Telugu Global
Travel

అగ్రసేన్‌ కీ బావోలీ... ఢిల్లీ మెట్లబావి

అగ్రసేన్‌ కీ బావోలి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కి ఒకటిన్నర కిలోమీటరు, ఇండియా గేట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

అగ్రసేన్‌ కీ బావోలీ... ఢిల్లీ మెట్లబావి
X

అగ్రసేన్‌ కీ బావోలి... అంటే అగ్రసేన్‌ బావి. ఇది మన మెట్లబావి... స్టెప్‌వెల్‌ అన్నమాట. గుజరాత్‌లోని రాణీ కీ వావ్, అదాలజ్‌ కా వావ్‌ వంటివి తెలిసినవే. స్టెప్‌వెల్‌ సంస్కృతి తెలంగాణలో కూడా ఉంది. ఈ అగ్రసేన్‌ బావి దేశరాజధాని ఢిల్లీలో ఉంది. నగరం మధ్య... అది కూడా నడిబొడ్డు వంటి కన్నాట్‌ ప్లేస్‌లో ఉంది ఈ మెట్లబావి.

మెయిన్‌ రోడ్డు మీదనే ఉంటుంది. కానీ ఆ బావి పక్కనే రోడ్డు మీద ఎన్నిసార్లు ప్రయాణించినా ఇక్కడ ఇలాంటి ఓ నిర్మాణం ఉందనే విషయం ఊహకు కూడా అందదు.

ఉగ్రసేన్‌ కీ బావోలి అనే బోర్డు పక్కన ఉన్న దారిలో లోపలికి వెళ్తే ఈ బావి కనిపిస్తుంది. నిజమే బోర్డు మీద 'ఉగ్రసేన్‌' అనే ఉంటుంది, కానీ అగ్రసేన్‌గా వ్యవహరిస్తారు. ఆవరణలోకి ప్రవేశించగానే చల్లదనం హాయినిస్తుంది. కన్నాట్‌ ప్లేస్‌లో పొల్యూషన్‌ బారి నుంచి ఒక్కసారిగా మరోలోకంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇది ఐదంతస్థుల బావి. వెడల్పు 15 మీటర్లు మాత్రమే ఉంటుంది, పొడవు 60 మీటర్లు. వెడల్పు తక్కువ, పొడవు ఎక్కువగా ఉండడంతో తొలి మెట్టు మీద నిలబడి బావి అవతలి ఆర్చ్‌లను చూస్తుంటే అగాథంలోకి పడిపోతామేమో అని భయం వేస్తుంది. 108 మెట్లు ఉంటాయి, కానీ పదిహేను మెట్లకు మించి బావిలోకి దిగడానికి వీల్లేకుండా బారికేడ్‌ ఉంటుంది. నగరాల్లో ఆరు–ఏడు అంగుళాల మెట్ల మీద అలవాటు పడిన వాళ్లకు ఆ పదిహేను మెట్లు దిగడం కూడా కష్టమే. బావికి కుడిఎడమల గోడలకు ఆర్చ్‌ల నిర్మాణం బాగుంటుంది. మంచి ఆర్కిటెక్చర్‌ అని ఒప్పుకోవాల్సిందే, అయితే రాణీ కీ వావ్‌ లాంటి వాటిని చూసిన తర్వాత దీనిని చూస్తే... అద్భుతం అనే భావన కలగదు. నగరం మధ్యలో హాయిగా ఒక పూట సమయం గడపడానికి మంచి ప్లేస్‌.



ఇదీ కథ!

పౌరాణిక పాత్ర కృష్ణుడి మేనమామ కంసుడి తండ్రి పేరు ఉగ్రసేన మహారాజు. అతడి రాజ్యం ఢిల్లీ, మధుర, ఆగ్రా ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. కాబట్టి ఆ ఉగ్రసేనుడి నిర్మాణంగానే భావిస్తారు. ఉగ్రసేనుడికి గౌరవంతో కూడిన అగ్రస్థానంతో అగ్రసేనుడిగా పిలిచేవారు. ఆగ్రా నగరానికి ఆ పేరు కూడా అగ్రసేనుడి పేరుతోనే వచ్చింది. దీని నిర్మాత ఎవరనేది స్పష్టంగా తెలియదు. కానీ క్రీ.పూ నాలుగవ శతాబ్దం నాటి నిర్మాణానికి క్రీ.శ పద్నాలుగవ శతాబ్దంలో అగర్వాల్‌ వంశస్థులు పునర్నిర్మించారు. ఆ సందర్భంగా తమను తాము అగ్రసేనుడికి వారసులుగా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే ఆధారం.


ఎక్కడ ఉందంటే...

అగ్రసేన్‌ కీ బావోలి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కి ఒకటిన్నర కిలోమీటరు, ఇండియా గేట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌లో దిగాలి. ఢిల్లీలో క్యాబ్‌ ధరలు కొంత రీజనబుల్‌గానే ఉంటాయి. కాబట్టి ఒక్కో ప్రదేశానికి వెళ్లి దిగేసి మనకు తోచినంత సేపు గడిపిన తరవాత మరో ప్రదేశానికి క్యాబ్‌ బుక్‌ చేసుకోవడం సౌకర్యం. ఎంట్రీ ఫీజు లేదు. పర్యాటకులను ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ గతంలో ఆత్మహత్యలు జరిగిన కారణంగా ఈ ఆంక్షలు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ పునరుద్ధరణ చేపట్టిన తర్వాత, ఆమిర్‌ఖాన్‌ 'పీకే' సినిమా చిత్రీకరణ తర్వాత ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.



ట్రావెల్‌ టిప్‌:

టూర్‌ ప్లాన్‌ చేసేటప్పుడు వికీపీడియాలోకి వెళ్లి ఆ నగరంలో ఉన్న చూడాల్సిన ప్రదేశాల జాబితాను పరిశీలిస్తాం. గూగుట్‌ సెర్చ్‌ ఇంజన్‌ చూపించిన లింకుల్లో మొదటి పది ప్రదేశాల జాబితాలతో సరిపుచ్చుకోకూడదు. వీలైనంత పెద్ద జాబితాను పరిశీలించి అందులో మనకు నచ్చే ప్రదేశాలను షార్ట్‌లిస్ట్‌ చేసుకోవాలి.

First Published:  19 Nov 2022 10:46 AM GMT
Next Story