Telugu Global
Telangana

యువత కూడా వస్త్ర పరిశ్రమలో భాగస్వామ్యం కావాలి : మంత్రి కేటీఆర్

ఇతర రాష్ట్రాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పోటీ పడేందుకు వీలుగా మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.

యువత కూడా వస్త్ర పరిశ్రమలో భాగస్వామ్యం కావాలి : మంత్రి కేటీఆర్
X

యువత కూడా వస్త్ర పరిశ్రమలో భాగస్వామ్యం కావాలి. వాళ్లు ఈ పరిశ్రమ వైపు వచ్చేలా ప్రోత్సహించాలని పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, టైక్స్‌టైల్ శాఖ అధికారులతో సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

ఇప్పటికే బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆదాయం పెరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పోటీ పడేందుకు వీలుగా మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అందు కోసం టెక్స్‌టైల్ కార్పొరేషన్ సహకారంతో పారిశ్రామికవేత్తలు అధ్యయనం చేయాలని సూచించారు. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన బారామతి, తిరుచూరు వంటి ప్రాంతాలను సందర్శించి అక్కడి వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని పరిశీలించి, తగిన అధ్యయనం చేయాలని చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్దతులను ఇక్కడ కూడా అనుసరించేలా చూడాలని మంత్రి వారిని కోరారు. యువతను కూడా వస్త్ర పరిశ్రమకు వచ్చేలా వారిని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ కార్పొరేషన్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అన్ని రకాల వస్త్ర పరిశ్రమలను సిరిసిల్లలో స్థాపించేలా కృషి చేయడం వల్ల స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.


First Published:  9 Aug 2023 2:00 AM GMT
Next Story