Telugu Global
Telangana

కాంగ్రెస్‌తో పొత్తుకు షర్మిల పరోక్ష సంకేతాలు

షర్మిల వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆమె కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారే గానీ.. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని చెప్పడం లేదు. పైగా కేసీఆర్‌తో పొత్తు ఉండదని హామీ ఇవ్వాలంటూ ఒక డిమాండ్ పెట్టారు.

YS Sharmila: కాంగ్రెస్‌తో పొత్తుకు షర్మిల పరోక్ష సంకేతాలు
X

కాంగ్రెస్‌తో పొత్తుకు షర్మిల పరోక్ష సంకేతాలు

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోతున్నారు.. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమెకు రాజ్యసభ ఇచ్చి ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తారన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. డీకే శివకుమార్‌తోనూ షర్మిల వరుస భేటీలు నడుస్తున్నాయి.

ఈ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా షర్మిల అచితూచీ స్పందించారు. విలీనం అన్న పదం వాడవద్దని కోరారు. విలీనం చేసేందుకైతే తాను ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఏముందన్నారు. తాను చేరాలనుకుంటే ఆ రోజే కాంగ్రెస్‌, బీజేపీ, కేసీఆర్‌ కూడా వారి పార్టీలోకి ఆహ్వానించి ఉండేవారన్నారు.

తాము ఇప్పుడు అభ్యర్థులను తయారు చేసుకునే పనిలో ఉన్నామన్నారు. పొత్తులపై దాటవేసేందుకు ఆమె ప్రయత్నించగా మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించడంతో.. పరోక్షంగా తన ఆలోచన బయటపెట్టారు.

ఇది ఎన్నికల ఏడాది కాబట్టి రాజకీయ పార్టీలు చర్చించుకుని పొత్తులు పెట్టుకుంటాయన్నారు. పొత్తులు కోరుతున్న పార్టీలు ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 14 మందిని కేసీఆర్ తీసుకున్నారని.. కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యేల సరఫరా సంస్థగా మారిందన్నారు.

ఈసారి కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు కేసీఆర్‌ వైపు వెళ్లరన్న గ్యారెంటీ కాంగ్రెస్‌ ఇవ్వగలదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందే కాకుండా ఎన్నికల తర్వాత కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని కాంగ్రెస్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ విషయంపై ఇప్పుడే కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వాలన్నారు. తాము మాత్రం ఎన్నటికీ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోమన్నారు.

షర్మిల వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆమె కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారే గానీ.. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని చెప్పడం లేదు. పైగా కేసీఆర్‌తో పొత్తు ఉండదని హామీ ఇవ్వాలంటూ ఒక డిమాండ్ పెట్టారు. ఆ హామీ ఇవ్వడం కాంగ్రెస్‌కు ఏమంతా కష్టం కాదు. సో.. బీఆర్‌ఎస్‌తో కలవబోమని కాంగ్రెస్ హామీ ఇస్తే ఆ పార్టీతో పొత్తుకు షర్మిల సిద్ధంగానే ఉన్నట్టు అనిపిస్తోంది.

First Published:  1 Jun 2023 3:24 PM GMT
Next Story