Telugu Global
Telangana

ఆ స్థానం నుంచే అసెంబ్లీకి పోటీ.. ఫిక్స్ అయిన వైఎస్ షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయినట్లే తెలుస్తోంది.

ఆ స్థానం నుంచే అసెంబ్లీకి పోటీ.. ఫిక్స్ అయిన వైఎస్ షర్మిల!
X

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయినట్లే తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తనకు సేఫ్ అని ఆమె భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి నుంచే పార్టీ ఎన్నికల కార్యచరణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 16న పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లనున్న షర్మిల తన పోటీపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతోంది.

పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులు కూడా ఎక్కువే. సామాజిక వర్గాల పరంగా చూస్తే.. ఇక్కడ రెడ్డి కులానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వీరితో పాటు గిరిజన ఓటర్లు సెగ్మెంట్‌లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.


2016 ఉపఎన్నికలో తప్ప 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లోకి వలస వెళ్లారు.

అన్ని రకాలుగా పాలేను నియోజకవర్గం తనకు సేఫ్ అని షర్మిల భావిస్తున్నారు. ఖమ్మం పట్టణానికి ఆనుకొని ఉన్నా.. పూర్తిగా రూరల్ ఓటర్లే ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉన్నది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల భావిస్తున్నారు. కానీ, ఆయనకు టికెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇక బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటే పాలేరు నుంచి సీపీఎం పోటీ చేయాలని భావిస్తోంది.


కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే షర్మిల పాలేరును ఎంచుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. అదే జరిగితే ఇక్కడ పోటీ చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై తన ఫోకస్ ఉంటుంది. కానీ పాలేరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు షర్మిల తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు మూడు వారాల పాటు పాదయాత్ర వాయిదా వేసినట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. సంక్రాంతి తర్వాత పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తానని ఆమె స్పష్టం చేశారు.

First Published:  14 Dec 2022 11:11 AM GMT
Next Story