Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ ప్యాకేజీతో ఈజీగా శ్రీవారి దర్శనం!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ట్రైన్ టికెట్లు, దర్శన టికెట్లు పొందడం అంత ఈజీ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవారి భక్తుల కోసం ఐఆర్‌‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఐఆర్‌‌సీటీసీ ప్యాకేజీతో ఈజీగా శ్రీవారి దర్శనం!
X

ఐఆర్‌‌సీటీసీ ప్యాకేజీతో ఈజీగా శ్రీవారి దర్శనం!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ట్రైన్ టికెట్లు, దర్శన టికెట్లు పొందడం అంత ఈజీ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవారి భక్తుల కోసం ఐఆర్‌‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్‌‌లో తిరుమల శ్రీవారితో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించొచ్చు. ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేస్తే..

ఏడాది పొడవునా రద్దీగా ఉండే తిరుమలకు వెళ్లడం, సులభంగా దర్శనం చేసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ప్యాకేజీతో తిరుమల టూర్ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ‘ఐఆర్‌‌సీటీసీ తిరుమల టూర్’కు సంబంధించిన స్పెషల్ ట్రైన్ ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 22 మధ్య తేదీలకు ఇప్పటికే బుకింగ్స్ పూర్తయ్యాయి. సెప్టెంబరు 29 తర్వాత నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

విశాఖపట్నం నుంచి మొదలయ్యే ఈ టూర్‌‌లో తిరుమలతోపాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. విశాఖపట్నం, అన్నవరం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల నుంచి కూడా ఈ టూర్ బుక్ చేసుకోవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉండే ఈ టూర్ ఎలా సాగుతుందంటే..

మొదటిరోజు విశాఖపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు -తిరుమల ఎక్స్‌ప్రెస్‌(17488) ట్రైన్ బయల్దేరుతుంది. రెండోరోజు శనివారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి హోటల్‌కు వెళ్లి ఫ్రెష్ అయ్యాక కాణిపాకం, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి హోటల్‌లో బస ఉంటుంది.

ఇక మూడో రోజు ఉదయం తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకున్నాక శ్రీకాళహస్తికి చేరుకుంటారు. ఆ తర్వాత తిరుమలకు బయలుదేరతారు. ఆ రోజు శ్రీవారి దర్శనానికి ఐఆర్‌‌సీటీసీ ప్రత్యేక దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తుంది. దర్శనం పూర్తయ్యాక రాత్రి 8:30 గంటలకు రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీలో భాగంగా దర్శనం టికెట్లు, ఏసీ రూంలో స్టే, ఏసీ బస్సు, ఉదయం టిఫిన్, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.

ప్యాకేజీ ధరలు

ప్రయాణానికి స్లీపర్ క్లాస్, ఏసీ త్రీ టైర్, టూ టైర్.. అలాగే హోటల్ రూం రకాన్ని బట్టి రూ. 10,280 నుంచి 25,000 వరకూ రకరకాల ప్యాకేజీ ధరలు అందుబాటులో ఉన్నాయి. ధరల వివరాల కోసం ఐఆర్‌‌సీటీసీ అఫీషియల్ వెబ్‌సైట్(www.irctctourism.com) ను చెక్ చేయొచ్చు.

First Published:  17 Aug 2023 9:00 AM GMT
Next Story