Telugu Global
Telangana

రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల

వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఇలా రాహుల్ గాంధీకి ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల
X

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'రాహుల్ గాంధీజీ.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చింది. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీ నిజాయితీ కలిగిన కృషితో ప్రజలకు సేవ చేయాలి. మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, విజయాలను సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

తెలంగాణలో రెండేళ్ల క్రితం స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఇలా రాహుల్ గాంధీకి ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆమెకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలోని హైకమాండ్‌ను కలిసి షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై చర్చలు జరిగినట్లు సమాచారం.

అయితే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరస్పర విరుద్దమైన నివేదికలు పంపడంతో.. అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నది. ఈ నెల 22న రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుంచి తిరిగి ఇండియాకు రానున్నారు. ఆ తర్వాత షర్మిల విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.


First Published:  19 Jun 2023 5:38 AM GMT
Next Story