Telugu Global
Travel

ఇకపై భూటాన్ కి రైల్లో వెళ్లొచ్చు..

మొట్టమొదటి సారి మనదేశంనుండి భూటాన్ కి రైలు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది.

ఇకపై భూటాన్ కి రైల్లో వెళ్లొచ్చు..
X

మొట్టమొదటి సారి మనదేశంనుండి భూటాన్ కి రైలు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈశాన్య ప్రాంతంలో రైల్వేసదుపాయాల విస్తరణ కోసం భారత ప్రభుత్వం 120 బిలియన్ల రూపాయలను కేటాయించడంతో ఈ రైల్వే లైను అందుబాటులోకి వచ్చే అవకాశం మరింత సులభతరం కానుంది. ఈ రైల్వేలైను అసోం లోని కోక్రాఝర్ ని భూటాన్... సర్పాంగ్ లోని గెలెఫుని కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 57.5 కిలోమీటర్ల రైల్వే లైను కోసం పది బిలియన్ల రూపాయలను కేటాయించారు. ఇది 2026నాటికి పూర్తి కానుంది.

నెలరోజుల క్రితం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఈ విషయం గురించి ప్రస్తావించారు. భారత్ భూటాన్ ల మధ్య రైల్వే లైన్ రానుందని ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అసోంకి భూటాన్ కి మధ్య రైల్వే లైన్ ఏర్పాటు కానుందని, భూటాన్ టూరిజం పరంగా ముందుకు వెళ్లేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నదని, ఈ రైల్వేలైన్ వలన అసోం కి కూడా ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. అసోం సరిహద్దులో నిర్మాణం కానున్న గెలెఫు కొక్రాఝర్ రైల్వేలైనుతో వాణిజ్యం, టూరిజం రెండూ అభివృద్ధి చెందుతాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

భారత్ భూటాన్ రైల్వేప్రాజెక్టుతో ఎగుమతులు, ఇరుదేశాల సాంస్కృతిక అంశాలను పరస్పరం మార్చుకుంటూ ప్రోత్సహించుకోవటం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం లాంటి ప్రయోజనాలను పొందవచ్చని భావిస్తున్నారు. ఈ రైల్వేలైన్ ప్రతిపాదన భూటాన్ ప్రధాని మొదటి సారి 2018లో మనదేశాన్ని సందర్శించిన సందర్భంలో ఊపందుకుంది. గెలెఫు కొక్రాఝర్ రైల్వేలైను నిర్మాణం అనంతరం రెండు దేశాల దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో మరిన్ని రైల్వే లైన్లను ఏర్పాటు చేసే అవకాశం పెరుగుతుంది. 2005లో ఇరు దేశాలు సంతకాలు చేసిన ఒక అవగాహనా ఒప్పందంలోనే ఇరుదేశాల సరిహద్దు పట్టణాలను రైల్వే నెట్ వర్క్ ద్వారా అనుసంధానం చేయాలనే ఆకాంక్ష వ్యక్తమైంది.

మనదేశం భూటాన్ ల మధ్య 605 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతం ఉంది. అంతేకాదు భూటాన్ ఎగుమతుల్లో 98 శాతం, దిగుమతుల్లో 90 శాతం మనదేశానికి సంబంధించినవే. మనదేశం భూటాన్ కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో భూటాన్ కి రైల్వే నెట్ వర్క్ ఏర్పాటు అనేక విధాలుగా లాభదాయకంగా మారనుంది.

First Published:  10 Sep 2023 12:45 PM GMT
Next Story