Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ కాశీ పిండదాన్ యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..

ఈ సీజన్‌లో కాశీ యాత్ర చేయాలనుకునేవారికోసం ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’.. కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర పేరుతో ఓ కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఆర్‌‌సీటీసీ కాశీ పిండదాన్ యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ కాశీ పిండదాన్ యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..

ఈ సీజన్‌లో కాశీ యాత్ర చేయాలనుకునేవారికోసం ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’.. కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర పేరుతో ఓ కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ పూర్తి వివరాలు ఇవీ...

ఐఆర్‌‌సీటీసీ రీసెంట్‌గా తీసుకొచ్చిన ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైళ్ల ద్వారా కాశీ గయ యాత్ర సాగుతుంది. 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగే ఈ టూర్.. సెప్టెంబర్ 26, అక్టోబర్ 8 తేదీల్లో మొదలవుతుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం, పలాస మొదలైన స్టేషన్ల నుంచి కూడా యాత్రికులు రైలు ఎక్కొచ్చు. టూర్ ప్యాకేజీలో భాగంగా వారణాసి, గయ, ప్రయాగ్‌రాజ్ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించొచ్చు.

ప్రయాణం ఇలా..

మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడంతో కాశీగయ టూర్ మొదలవుతుంది. రెండో రోజంతా రైలు ప్రయాణమే ఉంటుంది. మూడో రోజు ఉద‌యం రైలు గయకు చేరుకుంటుంది. అక్కడ హోటల్లో రెస్ట్ తీసుకుని పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటే పూర్తి చేసుకోవచ్చు. ఆ రోజు రాత్రి గయలో హోటల్ స్టే ఉంటుంది. నాలుగో రోజు గయ‌లో విష్ణుపాద ఆలయ దర్శనం పూర్తి చేసుకుని సాయంత్రానికి వారణాసి బయల్దేరతారు. ఐదో రోజు ఉద‌యం వారణాసి చేరుకుంటారు. హోటల్లో దిగి టిఫిన్ చేశాక కాశీ విశ్వనాథ ఆలయ దర్శనానికి వెళ్తారు. సాయంత్రం పుణ్య ఘాట్‌లు, గంగా హారతి వంటివి చూసుకుని రాత్రికి ప్రయాగ్‌రాజ్ బయల్దేరతారు. ఆరో రోజు ఉదయానికి ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమం చూసుకుని ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుంచి రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు హోటల్ స్టే, ట్రైన్ క్లాస్ ను బట్టి రూ.13,900 నుంచి రూ.29,300 వరకూ అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. మరిన్ని వివరాల కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్(www.irctctourism.com) ను విజిట్ చేయొచ్చు.

First Published:  28 Aug 2023 10:30 AM GMT
Next Story