Telugu Global
Telangana

పోలీసుల అదుపులో షర్మిల... వైఎస్ విజయమ్మ గృహ నిర్బంధం

తనపై జరిగిన దాడికి నిరసనగా ఇవ్వాళ ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల ధ్వంసమైన అదే కారులో వెళ్తుండగా పంజగుట్ట సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల అదుపులో షర్మిల... వైఎస్ విజయమ్మ గృహ నిర్బంధం
X

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఆమె పర్యటించారు. శంకరం తండా సమీపంలో నిలిపిన షర్మిల కారావాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. పక్కనే ఉన్న ఆమె ఇన్నోవా వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు షర్మిలను హైదరాబాద్ తరలించారు.

తనపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ధ్వంసమైన అదే కారులో ఆమె కూడా ముట్టడికి వెళ్తుండగా పంజగుట్ట సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే తిరిగి వెళ్లిపోవాలని షర్మిలను కోరారు. కానీ షర్మిల మాత్రం అందుకు నిరాకరించి కారులోనే కూర్చుకున్నారు. మరోవైపు ట్రాఫిక్ జాం ఏర్పడటంతో షర్మిల కారులో ఉండగానే క్రేస్ సహాయంతో కారును అక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీఐపీ మూవ్‌మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్‌ను అడ్డుకున్నారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు.

పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పంజగుట్టతో పాటు రాజ్ భవన్ రోడ్డులో ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కాగా, తన కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త తెలుసుకున్న విజయమ్మ.. లోటస్ పాండ్ నుంచి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఆమెను పోలీసులు లోటస్ పాండ్ వద్దే అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఈ సమయంలో విజయమ్మ, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.

తన కుమార్తెను చూడటానికి వెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని పోలీసులను విజయమ్మ ప్రశ్నించారు. పోలీసుల చర్యను తప్పబడుతూ ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగుతున్నట్లు విజయమ్మ ప్రకటించారు. పోలీసుల ఎదుటే ఆమె దీక్షకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

First Published:  29 Nov 2022 11:07 AM GMT
Next Story