Telugu Global
Travel

అయోధ్యలో... సరయూ నదిపై ఆహ్లాద ప్రయాణం మొదలు...

చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అయోధ్య నగరాన్ని సందర్శించేవారికి మరో చక్కని ప్రయాణ అనుభూతిని అందిస్తోంది అక్కడి పర్యాటక శాఖ. అయోధ్యలో ఆహ్లాదకరమైన నదీ ప్రయాణ సదుపాయం మొదలైంది.

అయోధ్యలో... సరయూ నదిపై ఆహ్లాద ప్రయాణం మొదలు...
X

చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అయోధ్య నగరాన్ని సందర్శించేవారికి మరో చక్కని ప్రయాణ అనుభూతిని అందిస్తోంది అక్కడి పర్యాటక శాఖ. అయోధ్యలో ఆహ్లాదకరమైన నదీ ప్రయాణ సదుపాయం మొదలైంది. సరయు నదిలో క్రూయిజ్ షిప్ పైన సాగే ఈ ప్రయాణం చక్కని అనుభూతినిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రయాణంలో అయోధ్య అందాలను, దాని తాలూకూ చారిత్రాత్మకమైన అంశాలను చూసే అవకాశం కూడా ఉంటుందని క్రూయిజ్ నిర్వహణాధికారులు తెలిపారు.

అయోధ్యకు వచ్చి ఇక్కడి సాంస్కృతిక వారసత్వమున్న ప్రదేశాలను చూడాలని, ప్రశాంతవాతావరణంలో సేదతీరాలని ఆశించేవారికి జటాయు క్రూయిజ్ సర్వీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. రామాయణంలో ప్రాముఖ్యత ఉన్న పక్షి జటాయు పేరుని క్రూయిజ్ షిప్ కి పెట్టారు. జటాయు క్రూయిజ్ షిప్ లో రామాయణంలోని ప్రముఖ ఘట్టాలను చిత్రించారు.


అయోధ్య మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ ఈ అంశంపైన స్పందిస్తూ... ఈ ప్రయాణం సురక్షితంగా సాగేలా ప్రయాణీకుల భద్రతకోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెండు ఘాట్ ల నడుమ సాగే జటాయు క్రూయిజ్ షిప్ ప్రయాణ నిమిత్రం 300 రూ.లు ఛార్జిగా నిర్ణయించామని ఈ సర్వీస్ ని అందిస్తున్న ప్రయివేట్ ఏజన్సీ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

జటాయు క్రూయిజ్ షిప్ లో పూర్తిస్థాయి ఎయిర్ కండీషన్ సదుపాయం ఉంటుందని, దీంట్లో వందమంది ప్రయాణం చేయవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. నయాఘాట్, గుప్తర్ ఘాట్ ల మధ్య సాగే టూర్ లో భాగంగా సందర్శకులకు ప్రముఖ ఘాట్ లను, గుళ్లను చూపిస్తారు. అలాగే సరయు నది హారతిని సైతం చూసే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులకు భోజనం, స్నాక్స్ కూడా అందిస్తారు.

జటాయు క్రూయిజ్ సర్వీస్ అయోధ్యలో మొదటిది కాగా దీని తరువాత పుష్పక్ అనే మరొక క్రూయిజ్ సర్వీస్ ని ప్రారంభిస్తారు. జటాయు కంటే పుష్పక్ పెద్దది. ఇది మరింత విలాసవంతమైన సదుపాయాలతో ఉంటుంది. ఇందులో 150 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది. టూరిజం పరిశ్రమలో ప్రస్తుతం క్రూయిజ్ షిప్ పర్యటనలు చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి. కోవిడ్ పాండమిక్ తరువాత ఈ పరిశ్రమ 12శాతం వరకు పెరుగుతుందని క్రూయిజ్ లైన్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.

First Published:  12 Sept 2023 5:45 AM GMT
Next Story