Telugu Global
Telangana

వంద స్థానాల్లో YSRTP.. రెండు స్థానాల్లో షర్మిల పోటీ!

షర్మిల రెండు స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరుతో పాటు మిర్యాలగూడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని సమాచారం.

వంద స్థానాల్లో YSRTP.. రెండు స్థానాల్లో షర్మిల పోటీ!
X

కాంగ్రెస్‌తో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన YSRTP అధ్యక్షురాలు షర్మిల.. ఇక ఒంటరి పోరుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వంద‌ సీట్లలో పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం. తన పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరుతో షర్మిల తీవ్ర అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు షర్మిల రెండు స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరుతో పాటు మిర్యాలగూడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని సమాచారం. ఇక షర్మిల తల్లి విజయమ్మ కూడా తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి విజయమ్మ పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి గుడిపల్లి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతి కుమార్‌, ఆదిలాబాద్‌ నుంచి బెజ్జంకి అనిల్ కుమార్‌, చేవెళ్ల నుంచి దయానంద్‌, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేట నుంచి నర్సింహరెడ్డి, సిరిసిల్ల నుంచి చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేష్‌, అంబర్‌ పేట నుంచి సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

గురువారం షర్మిల కీలక సమావేశం నిర్వహిస్తారని, సమావేశం అనంతరం అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. షర్మిల బరిలో ఉంటే వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకి మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్‌కు నష్టం తప్పదని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో సైతం ఫైనలైజ్ చేస్తార‌ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  11 Oct 2023 2:04 PM GMT
Next Story