Telugu Global
Travel

దర్శనీయం..విశాఖ కాళీ మాత ఆలయం

Kalimata Temple in Visakhapatnam: కాళీమాత ఆలయం విశాఖ జిల్లా కేంద్రమైన విశాఖపట్టణంలో సాగర తీరాన కలదు.

దర్శనీయం..విశాఖ కాళీ మాత ఆలయం
X

కాళీమాత ఆలయం విశాఖ జిల్లా కేంద్రమైన విశాఖపట్టణంలో సాగర తీరాన కలదు. ఇది నవీనమైన ఆలయము. ఈ ఆలయమును ఇటీవలనే పశ్చిమబెంగాలు నివాసీ వ్యాపార రీత్యా వైజాగ్ లో స్థిరపడిన దయానంద ఛటర్జీగారు నిర్మించారు.

అతడు సర్వ మతములను సమంగా చూచుచుండేవాడు. అందుచేతనే అతడిచట నాలుగు ధర్మాలకు -హిందువులకు, జైనులకు క్రైస్తవులకు, బౌద్ధులకు, తదితరులకు సంబంధించిన ఆలయాలను ప్రతిష్టించాడు.



ఆలయాలలో విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు స్వధర్మానికి చెందిన చిహ్నాలను గూడ ఆ విగ్రహాల పునాదులలో ఉంచి ప్రతిష్టింపజేయించాడు. ఆ విధంగా కట్టబడిన ఆలయమే ఇచట గల కాళీమాత ఆలయం.

ఈ శ్రీమాతను ఆరాధించియే నవ్యమానవుడు రామకృష్ణ పరమహంసగా మారాడని మనకందరకూ తెలిసిన విషయం.



ఆ కాళీమాత విగ్రహము నిచట ప్రతిష్టించే సమయంలో, ఛటర్జీగారు సర్వమత సమభావమును ప్రదర్శించుతూ దేవీయంత్రమునే గాక క్రైస్తవ చిహ్నమైన శిలువ, ముస్లిమ్ ల చిహ్నమైన చంద్రవంకను కూడా ఫలకం మీద చిత్రించి, ఆ ఫలకం మీద దేవి విగ్రహమును ప్రతిష్టింప జేయించాడు.

అదే విధంగా ఇచట గల రసలింగేశ్వరం అన్న పేరు గల శివాలయం మీద వైష్ణవ చిహ్నాలను చెక్కించి, జైన,వైష్ణవములక్కొటే, వానిలో భేదభావం లేదని చాటి చెప్పాడు.అదే విధంగా బుద్ధ విగ్రహంను క్రైస్తవ మాతయైన వేలంకినీ మాత విగ్రహమును ప్రతిష్టింప చేయించాడు.




ఈ విధంగా అతడు సర్వమత సమభావమును ప్రదర్శించుతూ ఇచట నెలకొల్పిన ఆలయాలలో వ్రాయబడియున్న.........

"సర్వమత సామరస్యత, మానవత్వం, మూర్తీభవించిన సంఘ సంస్కరణాభిలాషులకు స్వాగతం"

"అనేక రూపాలు, పేర్లతో పూజలందుకొంటున్న భగవానుడొక్కడే"

అన్న వాక్యాలు అతని ఆదర్శాన్ని తెలియజేయుచుండును. ఈ ఆలయాలలో కాళీమాత ఆలయానికి ఎడమ దిశగా శివాలయమును, శివాలయమునకు ముందు భాగాన బౌద్ధవిగ్రహమును, ఉండగా, కాళీమాత ఆలయానికి ముందుభాగాన వినాయక విగ్రహమును, వాయువ్య భాగాన వేలంకినీ మాత విగ్రహములు కలవు.

దర్శనీయ నవీన ఆలయం ఇది .

- రసస్రవంతి 'కావ్యసుధ'

First Published:  25 May 2023 1:18 PM GMT
Next Story