Telugu Global
Telangana

రేవంత్ పై షర్మిలకు అంత అక్కసు ఉందా..?

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్నకు షర్మిల తెలివిగా సమాధానం చెప్పారు. వ్యూహాత్మకంగానే ఆమె రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు.

రేవంత్ పై షర్మిలకు అంత అక్కసు ఉందా..?
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. అయితే ఆ వైరం ఏ స్థాయిలో ఉందనే విషయం మరోసారి బయటపడింది. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల.. రేవంత్ రెడ్డి పేరెత్తడానికి కూడా ఇబ్బందిపడ్డారు. ఆయనపై పరోక్ష విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థులు, క్రెడిబిలిటీ ఉన్నవారు, బ్లాక్ మెయిలర్స్ కానివాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు షర్మిల. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది కాంగ్రెస్ నిర్ణయించుకుంటుందన్నారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మధ్య జరిగిన దోబూచులాట అందరికీ తెలిసిందే. వైఎస్సార్టీపీ తరపున తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన షర్మిల, చివరి నిమిషంలో తన ఆలోచన మార్చుకున్నారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీలో ఆమె వైఎస్సార్టీపీని విలీనం చేయాలనుకున్నారు, ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు కూడా. అయితే ఆ తర్వాత పరిణామాలు మళ్లీ మారిపోయాయి. మళ్లీ షర్మిల సొంతగా బరిలో దిగాలనుకోవడం, ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం, చివరకు మళ్లీ పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతు తెలపడం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీకి అడ్డుపడింది రేవంత్ రెడ్డి అనే ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను లైట్ తీసుకుందని, దీంతో ఆమె చేసేదేం లేక పోటీ నుంచి తప్పుకున్నారని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకున్నారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డిపై షర్మిలకు మరింత కోపం పెరిగింది. అది ఈ రోజు బయటపడింది.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్నకు షర్మిల తెలివిగా సమాధానం చెప్పారు. వ్యూహాత్మకంగానే ఆమె రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. కాంగ్రెస్ లో చాలామంది సమర్థులున్నారని చెప్పారు. "ఉత్తమ్ అన్న ఒక ఆర్మీ మ్యాన్. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి. డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. ఫెయిత్ ఫుల్ కాంగ్రెస్ లీడర్. భట్టి అన్న దళితుడు. నిజంగానే పాదయాత్ర చేశారు, కార్లలో తిరగలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ నిర్ణయిస్తుంది." అంటూ ముక్తాయించారు. సమర్థులు అంటూ.. కేవలం ఉత్తమ్, భట్టి పేర్లు ప్రస్తావించిన ఆమె, రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం విశేషం. అదే సమయంలో బ్లాక్ మెయిలర్లు అంటూ ఆమె పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.

*

First Published:  2 Dec 2023 9:06 AM GMT
Next Story