Telugu Global
Travel

దేశమంతా చూసొద్దాం

నిశ్చయ్‌ భారతీ జైన్‌... కారవాన్‌ ట్రావెలర్‌. కెమెరా కంటితో చూసిన దేశాన్నే ఇప్పుడు చర్మచక్షువులతో వీక్షిస్తూ కారవాన్‌లో దేశాన్ని చుట్టేస్తున్నాడు.

దేశమంతా చూసొద్దాం
X

నిశ్చయ్‌ భారతీ జైన్‌... కారవాన్‌ ట్రావెలర్‌. కెమెరా కంటితో చూసిన దేశాన్నే ఇప్పుడు చర్మచక్షువులతో వీక్షిస్తూ కారవాన్‌లో దేశాన్ని చుట్టేస్తున్నాడు. జాబ్‌ బోర్‌ కొడితే ఓ టూర్‌. లైఫే బోర్‌ కొడితే కారవాన్‌నే ఇల్లు, దేశమే గమ్యం.

నిశ్చయ్‌ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. మంచి ప్రకృతి దృశ్యాల కోసం దేశంలో అనేక ప్రదేశాలను ఇప్పటికే తిరిగేశాడు. కానీ ఇప్పుడు మాత్రం దేశాన్ని చూడడం కోసమే తిరుగుతున్నాడు. ఒక దృశ్యం కోసం అన్వేషణలో ఎన్ని ప్రదేశాల్లో పర్యటించినప్పటికీ అది అన్వేషణ అవుతుంది తప్ప పర్యటన కాదంటాడు నిశ్చయ్‌. అందుకే కారవాన్‌ తయారు చేసుకుని దానికి 'భార్‌తీ ద వ్యాన్‌' అని నామకరణం చేసుకుని టూర్‌ మొదలు పెట్టాడు.

ఇప్పటి వరకు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు అతడి పర్యాటక రాష్ట్రాల జాబితాలో చేరాయి. నిశ్చయ్‌ తన పర్యటనను రాష్ట్రాల సంఖ్య కోసం రూట్‌ వేసుకోవడం లేదు.

ఒక రాష్ట్రంలో తాను చూడాలనుకున్నవన్నీ చూసిన తరవాత మాత్రమే మరో రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నాడు. కర్నాటకలో అరేబియా తీరం వెంబడి ప్రయాణాన్ని కొనసాగించాడు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర తీరాలు కవర్‌ అయ్యాయి. రాజస్థాన్‌ ఎడారిలో అడుగుపెట్టాడు. మంచు పర్వతాల పాదాలను తాకాలి.



అమ్మ ఒడి...

కారవాన్‌కి భారతీ ద వ్యాన్‌ అని పేరు పెట్టడం వెనుక కన్నప్రేమ ఉంది. నిశ్చయ్‌ తల్లి భారతికి సొంత వాహనం కల ఉండేది. గత ఏడాది ఆమె పోయారు. ఈ ఏడాది వాహనం కొన్నాడు. ఆ వాహనంతోనే తన చిన్నప్పటి కల నెరవేర్చుకోవాలనుకున్నాడు.

పర్యటనకు అనువుగా మార్చుకుని టూర్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. అమ్మ పేరు పెట్టుకోవడంతో అమ్మతో కలిసి అమ్మ ఒడిలో సేదదీరుతున్నట్లు సంతోషిస్తున్నానన్నాడతడు. తన కలను ఇలా నెరవేర్చుకుంటున్నాడు. కల నెర్చుకోవడంలో జీవిస్తున్నాడు.

First Published:  2 Jan 2023 10:39 AM GMT
Next Story