటే.. లేటు చేసేకొద్దీ అవి కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ. మనదేశంలో రకరకాల టూరిస్టు ప్రాంతాలతో పాటు కొంతకాలానికి కనుమరుగయ్యే అరుదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

మజులీ రివర్ ఐల్యాండ్

మజులీ అనేది ఒక రివర్ ఐల్యాండ్. సాధారణంగా ఐల్యాండ్ లు సముద్రం మధ్యలో ఉంటాయి. కానీ ఇది నది మధ్యలో ఉండే రివర్ ఐల్యాండ్. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులీ ఐల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐల్యాండ్. దీని సౌందర్యాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌ల నుంచి సన్ సెట్‌ను చూడటం ఓ మధురానుభూతి.

మజులి ద్వీపంలో ఏనుగులు, పులులు, దుప్పులు, కుందేళ్లు, పాములు ఇలా రకరకాల జంతువులు, రకరకాల జాతుల పక్షులు ఉంటాయి. ఈ ఐల్యాండ్ అంతా స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతుంది. ఏ సీజన్‌లో చూసినా ఇక్కడ పచ్చదనమే కనిపిస్తుంది. హనీమూన్‌కు ఇది బెస్ట్ ప్లేస్. కానీ డీఫారెస్టేషన్ కారణంగా ఈ ఐల్యాండ్ కుచించుకుపోతుంది. మరో పాతికేళ్లలో ఈ ఐల్యాండ్ వైశాల్యం బాగా తగ్గిపోతుందని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. అందుకే ఈ ఐల్యాండ్ అందాలను ఆశ్వాందిచాలంటే వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకోవడం బెటర్.

ఉలార్ లేక్

జమ్మూకాశ్మీర్‌లోని బందిపురా జిల్లాలో ఉన్న ఉలార్‌ ఆసియాలోని అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. ఈ సరస్సులోని నేలల్లో ఉండే విల్లో చెట్లు ఆకర్షనీయంగా చూపుతిప్పుకోనీకుండా చేస్తాయి. అంతేకాదు ఈ సరస్సులో వేల రకాల పక్షులు కనిపిస్తాయి. వాటితో పాటు బాతులు, యురేసియన్‌ పిచ్చుకలు, పొట్టికాళ్ళ గద్దలలతోపాటు హిమాలయన్‌ మోనాల్‌, గోల్డెన్‌ ఓరిలో, హూపోరు, ఇండియన్‌ రోలర్‌ లాంటి ఎన్నో రకాల పక్షులు ఏప్రిల్‌-మే నెలల్లో ఇక్కడికి వచ్చిచేరుతుంటాయి. ఈ పక్షులను వీక్షించడంతోపాటు బోటింగ్‌, వాటర్‌ స్కైయింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ కోసం కూడా ఎంతోమంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడ రోజురోజుకీ చెట్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. చెట్లు లేకపోతే సరస్సు ఎంతో కాలం పచ్చగా ఉండలేదు.

రాఖీగరీ

రాఖీగరీ హర్యాణా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ఉంది. ఇది హరప్పా మొహంజొదారో కాలం నాటి ప్రాంతం. ప్రపంచంలో మొదటి సివిలైజేషన్స్ లో ఒకటైన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో రాఖీగరీ అతిపెద్ద సిటీ. ఇప్పటికీ అక్కడ అప్పటి నాగరికత ఆనవాళ్లు కనిపిస్తాయి. రాఖీగరీ వెళ్తే.. అప్పట్లో వాళ్లు ఎంత పెద్ద సిటీని నిర్మించుకున్నారో చూడొచ్చు. కల్చరల్ టూరిజంను, హిస్టారికల్ టూరిజంను ఇష్టపడేవాళ్లను ఈ ప్రదేశం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ఈ ప్రాంతం సరిహద్దులు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. కొంతకాలానికి పూర్తిగా మాయమైపోయినా ఆశ్చర్యం లేదు.

రామసేతు

రామసేతు అనేది ఇండియా శ్రీలంక మధ్యలో ఉండే సముద్రపు బ్రిడ్జి లాంటిది. ఇది తమిళనాడులోని పంబన్ ఐల్యాండ్‌ని, శ్రీలంకకు చెందిన మన్నర్ ఐల్యాండ్‌ని కలుపుతుంది. ఈ బ్రిడ్జి సముద్రంలో ఉండే ఇసుక, సున్నపు రాళ్లతో గుట్టలు గుట్టలుగా ఉంటుంది. ఈ ఇసుక దిబ్బల పొడవు ముప్పై కిలోమీటర్లు. హిందూ మహాసముద్రంలో సుమారు ఒకటిన్నర మీటర్ల లోతులో ఈ బ్రిడ్జి ఉంటుంది. దీన్ని రామాయణ కాలంలోనే నిర్మించారని చెప్తుంటారు. అందుకే దీన్ని రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జి మీటరు లోతులోనే ఉంది కాబట్టి టూరిస్టులు దీన్ని నేరుగా చూడొచ్చు. కానీ ముందు ముందు సముద్ర మట్టం పెరిగే కొద్దీ ఈ రామసేతు పూర్తిగా కనిపించకుండా పోయే అవకాశం ఉంది.

సుందర్బన్స్

సుందర్బన్ అడవులు మనదేశంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ అడవులు. ఈ అడవులు మూడో వంతు మనదేశంలో మిగతాది బంగ్లాదేశ్‌లో ఉంటాయి. ఇది యునెస్కో వారసత్వ సంపద. ప్రస్తుతానికి ఈ అడవుల్లో అన్ని రకాల టూరిస్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ఏటా ఎంతో మంది ఈ అడవుల్ని సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన బెంగాల్ టైగర్స్ ఈ అడవుల్లోనే ఉంటాయి. ఇక్కడ 250 రకాల పులులనే కాకుండా, సుందర్బన్స్ చేతల్ జింక, కింగ్ కోబ్రా, రేసస్ కోతులను కూడా చూడొచ్చు. అయితే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఫ్యూచర్‌‌లో ఈ అడవులు అంతరించే పోయే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. అందుకే వైల్డ్‌లైఫ్‌ను ఇష్టపడేవాళ్లు వీలైనంత త్వరగా సుందర్బాన్స్‌ను విజిట్ చేస్తే మంచిది.

కోరల్ రీఫ్

కోరల్ రీఫ్ అంటే పగడపు దీవుల సముదాయం. లక్షద్వీప్‌ తీరంలో సముద్రపు అడుగున ఉండే కోరల్ రీఫ్ వలయాకారంగా ఎంతో అందంగా ఉంటుంది. నీలం రంగులో సముద్రం, తెల్లగా మెరిసే ఇసుక తిన్నెలు కళ్లను కట్టిపడేస్తాయి. అయితే బ్లాస్ట్ ఫిషింగ్, కోరల్ మైనింగ్ కారణంగా ఈ ప్రాంతం కూడా డేంజర్ జోన్‌లో ఉంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కూడా దీనిపై ఉంది. రాను రాను సముద్ర మట్టం పెరిగితే ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోనుంది. అందుకే వీలు చూసుకుని సముద్రపు దిబ్బల అందాలను చూసిరావడం బెటర్.

ఇవే కాకుండా గోవాలోని దూద్ సాగర్ జలపాతాలు, కేరళలోని వెంబనాడ్ లేక్, మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్, జైసల్మేర్ కోట కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాయి. రోజురోజుకీ పర్యావరణం పాడవుతుండడం వల్ల ప్రకృతి కూడా తన సహజ అందాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రకృతి అందాన్ని కాపాడుకోవడం కోసం పర్యావరణానికి హాని చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

First Published:  14 Dec 2023 6:30 AM GMT
Next Story