Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ శుభాకాంక్షలు

చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరుంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేందుకు చంద్రబాబు పరోక్షంగా సహకారం అందించారని కూడా ప్రచారం ఉంది.

రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ శుభాకాంక్షలు
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ కొన‌సాగుతోంది. టీడీపీ నాయకులు బాలకృష్ణ, అచ్చెన్నాయుడు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కానీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడంలో వింతేమీ లేదు కానీ, వైసీపీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి తన తోటి పార్లమెంటు సభ్యుడని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని రేవంత్‌ను ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన హామీలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరుంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేందుకు చంద్రబాబు పరోక్షంగా సహకారం అందించారని కూడా ప్రచారం ఉంది. కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏపీలో జగన్ కు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నాయకుడైన విజయసాయిరెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ కు శుభాకాంక్షలు చెబుతూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  6 Dec 2023 12:32 PM GMT
Next Story