Telugu Global
Travel

చలికాలం ప్రయాణాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే..

కొంతమందికి ప్రయాణాలు పడవు. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు తలనొప్పి, వికారం లాంటివి వస్తుంటాయి. దీన్నే ‘ట్రావెల్ సిక్‌నెస్’ అంటారు.

చలికాలం ప్రయాణాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే..
X

కొంతమందికి ప్రయాణాలు పడవు. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు తలనొప్పి, వికారం లాంటివి వస్తుంటాయి. దీన్నే ‘ట్రావెల్ సిక్‌నెస్’ అంటారు. అయితే ఇలాంటి సమస్యలు చలికాలంలో మరింత ఎక్కువ. అందుకే వింటర్‌‌లో ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

మామూలుగానే చలికాలంలో జలుబులు, జ్వరాల వంటివి ఎక్కువ. అలాంటిది ఈ సీజన్‌లో ప్రయాణాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్త చోటు, కొత్త వాతావరణంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.

చలి కారణంగా బాడీ టెంపరేచర్స్‌లో మార్పులు రాకుండా శరీరంలో ఎక్కువ భాగం కవర్‌ అయ్యేలా బట్టలు ధరించాలి. స్వెటర్లు, తలకు టోపీల వంటివి తప్పక తీసుకెళ్లాలి.

చలికాలంలో జర్నీ టైం వీలైనంత తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. వీలైనంత త్వరగా డెస్టినేషన్‌కు చేరుకునేలా చూసుకోవాలి. జర్నీ టైంలో వికారం, వాంతులు రాకుండా ఉండాలంటే ప్రయాణానికి ముందు ఏమీ తినకుండా చూసుకోవాలి. ప్రయాణానికి రెండు గంటల ముందు లేదా జర్నీ తర్వాత తినాలి.

ఈ సీజన్‌లో రాత్రిళ్లు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్లు పగటిపూట జర్నీని ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే వెళ్లబోయే రూట్‌లో వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణం మొదలుపెట్టడం మంచిది.

ఈ సీజన్‌లో కామన్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లకు సంబంధించిన మందులను తప్పక వెంట తీసుకెళ్లాలి. అలాగే వెళ్లినచోట తినే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు, ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్‌ వంటివి తగ్గించాలి.

ట్రావెల్ సిక్‌నెస్ ఉన్నవాళ్లు కారు లేదా బస్సులో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. పూర్తిగా ఏసీపై ఆధారపడకుండా కొద్దిగా కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. బయటి గాలి కాస్తయినా లోపలికి వచ్చేలా చూసుకోవాలి.

ప్రయాణాల టైంలో వికారంగా అనిపించేవాళ్లు చూయింగ్ గమ్ నమలడం ద్వారా కడుపులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు చల్లగాలుల్లో తిరగకుండా చూసుకుంటే మంచిది.

ఈ సీజన్‌లో స్కిన్ పాడవ్వకుండా ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు వేడిగా ఉండే ద్రవ పదార్థాలు తీసుకుంటుండాలి.

First Published:  19 Dec 2023 3:00 AM GMT
Next Story