Telugu Global
Telangana

నోరు జారి.. నాన్న పరువు తీసేసిన వైఎస్ షర్మిల

తెలంగాణలో ఫైర్ బ్రాండ్‌గా మారాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.

YS Sharmila
X

YS Sharmila

తెలంగాణలో ఫైర్ బ్రాండ్‌గా మారాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. అన్న వైఎస్ జగన్ వెంట చాలా కాలం నడిచి.. ఆయన ఏపీలో సీఎం అయిన తర్వాత షర్మిల తన దారి తాను చూసుకున్నారు. తెలంగాణ కోడలిగా రాజకీయ పార్టీ నెలకొల్పి.. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలోని గ్రామ గ్రామాన తిరుగుతూ సీఎం కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురు, జగన్ చెల్లెలు అనే ముద్ర నుంచి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

వైఎస్ఆర్‌టీపీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేలా మార్చడానికి అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. నిరుద్యోగం, నోటిఫికేషన్లు, ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు, దళిత బంధు ఇలా ప్రతీ అంశంలో కేసీఆర్‌ను విమర్శిస్తూ మైలేజీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడప్పుడూ తీవ్రమైన ఆగ్రహంతో నోరు జారుతూ విమర్శలకు కేంద్రంగా నిలుస్తున్నారు. తాజాగా షర్మిల అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు ఆమెకే రివర్స్ కొట్టాయి.

దివంగత ముఖ్యమంత్రి, షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఉదాహరణగా చూపుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. 'తెలంగాణలో ప్రాజెక్టులన్నీ ఒక్క మనిషికే కట్టబెడుతున్నారు. 80 శాతం ప్రాజెక్టులు ఒకరికే ఇచ్చారు. తెలంగాణ మొత్తాన్ని ఆయన చేతిలోనే పెట్టారు' అని అన్నారు. ఇక్కడ వరకు బాగనే ఉన్నా.. ఆ తర్వాతే ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 'రాజశేఖర్ రెడ్డి ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఒక్కరి దగ్గరే కమీషన్లు తీసుకోలేదు' అంటూ నోరు జారారు. ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు అని వ్యాఖ్యానించి వదిలేస్తే సరిపోయేది. కానీ కమీషన్లు అన్న మాట దగ్గరే ఇప్పుడు భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.

వైఎస్ఆర్ ఎంతోమంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. ఆయన ఎంతో డెవలప్‌ చేశారు. కేసీఆర్ మాత్రం కరప్షన్ చేశారు అని మాట్లాడిన వైఎస్ షర్మిల.. ఆ తర్వాత కమీషన్లు అనే మాట జారి విమర్శలపాలవుతున్నారు. షర్మిల మాటలను కేవలం మిస్టేక్స్‌గా తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇప్పటికైనా తన తండ్రి గురించి నిజం చెప్పిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ అభిమానులు మాత్రం షర్మిల మాట తీరుపై మండిపడుతున్నారు. వైఎస్ గురించి మాట్లాడే సమయంలో కాస్త సమన్వయం పాటిస్తే మంచిదని, ఇలా ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నామో అర్దం కాకుండా పోతుందని మండిపడుతున్నారు.

ఏదేమైనా షర్మిల మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అనవసరంగా తన తండ్రి పరువును తీశారని అంటున్నారు. షర్మిల ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా.. అవి ఆమెకే కాకుండా వైఎస్ఆర్ పాలనపై కూడా బురదజల్లేలా చేశాయి. మరి ఈ విమర్శలకు షర్మిల ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

First Published:  26 July 2022 5:42 AM GMT
Next Story