Telugu Global
Travel

షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త..

షిర్డీలో బంద్ అనగానే దేశవ్యాప్తంగా సాయి భక్తుల్లో ఆందోళన మొదలైంది. షిర్డీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు, మే నెలలో షిర్డీ వెళ్లాలనుకున్నవారు కూడా ఆలోచనలో పడ్డారు.

Shirdi town, Sai Baba temple will remain open; locals withdraw shutdown call
X

షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త..

షిర్డీ వెళ్లే సాయిబాబా భక్తులకు శుభవార్త. మే-1నుంచి షిర్డీ గ్రామంలో నిరవధిక బంద్ తలపెట్టిన స్థానికులు తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు, రెండు రోజుల క్రితం భిక్షాటన చేసి నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు గ్రామస్తులు. అయితే ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. స్థానిక నాయకులతో సమావేశమైన గ్రామస్తులు CISF భద్రత విషయంలో చర్చలు జరిపారు. తమ ప్రతిపాదన పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని అందుకే బంద్ విరమిస్తున్నట్టు తెలిపారు. కోర్టులో వేసిన పిటిషన్ మాత్రం అలానే ఉంది.

బంద్ ఎందుకు..?

షిర్డీ ఆలయానికి మరింత భద్రత కల్పించేందుకు CISF దళాలతో రక్షణ ఏర్పాట్లు చేయాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. కేంద్రంతో చర్చలు జరిపి త్వరలో CISF భద్రతకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ మహారాష్ట్ర పోలీసులే ఈ భద్రత చూసేవారు. CISF రంగంలోకి దిగితే స్థానికంగా పలు ఆంక్షలు మొదలవుతాయి. వ్యాపారాలకు ఇబ్బంది, గ్రామస్తులు గతంలో లాగా ఆలయం విషయంలో చొరవ చూపించే అవకాశముండదు. వారి కదలికలు కూడా నియంత్రణలోనే ఉంటాయి. ఇవన్నీ ఆలోచించిన షిర్డీ గ్రామస్తులు CISF భద్రత వద్దంటూ ఆందోళనకు దిగారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు షిర్డీ గ్రామంలో మే-1నుంచి బంద్ పాటిస్తామన్నారు. కానీ తర్వాత చర్చలు జరగడంతో బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

షిర్డీలో బంద్ అనగానే దేశవ్యాప్తంగా సాయి భక్తుల్లో ఆందోళన మొదలైంది. షిర్డీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు, మే నెలలో షిర్డీ వెళ్లాలనుకున్నవారు కూడా ఆలోచనలో పడ్డారు. అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని ఎంక్వయిరీ మొదలుపెట్టారు. అయితే గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సాయి భక్తులకు సంతోషాన్నిచ్చింది. షిర్డీ యాత్రికుల్లో ఆందోళన తగ్గింది.

First Published:  30 April 2023 5:10 AM GMT
Next Story