Telugu Global
Telangana

పొలిటికల్ సూసైడ్ అని తెలిసి కూడా ఆ పని చేశా..

తన కష్టం వృథా అవుతుందని తెలిసికూడా, ఇది పొలిటికల్ సూసైడ్ అవ్వొచ్చని తెలిసి కూడా ఎన్నికల నుంచి తాను విరమించుకున్నానని అన్నారు షర్మిల. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే కారణంతోనే ఆ పని చేశానని చెప్పారు.

పొలిటికల్ సూసైడ్ అని తెలిసి కూడా ఆ పని చేశా..
X

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వైఎస్ షర్మిల కాస్త ఆలస్యంగా స్పందించారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె తమ కల కాంగ్రెస్ ద్వారా నెరవేరబోతోందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు షర్మిల. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తాను పోరాటాలు, నిరసనలు, పాదయాత్రలు చేశానని.. కానీ చివరి రోజుల్లో తన లక్ష్యం నెరవేరేందుకే పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తన కష్టం వృథా అవుతుందని తెలిసికూడా, ఇది పొలిటికల్ సూసైడ్ అవ్వొచ్చని తెలిసి కూడా ఎన్నికల నుంచి తాను విరమించుకున్నానని అన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే కారణంతోనే ఆ పని చేశానని, కాంగ్రెస్ కి మద్దతిచ్చానని, కాంగ్రెస్ వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రజలకు విమోచన కలుగుతోందని చెప్పారు షర్మిల. తన త్యాగం కేవలం తెలంగాణ ప్రజలకోసమేనన్నారు.

తాను పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తనతో కలసి పోరాటం చేసినవారు.. తాను పోటీ నుంచి విరమించుకున్న తర్వాత తిరిగి బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు షర్మిల. వారంతా అమ్ముడుపోయారని ప్రజలు అనుకుంటున్నారని, ఆ మాటలతో తనకు బాధ వేసిందన్నారు. వారంతా బీఆర్ఎస్ లో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. రేపటితో బీఆర్ఎస్ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతోందని చెప్పారు షర్మిల.

కర్నాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 71మంది ఎమ్మెల్యేలు కేవలం 10వేల మెజార్టీతో గెలిచారని.. అలాంటి పరిస్థితి ఇక్కడ వస్తే తన పార్టీ పోటీలో ఉంటే కాంగ్రెస్ నేతల జాతకాలు తారుమారయ్యేవని, అందుకే తాము పోటీ నుంచి విరమించుకున్నామని చెప్పారు షర్మిల. తమకు వచ్చే ఓట్లతో కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందని, అందుకే పోటీలో లేకుండా వారిని గెలిపించామన్నారు.


First Published:  2 Dec 2023 7:43 AM GMT
Next Story