Telugu Global
Telangana

న్యాయం జ‌ర‌గాల్సిందే.. సీబీఐ నోటీసుల‌పై స్పందించిన ష‌ర్మిల‌

ఈ కేసు విచారణలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలని వైఎస్ ఫ్యామిలీ మొత్తం కోరుకుంటోందన్నారు.

న్యాయం జ‌ర‌గాల్సిందే.. సీబీఐ నోటీసుల‌పై స్పందించిన ష‌ర్మిల‌
X

వివేకా హత్య కేసులో ఎంపీ అనివాష్ రెడ్డికి నోటీసులపై వైఎస్‌ షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప నాయకుడని.. అలాంటి వ్యక్తిని గొడ్డళ్లతో దారుణంగా హత్య చేస్తే ఇంతకాలమైనా తేల్చలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.


ఇంత ముఖ్యమైన కేసుల్లోనూ ఇంత ఆలస్యం జరిగితే ఇక దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం ఎక్కడ ఉంటుందని షర్మిల ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలని వైఎస్ ఫ్యామిలీ మొత్తం కోరుకుంటోందన్నారు.

అటు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆమె విశ్లేషించారు. ఒకవేళ ముందస్తుకు వెళ్లాల‌నుకుంటే ఎన్నికలు కాకుండా.. రాష్ట్రపతి పాలనను కేంద్రం విధించే అవకాశం ఉందన్నారు.


బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలంటే కేసీఆర్‌కు ముఖ్యమంత్రి హోదా చాలా అవసరమని కాబట్టి ముందస్తుకు వెళ్లే పరిస్థితే ఉండదన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వారే ముందస్తు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.


ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను అధ్యక్షుడిగా నియమించారని కాంగ్రెస్‌లోనే రేవంత్ పై వ్యతిరేకత ఉందని.. అందుకే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. ఈ సమయంలో తనను తొలగిస్తే పార్టీకి ఇబ్బంది వస్తుందన్న వాతావరణాన్ని సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని షర్మిల విశ్లేషించారు.

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి కులం లేదు, మతం లేదని.. తమదో లౌకిక పార్టీ అని అలాంటప్పుడు బీజేపీతో తమకు ఎలా పొంతన కుదురుతుందని ప్రశ్నించారు. తమ పార్టీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనను చూసి భయపడే ఖమ్మంలో కేసీఆర్ బీఆర్‌ఎస్‌ సభ పెట్టారని షర్మిల చెప్పుకొచ్చారు. ఈనెల 28 నుంచి తిరిగి పాదయాత్రను షర్మిల ప్రారంభించబోతున్నారు. నాలుగు వేల కి.మీ వరకు షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ ప్రకటించింది. పాదయాత్ర ఆగినచోటు నుంచే ప్రారంభమవుతుంది.

First Published:  24 Jan 2023 9:03 AM GMT
Next Story