Telugu Global
Telangana

పార్టీకి శుభం కార్డు పడిపోయిందా?

వైఎస్సార్టీపీ ఏర్పాటు చేసి కాస్త హడావుడి చేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవటంతో ఎటూ కాకుండా అయిపోయారు. ఇప్పుడు షర్మిల ఏం చేస్తున్నారంటే ప్రెస్ మీట్లు, ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమైపోయారు.

పార్టీకి శుభం కార్డు పడిపోయిందా?
X

చివరకు వైఎస్ షర్మిల పరిస్థితి ఇలాగైపోయింది. వైఎస్సార్టీపీ ఏర్పాటు చేసి కాస్త హడావుడి చేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవటంతో ఎటూ కాకుండా అయిపోయారు. ఇప్పుడు షర్మిల ఏం చేస్తున్నారంటే ప్రెస్ మీట్లు, ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమైపోయారు. పార్టీ పెట్టి ఏదో సాధించేద్దామని అనుకుని వైఎస్సార్టీపీని పెట్టారు. దాదాపు రెండేళ్ళు హడావుడి చేసినా జనాలు ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. చివరకు పాదయాత్ర చేసినా ఉపయోగంలేకపోయింది.

ఇదే సమయంలో కాంగ్రెస్ నుండి విలీనమనే ఆఫర్ వచ్చింది. అయితే షర్మిల మాత్రం ముందు పొత్తు కోసం పట్టుబట్టినా చివరకు విలీనానికి అంగీకరించక తప్పలేదు. పోటీ చేసే స్థానంపై చర్చలన్నారు, పార్టీ బాధ్యతలు తీసుకుని ఏపీకి వెళ్ళమన్నారనే ప్రచారం జరిగింది. అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులై కర్నాటక నుండి రాజ్యసభకు వెళ్ళబోతున్నారని ప్రచారమూ తెలిసిందే. విలీనానికి ముహూర్తాలు కూడా ఫిక్సయిపోయి వాయిదాలు పడ్డాయి. విలీనం వార్తను మాత్రం షర్మిలే ప్రకటించారు.

అయితే చివరకు ఏమైందంటే పొత్తు లేదు, విలీనం లేదు చివరకు ఒంటరి పోటీ కూడా లేకుండానే పార్టీకి శుభం కార్డు పడిపోయింది. ఇప్పటి ఎన్నికల్లో పార్టీ పోటీ చేయటం లేదంటే తర్వాత జరిగే ఎన్నికల వరకు పార్టీ ఉంటుందనే నమ్మకం కూడా ఎవరిలోనూ లేదు. ఇప్పుడు షర్మిల ఏం చేస్తున్నారంటే మీడియా సమావేశాలు, ట్విట్టర్లో ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. పోటీ నుండి తప్పుకున్న తర్వాత కాంగ్రెస్‌కు ఓట్లేయండని జనాలకు పిలుపిచ్చారు. దాంతో ఆమె కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తారని అనుకున్నారు.

అయితే చివరకు ఆమె ప్రచారం కూడా చేయటంలేదు. కాంగ్రెస్ తరపున ఏ నియోజకవర్గంలో కూడా ప్రచారం చేసినట్లు లేరు. ఇక్కడే షర్మిల మీద, ఆమె పార్టీ మీద జనాల్లో నమ్మకం పూర్తిగా పోయింది. పార్టీ పెట్టి ఒక్క ఎన్నికల్లో కూడా పోటీచేయకుండానే చరిత్రలో కలిసిపోబోయే పార్టీ బహుశా వైఎస్సార్టీపీ మాత్రమేనేమో. ఒకప్పుడు విజయశాంతి ఆధ్వర్యంలో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పడినా దాన్ని ఆమె టీఆర్ఎస్‌లో విలీనం చేసేశారు. అందుకనే ఇప్పుడు షర్మిల పార్టీకి శుభం కార్డు పడిపోయిందనే అనుకుంటున్నారు.


First Published:  27 Nov 2023 4:35 AM GMT
Next Story