Telugu Global
Telangana

శుచి, శుభ్రం.. యాదాద్రి ప్రసాదం

దేవస్థానంలోని అన్నదానం, రామానుజ కూటం, ప్రసాద తయారీ, వివిధ వంటశాలలు, ఆహార పదార్థాల నాణ్యత తయారీలో ఆచరిస్తున్న పద్ధతులను ఫుడ్ సేఫ్టీ బృందంలోని అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

శుచి, శుభ్రం.. యాదాద్రి ప్రసాదం
X

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు కేంద్ర ఫుడ్ సేఫ్టీ బృందం అధికారులు. త్వరలో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ జారీ చేయబోతున్నారు. తెలంగాణలో ఈ సర్టిఫికెట్ అందుకునే తొలి దేవస్థానం యాదాద్రి కావడం విశేషం.




యాదాద్రిలో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచి శుభ్రతతోపాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ బృందం గుర్తించింది. ఇండోర్‌ నుంచి కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ ఆడిటర్‌ వికాస్‌ మిశ్రా ఆధ్వర్యంలో వచ్చిన బృందం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించింది. దేవస్థానంలోని అన్నదానం, రామానుజ కూటం, ప్రసాద తయారీ, వివిధ వంటశాలలు, ఆహార పదార్థాల నాణ్యత తయారీలో ఆచరిస్తున్న పద్ధతులను ఫుడ్ సేఫ్టీ బృందంలోని అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సురక్షిత, పరిశుభ్రమైన ప్రసాదాల తయారీపై సిబ్బందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేశారు.

ఆలయానికి అరుదైన గుర్తింపు..

దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదాల తయారీని పరిశీలించి సర్టిఫికెట్లు అందజేస్తుంది కేంద్ర బృందం. తెలంగాణలో ఈ తరహా సర్టిఫికెట్ అందుకునే తొలి ఆలయంగా యాదాద్రి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా ప్రసాదం తయారీ, అన్నదానం జరిపే విధానం, నాణ్యతా ప్రమాణాలపై కేంద్ర బృందం పలు సూచనలు కూడా చేసింది. యాదాద్రితోపాటు పలు ఇతర ఆలయాలను కూడా పరిశీలించి సర్టిఫికెట్లు ఇస్తారని రాష్ట్ర నోడల్‌ అధికారి జ్యోతిర్మయి తెలిపారు. యాదాద్రి ఆలయ ప్రసాదం రుచికరంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తయారీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం, తయారీ విధానం కూడా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంది. దీంతో యాదాద్రి ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించినట్టయింది. భగవంతుడికి అర్పించే నైవేద్యం, భక్తులకు అందజేసే ప్రసాదం, అన్నదాన తయారీలో సురక్షిత, ఆరోగ్యకరమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్ర బృందం ప్రశంసించింది.

First Published:  5 Jan 2023 2:02 AM GMT
Next Story